బ్రిటన్‌ ఆకాశంలో వింత మేఘాలు

దక్షిణ ఇంగ్లండ్‌ ఆకాశంలో వింతగా కనిపించిన మేఘాలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ అందమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు. మేఘాలు ఇలా ఏర్పడడాన్ని 'క్లౌడ్ స్ట్రీట్స్' అంటారు.

గురువారం సాయంత్రం ఆక్స్‌ఫర్డ్‌షైర్, గ్లూష్టర్ షైర్ ఆకాశంలో కనిపించిన ఈ మేఘాల వరుసలను బీబీసీ వాతావరణ నిపుణులు గమనించారు.

"బ్రిటన్‌లో ఇలాంటి మేఘాలు ఏర్పడడం అసాధారణమేమీ కాదు" అని బీబీసీ వాతావరణ సమాచారం అందించే ప్రెజెంటర్ సైమన్ కింగ్ అన్నారు. కానీ ఇవి ఆకాశంలో వెలుతురు తగ్గిపోతున్నా అలాగే కనిపించాయని తెలిపారు.

"అడుగున గుండ్రంగా ఉన్న అంచులతో ఏర్పడిన 'క్లౌడ్ స్ట్రీట్స్' గాలి వీస్తున్నదిశగా పొడవుగా వరుసగా కనిపించాయి" అని ఆయన చెప్పారు.

ఈ 'క్లౌడ్ స్ట్రీట్స్' ఎలా ఏర్పడతాయి?

భూమి ఉపరితలం పైనున్న వేడెక్కిన గాలి పైకి వెళ్లినపుడు, అది చల్లబడి మేఘంగా మారుతుంది.

కొన్ని సమయాల్లో వేడిగా ఉన్న గాలి పొర దిగువ వాతావరణంలోనే ఉండిపోతుంది. ఇది గాలి అంతకంటే పైకి వెళ్లకుండా ఒక తెరలా అడ్డుకుంటుంది.

అంటే ఆ సమయంలో మేఘం పైన ఉన్న చల్లటి గాలి బలంగా, అడ్డంగా బయటికి వెళ్తుంది. అది మళ్లీ తిరిగి భూమిపైకి చేరుకుంటుంది.

అలా గాలి వెళ్తూ, వస్తున్న ప్రాంతాల్లో మేఘం ఏర్పడకుండా స్పష్టంగా ఉంటుంది. ఇదంతా పొడవుగా ఓ స్తంభాకారంలో గాలికి సమాంతరంగా జరుగుతుంది.

దీంతో అవి అలా పొడవైన మేఘాల వరుసలుగా ఏర్పడతాయి.

ఈ మేఘాల వరుసలు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ఆక్స్‌ఫర్డ్, టాక్లీ, గ్లూష్టన్‌షైర్‌లోని సైరెన్‌సిస్టర్, రిసింగ్‌టన్‌లో కనిపించాయి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)