You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రసాభాసగా ముగిసిన జీ7 సదస్సు
ఆర్థికంగా, పారిశ్రామికంగా శక్తిమంతమైన ఏడు దేశాల కూటమి జీ-7 శిఖరాగ్ర సదస్సు పొరపొచ్చాలు, పరస్పర అపనమ్మకాలు, ఆరోపణలతో ముగిసింది.
కెనడాలో నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సందర్భంగా చేసే సంయుక్త ప్రకటనకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు.
ఉక్కు, అల్యూమినియం దిగుమతి సుంకాలు పెంచడం.. ఇరాన్ అణుఒప్పందం, ప్యారిస్ వాతావరణ ఒప్పందాల నుంచి బయటకు వచ్చేయడం, రష్యాను మళ్లీ జీ-7 కూటమిలో చేర్చుకోవాలని సూచించడం వంటి అమెరికా చర్యలను మిగతా సభ్య దేశాలు ఈ సదస్సు వేదికగా వ్యతిరేకించాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిని ఏకాకిని చేశాయి.
ట్రంప్ కూడా మిగతా సభ్య దేశాలపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆయన సంయుక్త ప్రకటనకు గైర్హాజరవడంతో పాటు కెనడాను 'దగాకోరు'గా ఆయన అభివర్ణించారు.
అంతా అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాలపైనే మాట్లాడుతున్నారని, కానీ.. ఇతర దేశాలు కూడా అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని ఆయన అన్నారు.
ఓవైపు సుంకాలపై వివాదం రగులుతుండగా సంయుక్త ప్రకటనలో మాత్రం 'నియమాల ఆధారిత వ్యాపార విధాన'మే సమర్థనీయమని పేర్కొన్నారు.
కాగా సదస్సు ముగింపు అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడావారు హుందా, బాధ్యత ఉన్నవారే కానీ ఇబ్బందిపెడితే సహించబోరని సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు.
అమెరికా సుంకాలు పెంచిన నేపథ్యంలో ప్రతిగా తాము కూడా జులై 1 నుంచి పెంచుతామని వెల్లడించారు.
అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై సుంకాల పెంపును సమర్థించుకోవడానికి ట్రంప్.. జాతీయ భద్రతపై ఆందోళనలను లేవనెత్తడం సిగ్గుచేటని ట్రూడో అన్నారు.
మరోవైపు ట్రంప్‌తో సంబంధం లేకుండా సంయుక్త ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.
జీ-7 తీర్మానాల అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు ట్రంప్ జీ-7 సదస్సు నుంచి సింగపూర్ వెళ్తూ ఓ ట్వీట్ చేశారు. ఆటోమొబైల్స్‌పై సుంకాల సంగతి తేలే వరకు ఈ సంయుక్త ప్రకటనను సమ్మతిస్తూ ఏమీ మాట్లాడొద్దని తన అధికారులను ఆదేశించానని అందులో రాశారు.
కెనడా ప్రధాని నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసత్యాలు చెప్పారని.. వాస్తవానికి అమెరికా రైతులు, కార్మికులు, సంస్థలకు ఇబ్బంది కలిగేలా కెనడా ఇప్పటికే భారీగా సుంకాలు విధిస్తోందని ఆయన ఆ ట్వీట్‌లో ఆరోపించారు.
అమెరికా నుంచి దిగుమతయ్యే డెయిరీ ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న 270 శాతం సుంకానికి బదులుగానే తాము సుంకాలు పెంచామని ఆయన తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
తమ రైతులు, కార్మికులు, సంస్థలపై ఇతర దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించడాన్ని.. భారీ సుంకాలు విధించడాన్ని ఇక సహించబోమని.. ఇతర దేశాలు ఎలాంటి పన్నులు చెల్లించకుండా తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయని.. దశాబ్దాలుగా వాణిజ్య దోపిడీకి గురవుతున్నామని.. ఈ దోపిడీ ఇక చాలంటూ ఆయన ఇంకో ట్వీట్ చేశారు.
కాగా వాణిజ్య సుంకాలపై వివాదం ఉన్నప్పటికీ సభ్య దేశాలన్నీ ఆమోదించిన సంయుక్త ప్రకటనపై ట్రంప్ అంతకుముందే సంతకం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)