You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్థానిక పత్రికలు లేకుంటే సమాజం ఏమవుతుంది?
అమెరికాలో గత పద్నాలుగేళ్లలో సుమారు 1800 స్థానిక దిన పత్రికలు మూతపడ్డాయి. కారణం.. ఇంటర్నెట్.
ప్రపంచం డిజిటల్ పరుగులు తీస్తుండడంతో పత్రికల మనుగడ కష్టమైపోతోంది.
వార్తాపత్రికలకు అనుబంధంగా ఉండే ప్రకటనల రంగమూ డిజిటల్ పుంతలు తొక్కుతోంది.
తత్ఫలితంగా అక్కడి పత్రికలకు పాఠకులతో పాటే ప్రకటనల ఆదాయమూ తగ్గుతోంది. అందుకే ఈ మూసివేతలు.
స్థానిక పత్రికలు లేకపోతే?
ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలతో పాటే మీడియా కూడా శరవేగంగా ఆన్‌లైన్ అవుతోంది. పాఠకులు ఆన్‌లైన్లోకి మళ్లుతున్నారు. ఈ కారణంగా పత్రికలకు ఆదరణ తగ్గిపోతోంది.
మరి.. స్థానిక పత్రికలు లేకపోతే ఏం జరుగుతుంది? సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
పదేళ్ల కిందట డెన్వర్‌లో జరిగిన ఘటన ఈ ప్రశ్నకు సమాధానం చెప్తోంది.
డెన్వర్‌లో రెండు ప్రధాన పత్రికలుండేవి. ఆ రెండు ఒకదానితో ఒకటి పోటీపడేవి. వాటిలో ఒకటైన 'రాకీ మౌంటెయిన్ న్యూస్' మూతపడింది. కానీ, పోటీ పత్రిక 'డెన్వర్ పోస్ట్' ఉద్యోగుల్లో ఏమాత్రం సంతోషం కనిపించలేదు. 'డెన్వర్ పోస్ట్' రిపోర్టర్ సుసాన్ గ్రీన్ చెప్పిన మాటే అందుకు ఉదాహరణ. ''జర్నలిజం అనేది పోటీతో కూడుకున్నది. పోటీ పత్రిక మూతపడితే పరిస్థితులు మారిపోతాయి. ఒక్కోసారి ప్రభుత్వంలో ఉండేవారికి, మనకు ప్రకటనలు ఇచ్చేవారికి నచ్చని కథనాలు రాయాల్సి వస్తుంది.. పోటీ పత్రికలుంటే వాటిని రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పోటీ పత్రికలు లేకపోతే మేనేజ్‌మెంట్లు ఇలాంటి సందర్భాల్లో ఆయా కథనాలు రాయడం మానేస్తాయి'' అంటారామె.
సమస్యలు ప్రస్తావించేవారెవరు?
స్థానిక పత్రికలు మూతపడిన తరువాత రహదారులు, పాఠశాలల వంటి నిర్మాణాలకయ్యే ఖర్చు పెరిగిందని ఇటీవల ఓ అధ్యయనంలో గుర్తించారు.
స్థానిక ప్రభుత్వాలపై పత్రికలు కన్నేసి ఉంచకపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఈ అధ్యయనంలో సూత్రీకరించారు.
అంతేకాదు.. ఆరోగ్య సేవలపైనా నిఘా లేక వ్యాధులు విజృంభించే ప్రమాదముందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది.
స్థానిక పత్రికలు లేకపోవడమంటే సమాచారం అందకపోవడమేనని నార్త్ కరోలినా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెనెలప్ మ్యూజ్ అభిప్రాయపడ్డారు.
స్థానిక పత్రికలు ప్రజా సమస్యలపై దృష్టిపెడతాయి. దానివల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆయా ప్రాంతాలు ప్రగతి సాధించడానికి తోడ్పడతాయి. అంతేకాదు... జాతీయ స్థాయి సమస్యలను స్థానిక కోణంలో చూపించగలుగుతాయి అని పెనెలప్ అంటారు.
పెట్టుబడి సంస్థల చేతుల్లో..
మరోవైపు గడ్డు పరిస్థితుల్లోనూ కొన్ని పత్రికలు మనగలుగుతున్నాయి.
చిరకాలంగా నమ్మకమైన పాఠకులు ఉండడం దీనికి ఒక కారణమైతే.. స్థానికంగా పోటీ లేకపోవడం మరో కారణం. వీటన్నిటికీ మించి.. ఇవి స్థానిక పత్రికలే అయినప్పటికీ పెద్ద వ్యాపార సంస్థలు వీటిని నిర్వహిస్తుండడం కూడా ఇంకో ప్రధాన కారణం.
అమెరికాలో సుమారు 100 చిన్న పత్రికలు 'డిజిటల్ ఫస్ట్ మీడియా' అనే నెట్‌వర్క్ చేతిలో ఉన్నాయి.
అమెరికాలో సుమారు వెయ్యి పత్రికల(అమెరికా పత్రికల్లో సుమారు 15 శాతం) యాజమాన్యాలు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)