You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇది కొత్త శకానికి నాంది: ట్రంప్ - కిమ్ ప్రకటన పూర్తి పాఠం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్, డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా చైర్మన్ కిమ్ జోంగ్-ఉన్‌లు సింగపూర్ శిఖరాగ్ర సమావేశంలో చేసిన సంయుక్త ప్రకటన
ట్రంప్, కిమ్‌లు సింగపూర్‌లో జూన్ 12వ తేదీన తొలి, చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు.
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కొత్త సంబంధాలు నెలకొల్పటం, కొరియా ద్వీపకల్పంలో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలూ సమగ్రమైన, లోతైన అభిప్రాయాలను నిజాయితీగా పంచుకున్నారు.
ఉత్తర కొరియాకు భద్రతా హామీలు ఇవ్వటానికి ట్రంప్ ఒప్పుకున్నారు. కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణంగా అణ్వస్త్ర నిరాయుధీకరణ చేయటానికి కిమ్ తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
కొరియా ద్వీపకల్పానికి, ప్రపంచానికి శాంతి, సౌభాగ్యాలు అందించటానికి అమెరికా - ఉత్తర కొరియా నూతన సంబంధాలు దోహదపడతాయని నమ్ముతూ.. పరస్పర విశ్వాస నిర్మాణం కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర నిరాయుధీకరణను ప్రోత్సహించటానికి సాయపడుతుందని గుర్తిస్తూ.. ట్రంప్, కిమ్‌లు ఇరువురూ ఈ కింది విషయాలు ప్రకటిస్తున్నారు:
శాంతి, సౌభాగ్యాల కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన అమెరికా - ఉత్తర కొరియాల సంబంధాలను నెలకొల్పటానికి రెండు దేశాలూ కట్టుబడుతున్నాయి.
కొరియా ద్వీపకల్పంలో శాశ్వత, సుస్థిర శాంతిని నిర్మించటానికి అమెరికా, ఉత్తర కొరియాలు కలిసి కృషి చేస్తాయి.
2018 ఏప్రిల్ 27 నాటి పాన్‌ముంజున్ డిక్లరేషన్‌ను పునరుద్ఘాటిస్తూ.. కొరియా ద్వీపకల్పాన్ని పూర్తిగా అణు నిరాయుధీకరణ చేసే దిశగా ఉత్తర కొరియా కృషి చేస్తుంది.
యుద్ధ ఖైదీలు, యుద్ధంలో అదృశ్యమైన వారి అస్థికలను పరస్పరం అప్పగించటానికి అమెరికా, ఉత్తర కొరియాలు కట్టుబడి ఉంటాయి. ఇప్పటికే గుర్తించిన వాటిని తక్షణమే అప్పగిస్తారు.
ఇరు దేశాల మధ్య దశాబ్దాల ఉద్రిక్తతలు, శత్రుత్వాలను అధిగమించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ఈ మొట్టమొదటి చరిత్రాత్మక అమెరికా - ఉత్తర కొరియా శిఖరాగ్ర సదస్సు నూతన శకానికి నాంది పలికింది. సరికొత్త భవిష్యత్తును ప్రారంభించటానికి ట్రంప్, కిమ్‌లు ఈ సంయుక్త ప్రకటనలోని అంశాలను సంపూర్ణంగా, సత్వరంగా అమలు చేయటానికి కట్టుబడుతున్నారు.
అమెరికా, ఉత్తర కొరియా శిఖరాగ్ర సదస్సు నిర్ణయాలను అమలు చేయటం కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఉత్తర కొరియాకు చెందిన సంబంధిత ఉన్నతాధికారి సారథ్యంలో సాధ్యమైనంత త్వరగా తదుపరి చర్చలు జరపటానికి ఇరు దేశాలూ నిబద్ధమవుతున్నాయి.
అమెరికా - ఉత్తర కొరియా నూతన సంబంధాలను అభివృద్ధి చేయటానికి, కొరియా ద్వీపకల్పంలోనూ ప్రపంచంలోనూ శాంతి, సౌభాగ్యం, భద్రతలను పెంపొందించటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్, డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశీ వ్యవహారాల కమిషన్ చైర్మన్ కిమ్ జోంగ్ ఉన్ కట్టుబడి ఉన్నారు.
(సంతకాలు)
డొనాల్డ్ జె. ట్రంప్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు
కిమ్ జోంగ్ ఉన్
డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశీ వ్యవహారాల కమిషన్ చైర్మన్
జూన్ 12, 2018
సెంటోసా ఐలాండ్
సింగపూర్
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)