You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా, దక్షిణ కొరియా, అమెరికా, సిరియా.. దౌత్యంలో వేగం పెంచిన ఉత్తరకొరియా
ఉత్తర కొరియాను సందర్శించేందుకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
2011లో ఉత్తర కొరియా పాలనా బాధ్యతలు చేపట్టిన కిమ్, ఇప్పటి వరకు ఏ దేశాధ్యక్షుడికీ ఆతిథ్యం ఇవ్వలేదు. ఇప్పుడు సిరియా అధ్యక్షుడికి ఇవ్వబోయేదే కిమ్ తొలి ఆతిథ్యం అవుతుంది.
కొంత కాలంగా దౌత్యపరమైన కార్యక్రమాలకు కిమ్ ఆసక్తి చూపిస్తున్నారు. గత నెలలో చైనా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌ని కలిశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే- ఇన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సింగపూర్‌లో జరిగే శిఖరాగ్ర సదస్సులో కిమ్ పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి.
అసద్ ఉత్తర కొరియా పర్యటన గురించి సిరియా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అలాగే, ఉత్తర కొరియా వార్త సంస్థ కూడా అసద్ పర్యటన తేదీలను వెల్లడించలేదు.
ఉత్తర కొరియా మిత్రదేశాల్లో సిరియా ఒకటి. ఈ దేశాలు రసాయన ఆయుధాల విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, రెండు దేశాలూ ఆ ఆరోపణలను ఖండించాయి.
ఉత్తర కొరియా, సిరియా మధ్య బంధం 1966లో ఏర్పడింది. 1973 అక్టోబర్‌లో జరిగిన అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఉత్తర కొరియా బలగాలను, ఆయుధాలను కూడా పంపింది.
2012 నుంచి 2017 మధ్య కాలంలో ఉత్తర కొరియా నుంచి సిరియాకు 40 సార్లు ఎగుమతులు జరిగాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చిన ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
రసాయన ఆయుధాల్లో వినియోగించే ఆమ్ల నిరోధక పెంకులు(టైల్స్), వాల్వులు, పైపులు వంటివి ఎగుమతైనట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)