You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బహ్రెయిన్ ప్రతిపక్ష నేతకు జీవిత ఖైదు
బహ్రెయిన్ ప్రతిపక్ష నేత షేక్ అలీ సల్మాన్‌కు ఆ దేశ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఖతార్ దేశానికి గూఢచారిగా పని చేశారనే కేసులో అపీల్ కోర్టు ఆయనను దోషిగా నిర్థారించింది.
ప్రత్యర్థి దేశమైన ఖతార్‌తో సల్మాన్ కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో బహ్రెయిన్ హైకోర్టులోని తొలి దశ న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించిన కొన్ని నెలలకే ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఖతార్‌తో బహ్రెయిన్ 2017 నుంచి సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంది.
ఇది న్యాయాన్ని అపహాస్యం చేసే నిర్ణయమని అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. అసమ్మతిని అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న బహ్రెయిన్ వైఖరికి ఇదొక తాజా ఉదాహరణ అని ఆరోపించింది.
''దేశంలో భిన్న స్వరాలను, విమర్శలను బహ్రెయిన్ అధికారులు చట్ట విరుద్ధంగా అణచివేస్తున్నారని ఈ తీర్పు చెప్పకనే చెబుతోంది" అని ఆమ్నెస్టీ మధ్య ప్రాచ్య- ఉత్తర అమెరికా డైరెక్టర్ హెబా మోరాయెఫ్ అన్నారు.
"షేక్ అలీ సల్మాన్ అంతరాత్మకు బందీగా మారిన వ్యక్తి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను శాంతియుతంగా ఉపయోగించుకున్నందుకు ఆయనను జైల్లో పెట్టారు" అని హెబా అన్నారు.
అలీ సల్మాన్ గతంలో 'అలీ-వెఫాక్' ఉద్యమానికి నాయకత్వం వహించారు. 2011లో ఆయన తన సహచరులతో కలసి, ఖతార్ అండతో దేశంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
అలీ-వెఫాక్ ఉద్యమాన్ని ఆ తరువాత నిషేధించారు. సల్మాన్ అనుచరులైన హసన్ సుల్తాన్, అలీ అల్-అస్వద్‌లకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేశారు.
ఇప్పుడే ఎందుకు?
'ఆ ముగ్గురు' బహ్రెయిన్‌కు వ్యతిరేకంగా పని చేశారని, ఖతార్ అధికారులతో కుమ్మక్కై దేశంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని, అందుకే వారికి జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏఎఫ్‌పి వార్తా సంస్థతో చెప్పారు.
అయితే, ఏడేళ్ళ కిందటి ఆ ఆరోపణలు కేవలం గత ఏడాదిలోనే వెలుగులోకి వచ్చాయి. అది కూడా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ దేశాలు ఖతార్‌తో తెగతెంపులు చేసుకున్న తరువాత.
తీవ్రవాద సంస్థలకు బహ్రెయిన్ దేశం మద్దతు తెలుపుతోందని, ఇరాన్‌కు మరీ సన్నిహితంగా ఉంటోందని మిత్రపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను బహ్రెయిన్ తీవ్రంగా తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలోనే, బహ్రెయిన్ ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో తమ సంస్థను అణచివేయాలని ప్రయత్నిస్తోందని అల్-వెఫాక్ నాయకులు అన్నారు. అంతేకాదు, 2015 నుంచి జైల్లో ఉన్న తమ నాయకుడి నిర్బంధాన్ని కొనసాగించాలని కూడా ప్రభుత్వం యత్నిస్తోందని వారు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక రాజకీయ సంక్షోభం: వ్యూహ ప్రతివ్యూహాల ఉద్రిక్త సందర్భం
- ఆసియా బీబీ: విదేశీ ఆశ్రయం కోసం భర్త వీడియో మెసేజ్
- భారత్‌లో ‘ఆ’ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- Ground Report: 'కరవుతో నా పంట పోయింది... బతకు కోసం ఊరొదిలి వెళ్లాలి'
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- Fake News -గుర్తించడం ఎలా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.