You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నవాజ్ షరీఫ్: అవినీతి కేసులో జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్ మాజీ ప్రధాని
అవినీతి కేసులో పదేళ్లు జైలు శిక్ష పడి, గత రెండు నెలలుగా శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను విడుదల చేయాలని ఇస్లామాబాద్ న్యాయస్థానం ఆదేశించింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మర్యమ్‌కు పడిన శిక్షలను కూడా ఇస్లామాబాద్‌లోని హైకోర్టు సస్పెండ్ చేసింది.
దాంతో బుధవారం నాడు కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే షరీఫ్‌ను, ఆయన కుమార్తె మర్యమ్‌ను విడుదల చేశారు.
దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జూలై నెలలో వీరికి ఈ శిక్షలు పడ్డాయి.
తాము ఎలాంటి తప్పూ చేయలేదని, తమకు కిందికోర్టు విధించిన శిక్షలను రద్దు చేయాలని వారు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయటంతో తాజా తీర్పు వెలువడింది.
నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ క్యాన్సర్‌తో బాధపడుతూ సరిగ్గా వారం రోజుల కిందట లండన్‌లో మృతి చెందారు. దీంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకుగాను వీరికి బెయిల్ లభించింది. అంత్యక్రియల తరువాత వారు తిరిగి జైలుకెళ్లారు.
తాజా తీర్పు నేపథ్యంలో వారు బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
లండన్‌లో నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన నాలుగు విలాసవంతమైన ఆస్తుల యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసులో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారనే కేసులో షరీఫ్‌కు జూలైలో శిక్ష పడింది.
రాజకీయ కారణాలతోనే తనకు శిక్షలు పడేలా చేశారని షరీఫ్ పేర్కొన్నారు.
ఆయన కుమార్తె మర్యమ్ నవాజ్ షరీఫ్‌కు... నేరాలకు సహకరించినందుకు ఏడేళ్లు, దర్యాప్తుకు సహకరించకపోవటంతో ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయని కోర్టు తెలిపింది. నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దన్ అవన్ దర్యాప్తుకు సహకరించనందుకు గాను ఏడాది జైలు శిక్ష పడింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష
- పాకిస్తాన్: లాహోర్ చేరిన నవాజ్ షరీఫ్... అదుపులోకి తీసుకున్న అధికారులు
- పాకిస్తాన్ ఎన్నికలు.. మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యాంశాలు
- పాకిస్తాన్: నవాజ్, ఇమ్రాన్, బిలావల్... ఎవరి బలమెంత?
- సానుభూతి, సైన్యం, ఫేక్ న్యూస్, మతం: పాక్ ఎన్నికల్లో వీటి మధ్యే పోటీ
- 'పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పెద్ద నేతలంతా నిరుపేదలే'
- పదేళ్లు గడచినా బెనజీర్ హత్య మిస్టరీ ఇంకా ఎందుకు వీడలేదు?
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- మియాందాద్ సిక్సర్‌కి భారత్ ఎలా బదులిచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)