You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Balakot: ‘యుద్ధం వస్తుందన్న అనుమానంతో సరుకులు నిల్వ చేసుకుంటున్నారు’
- రచయిత, సమీర్ యాసిర్
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ వైమానిక దాడి వార్త వెలువడగానే, శ్రీనగర్ వీధుల్లో ప్రజలు ఆందోళనతో కనిపించారు. ఏదో జరగబోతుందని గత మూడు రోజులుగా కశ్మీర్ లోయలో నెలకొన్న టెన్షన్‌కు అనుగుణంగానే 'మిలిటెంట్ క్యాంపు'లపై దాడి జరిగింది.
''భారత్-పాక్ మధ్య ఏది జరిగినా మొదట ఆందోళన చెందేది మేమే'' అని శ్రీనగర్‌లోని బ్యాంక్ ఉద్యోగి షాబీర్ ఆఖూన్ అన్నారు.
''రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరాటంలో, వాటి కాళ్ల కింద నలిగిన పచ్చికలాగ కశ్మీర్ పరిస్థితి కూడా తయారైంది'' అని భారత్-పాక్ గురించి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యతో షాబీర్ అభిప్రాయం పోలి ఉంది.
వైమానిక దాడి విజయవంతం అయ్యిందంటూ భారత మీడియా కొన్ని ఫోటోలను ప్రసారం చేస్తుంటే, మరోవైపు కశ్మీర్ ప్రజలు మాత్రం.. ఈ పరిణామాలు తమపై తీవ్రంగా ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు.
''ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఈ సంఘటనలను ఎదుర్కొంటోంది. కానీ ఎన్నికల కోసం కశ్మీర్ పేరును వాడుకోవాల్సింది కాదు'' అని శ్రీనగర్‌కు చెందిన సాజియా సుల్తాన్ అనే టీచర్ అన్నారు.
గొడవలు జరగకుండా అడ్డుకోవడానికి శ్రీనగర్‌లోని చాలా ప్రాంతాల్లో పోలీసుల, పారామిలిటరీ బలగాలను మోహరించాలి.
పెద్దఎత్తున యుద్ధం వస్తుందన్న అనుమానాలతో ప్రజలందరూ సరుకులను నిల్వ చేసుకుంటున్నారు.
చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, ప్రధాన రహదారులు ట్రాఫిక్‌తో నిండిపోయాయి.
''ఇలాంటి సందర్భాల్లో ఛాన్స్ తీసుకోలేం కదా.. కచ్చితంగా యుద్ధం వస్తుందని చెప్పలేకపోయినా, మా ఏర్పాట్లలో మేం ఉండాలి'' అని శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఉద్యోగి సుహైల్ అహ్మద్ అన్నారు.
కశ్మీర్ లోయను కబళిస్తున్న ఉద్రక్త వాతావరణం నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి అధికారులు.. ఆ ప్రాంతంలో నిత్యావసర సరుకుల నిల్వలు, వైద్య సేవల గురించి ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమేదో తీసుకోనుందని కొందరు అప్పుడే ఊహించామని చెప్పారు.
''పెద్దది ఏదో జరగబోతుందని ముందుగానే ప్రభుత్వం.. ప్రజలకు ఇలాంటి సూచనలు చేసింది'' అని సుహైల్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)