You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతులు, పశుపోషకుల ఘర్షణ: 86 మంది మృతి - నైజీరియాలో మారణకాండకు మూలకారణమేంటి?
రైతులు, పశుపోషకుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో నైజీరియాలో ఏకంగా 86 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫులానీ పశుపోషకులపై బెరోమ్ రైతులు గురువారం దాడి చేసి అయిదుగురిని చంపేయడంతో ఎప్పటినుంచో కొనసాగుతున్న ఘర్షణలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి.
రైతుల దాడికి ప్రతిగా పశుపోషకులు జరిపిన దాడిలో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. 86 మంది మృతిచెందారని.. 50 ఇళ్లు, 15 మోటారుసైకిళ్లు తగలబెట్టారని నైజీరియా పోలీసులు తెలిపారు.
తాజా దాడుల నేపథ్యంలో అక్కడి మూడు రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు.
దశాబ్దాల వివాదం
నైజీరియా మధ్య ప్రాంతంలో ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ వివాదం ఉంది. కొద్దికాలంగా ఈ పోరాటం హింసారూపం దాల్చి తరచూ మరణాలకు కారణమవుతోంది.
వ్యవసాయ హక్కులు, అందులో పశువులను మేపుకొనే హక్కులకు సంబంధించి రైతులు, పశుపోషకుల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
దాడులు, ప్రతిదాడులతో ఒక్క 2017లోనే వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మతకల్లోలాలుగా మారుతున్నాయి..
రైతులు, పశుపోషకుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు మత కల్లోలాలకూ దారి తీస్తున్నాయి.
ఇక్కడి సంప్రదాయ ఫులానీ పశుపోషకులు ముస్లింలు కాగా రైతుల్లో అత్యధికులు క్రైస్తవులు. దీంతో ఇది రెండు మతాల మధ్య ఘర్షణగానూ పరిణమించిన సందర్భాలున్నాయి.
కాగా ఈ రక్తపాతం రోజురొజుకీ ఎక్కువవుతుండడానికి బయటదేశాలే కారణమంటూ నైజీరియా అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు.
లిబియా నుంచి తుపాకులు పెద్ద మొత్తంలో సరఫరా అవతుండడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోందన్నది ఆయన ఆరోపణ.
అయితే, భద్రతా బలగాల వైఫల్యం వల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందన్నది ఇతర రాజకీయపక్షాల విమర్శ.
నైజీరియా ఉత్తర ప్రాంతంలో తిరుగుబాటుదారుల గ్రూప్ బోకోహరాంతో.. చమురు సమృద్ధ దక్షిణ ప్రాంతంలోని తీవ్రవాద బృందాలతో నిత్యం పోరాడుతున్న నైజీరియా భద్రత బలగాలు ఈ రైతులు, పశుపోషకుల ఘర్షణలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు.
ఇంతకీ ఫులానీ పశుపోషకులు ఎవరు?
ఫులానీ పశుపోషకులను ప్రపంచంలోనే అతిపెద్ద సంచార జాతిగా చెప్తారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో సెనెగల్ నుంచి సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ వరకు అన్ని దేశాల్లో వీరున్నారు.
నైజీరియాలో వీరిలో చాలామంది ఇప్పటికీ సంచారజాతులుగా ఉంటూ పశుపోషణలో ఉండగా.. మరికొందరు మాత్రం నగరాలకు తరలిపోయారు.
పశుపోషణలో ఉన్నవారు వివిధ ప్రాంతాలకు పశువులను తీసుకెళ్లేటప్పుడు మేత విషయంలో స్థానిక రైతులతో ఘర్షణలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)