అమెరికా మధ్యంతర ఎన్నికలు: ప్రతినిధుల సభలో పట్టు కోల్పోయిన డోనల్డ్ ట్రంప్

    • రచయిత, ఆంథోని జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసి రెండువారాలు గడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ వేడి నెమ్మదిగా చల్లారుతోంది. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ‘ఇది పూర్తిస్థాయి విజయం’ అన్నారు. కానీ, వాస్తవానికి పరిస్థితి అలా లేదు.

మధ్యంతర ఎన్నికల తరువాత, ఎనిమిదేళ్లలో తొలిసారిగా ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ, ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్)‌లో ఆధిక్యం కోల్పోయింది.

సెనేట్‌లో ఈసారి చారిత్రక విజయం నమోదు చేస్తామని రిపబ్లికన్లు భావించారు. కనీసం నాలుగు సీట్లయినా ఎక్కువగా గెలుస్తామని ట్రంప్ ఊదరగొట్టారు. అలా జరిగుంటే వందేళ్లలో రిపబ్లికన్ పార్టీకి సెనేట్‌లో అత్యధిక మెజారిటీ లభించి ఉండేది. కానీ ట్రంప్ చెప్పినట్లు జరగలేదు. కేవలం ఒకేఒక్క సీటు అదనంగా అది సాధించింది.

ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన సరిగ్గా రెండేళ్లకు జరిగిన ఈ మధ్యంతర ఎన్నికలు, ఆయనకు లాభం కంటే నష్టాన్నే ఎక్కువ కలిగించాయి.

నవంబర్ 6న పోలింగ్ జరిగిన రోజు సాయంత్రానికే ప్రతినిధుల సభ డెమొక్రాట్ల వశమవుతుందని తేలిపోయింది. వాళ్లకు ఎంత మెజారిటీ వస్తుందనే దానిపైనే అప్పుడు చర్చ జరిగింది.

అన్నిటికంటే పెద్ద దెబ్బ ట్రంప్‌కు కాలిఫోర్నియాలో ఆరెంజ్ కౌంటీలో తగిలింది. ఒకప్పుడు రోనల్డ్ రీగన్ ఆ ప్రాంతాన్ని రిపబ్లికన్ల స్వర్గధామంగా అభివర్ణించారు. కానీ, ఇప్పుడది డెమొక్రాట్ల అధీనంలోకి వచ్చింది.

మధ్యంతర ఎన్నికల తరువాత ఆ కౌంటీలోని నాలుగు డిస్ట్రిక్ట్‌లు రిపబ్లికన్ల చేజారిపోయాయి. దాంతో 1940 తరువాత తొలిసారిగా ఆ కౌంటీలోని ప్రతినిధుల సభకు ఉన్న ఏడు సీట్లూ ఇప్పుడు డెమొక్రాట్ల పాలనలోకి వెళ్లిపోయాయి.

ఈ దెబ్బతో కాలిఫోర్నియా రాష్ట్రంపై డెమొక్రాట్లు పూర్తి పట్టు సాధించినట్లయింది. ఆ రాష్ట్రం నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 53మందిలో రిపబ్లికన్ పార్టీకి చెందిన కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు.

దక్షిణ వాషింగ్టన్‌లోని కొద్దిమంది రిపబ్లికన్ ప్రతినిధుల్ని మినహాయిస్తే, అమెరికాలోని మొత్తం పసిఫిక్ తీర ప్రాంతంలోని ప్రతినిధుల సభ సీట్లన్నీ డెమొక్రాట్ల అధీనంలోనే ఉన్నాయి.

2016 ఎన్నికల సమయంలో కూడా డెమొక్రాట్ అభ్యర్థి హిలరీ క్లింటన్‌ ఈ ప్రాంతంలో ట్రంప్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించారు. ఇప్పటికీ ట్రంప్ అక్కడ ప్రాబల్యాన్ని దక్కించుకోలేకపోయారు.

మొత్తమ్మీద 1974 ఎన్నికల తరువాత ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సాధించిన అతిపెద్ద మెజారిటీ ఇదే.

ప్రతినిధుల సభలో విజయం డెమొక్రాట్లకు తీపి కబురే అయినా, సెనేట్‌లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ అధికారంలో ఉన్న డెమొక్రాట్ దిగ్గజాలు ఎన్నికల్లో తమ సీట్లు కోల్పోయారు. ఇండియానా, ఉత్తర డకోటా లాంటి ప్రాంతాల్లో సిట్టింగ్ సెనేట్ సీట్లలో డెమొక్రాట్లు ఓడిపోయారు.

కానీ, ట్రంప్ చేతిలో ఉన్న వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియాతో పాటు ఇతర ప్రాంతాల్లో సెనేట్ సీట్లను డెమొక్రాట్లు గెలిచినప్పటికీ మొత్తమ్మీద వారికి ఆశించిన స్థానాలు రాలేదు.

మరోపక్క ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన ఫ్లొరిడాలో సెనేట్ స్థానానికి రిపబ్లికన్ అభ్యర్థి గెలుపొందడం ఆయనకు మరింత సంతోషాన్నిచ్చింది.

2016 ఎన్నికలతో పోలిస్తే, సెనేట్‌లో అదనంగా ఒక్క సీటు గెలుచుకొని ట్రంప్ తన పాలనలో రెండో అంకంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 53-47గా ఉంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ట్రంప్‌వైపే ఉన్నారు.

మొత్తంగా డెమొక్రాట్లు పుంజుకున్నప్పటికీ వారి విజయాన్ని ప్రస్తావించకుండా, కేవలం తమ పార్టీ గెలుపునే చరిత్రాత్మక విజయమని పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఎన్నికల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, తనకు పూర్తి స్థాయిలో సహకరించని రిపబ్లికన్ అభ్యర్థుల పేర్లు చెబుతూ, వాళ్ల వల్లే ఆయా ప్రాంతాల్లో ఓటమి ఎదురైందని అన్నారు.

‘నాకు సంతోషించాలో, బాధపడాలో తెలియట్లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఫ్లొరిడాకు చెందిన కార్లొస్ కర్బెలో, కొలొరాడోకు చెందిన మైక్ కాఫ్‌మన్, వర్జీనియాకు చెందిన బార్బరా కామ్‌స్టాక్, ఇలినాయిస్‌కు చెందిన పీటర్ రాస్కమ్‌లు తనకు సహకరించలేదని, దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు.

‘మియా లవ్ నాకు ప్రేమను పంచలేదు, అందుకే ఆమె ఓడిపోయారు’ అని ట్రంప్ అన్నారు. కానీ, ఉత్తర ఉతా డిస్ట్రిక్ట్‌లో జరిగే మలివిడత ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. అందులో ఆమె గెలుపొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలా జరిగితే రిపబ్లికన్ అభ్యర్థిగా ఉంటూ, ట్రంప్ మద్దతు లేకుండానే ఆమె గెలిచినట్లవుతుంది.

‘మెయిన్‌’లో రిపబ్లికన్ల కొంపముంచిన కొత్త పద్ధతి

అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలో తొలిసారిగా ‘ర్యాంక్‌డ్ ఛాయిస్’ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఆ పద్ధతి కారణంగానే సిట్టింగ్ రిపబ్లికన్ అభ్యర్థి తన సీటు కోల్పోయారు. అదే పాత పద్ధతిలో ఎన్నిక నిర్వహించి ఉంటే విజయం ఆయన సొంతమై ఉండేది.

ఈ ‘ర్యాంక్‌డ్ ఛాయిస్’ పద్ధతిలో తాము ఓటేసిన అభ్యర్థికి మెజారిటీ రాకుంటే, తమ రెండో ప్రాధాన్యం ఎవరికనే విషయాన్ని కూడా ఓటర్లు నమోదు చేస్తారు.

ఎన్నిక ముగిశాక రిపబ్లికన్ అభ్యర్థి బ్రూస్‌కు 46.2శాతం ఓట్లు, డెమొక్రాట్ అభ్యర్థి జేరడ్‌కు 45.5శాతం ఓట్లు లభించాయి. ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో, ఇండిపెండెంట్లు ఇతర పార్టీల అభ్యర్థులకు వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో డెమొక్రాట్ అభ్యర్థి జేరడ్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో గెలుపు అతడికే సొంతమైంది.

అదే, పాత పద్ధతిలో లెక్కించి ఉంటే రిపబ్లికన్ అభ్యర్థే గెలిచేవాడు.

ఏది ఏమైనా, ట్రంప్ చెప్పినట్లు ఈ మధ్యంతర ఎన్నికలు ఆయనకు దక్కిన ‘చారిత్రక విజయం’ ఏమాత్రం కాదు. ఓ రకంగా ఈ ఫలితాలు అతడి ప్రాబల్యాన్ని మరింత తగ్గించాయి. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాన్నే చేకూర్చాయి. 2020 అధ్యక్ష ఎన్నికలకు వీటిని గీటురాయిగా భావిస్తే మాత్రం ట్రంప్ మరింత జాగ్రత్తగా ముందుకెళ్లాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)