You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హరికేన్ ఫ్లోరెన్స్: ఉత్తర కేరొలినా వద్ద తీరం దాటిన భీకర తుపాను
భీకర హరికేన్ ఫ్లోరెన్స్ తుపాను ఉత్తర కేరొలినా వద్ద తీరాన్ని దాటింది. ఈ తుపాను భారీగా ఫ్రాణనష్టం కలిగించగలదని అధికారులు హెచ్చరించారు.
అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
దీవులను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) అంటోంది.
ఇప్పటికే ఉత్తర కేరొలినా, దక్షిణ కేరొలినా, వర్జీనియా ప్రాంతాల్లోని దాదాపు 17లక్షల మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
ఉత్తర కేరొలినాలో 100కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉత్తర కేరొలినా తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దాంతో వరదలు కూడా మొదలయ్యాయి.
కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
గురువారం ఉదయం 250 కిలోమీటర్ల వేగంతో కదిలిన హరికేన్, తర్వాత 165 కిలోమీటర్లకు తగ్గింది. అయితే, గాలి వేగం కాస్త తగ్గినా, వర్ష సూచనలో మాత్రం మార్పు లేదని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) అంటోంది.
గురువారం నుంచి శనివారం వరకు తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కేరొలినాలోని తీర ప్రాంతాల్లో 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది.
దాంతో నదులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదముందని, వరదనీటి మట్టం 13 అడుగుల దాకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయకుంటే పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదముందని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు అంటున్నారు.
దక్షిణ కేరొలినాలోని మైటల్ బీచ్‌లో 12 గంటలపాటు కర్ఫ్యూ విధించారు.
పలు విమానాశ్రయాలపై ఈ భీకర తుపాను ప్రభావం పడే అవకాశం ఉంది. ఫ్లైట్అవేర్.కామ్ ప్రకారం 1400కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు.
దక్షిణ కేరొలినాలోని ఛాల్స్‌టన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాతే దీన్ని తెరుస్తామని విమానయాన శాఖ తెలిపింది.
వర్షం, భారీ గాలులు ప్రారంభం కావడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దాంతో ఉత్తర కేరొలినాలోని అట్లాంటిక్ బీచ్‌లో ఏర్పాటు చేసిన బోర్డ్ వాక్ బ్రిడ్జి ధ్వంసమైంది.
మరోవైపు, ఉత్తర కేరొలినాలో టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది.
ఇవి కూడా చదవండి:
- Apple Iphone xs: మొదటిసారిగా ఐ ఫోన్లో డ్యూయల్ సిమ్ - ఐ వాచ్లో ECG
- లక్ష్మీకుట్టీ అమ్మ: ‘విషానికి విరుగుడు ఈ బామ్మ నాటువైద్యం’
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- పచ్చని ఆకులు తినాల్సిన జింకలు ప్లాస్టిక్ తింటున్నాయ్
- ఇల్లు కావాలా.. ఇరవై ఏళ్లు ఆగాలి!!
- లైంగికానందం కోసం మహిళలు సెక్స్ చేయటం సరికాదని మహాత్మా గాంధీ ఎందుకన్నారు?
- అమిత్ షా బీజేపీలో అందరికంటే బలమైన నాయకుడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)