You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంతరిక్షంలోనూ సైనిక వ్యవస్థ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినూత్న ఆలోచన సాధ్యమయ్యే పనేనా?
స్పేస్ ఫోర్స్- ఇదేదో సమ్మర్ లో వస్తున్న హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కాదు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్న ఆలోచన.
భూమి, ఆకాశం, సముద్రాలలోనే కాకుండా అంతరిక్షంలో కూడా తమ సైనిక సామర్థ్యాలు ప్రదర్శించడానికి ఏకంగా ఒక సైనిక వ్యవస్థను తయారు చేయడమే ఆయన ఉద్దేశం.
రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా ఉపగ్రహాలను ధ్వంసం చేసే సత్తాను సొంతం చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ స్పేస్ ఫోర్స్ ఎంతవరకు సాధ్యం? ఏరోస్పేస్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌కు చెందిన టాడ్ హారిసన్ విశ్లేషణ.
స్పేస్ ఫోర్స్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వినూత్న ఆలోచన.
అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఫోర్స్ గురించి రెండు మూడు సార్లు మాట్లాడారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటన్న దాని మీద యూఎస్ కాంగ్రెస్ లో పెద్ద చర్చే జరుగుతోంది. అది ఒక ప్రత్యేక సైనిక వ్యవస్థను తయారు చేసి అంతరిక్షం పై, అంతరిక్ష సైనిక సామర్థ్యాలపై పట్టు సాధించడం.
ఇరాక్, సిరియా, ఆఫ్ఘానిస్తాన్ లోని టెర్రరిస్టులతో పోరాటం నుంచి సంపూర్ణ యుద్ధం వరకు అనేక సమయాలలో తమ సైనిక కార్యకలాపాల కోసం అమెరికా అంతరిక్ష సామర్థ్యాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.
అమెరికా సైనిక ఉపగ్రహాలను ధ్వంసం చేయగలిగే సాంకేతికతను రష్యా, చైనా ఇప్పటికే తయారు చేసేశాయి.
2001లో యూఎస్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి స్పేస్ కమిషన్ అని పేరు పెట్టారు. ఆ కమిషన్ చివరి నివేదికలో అంతరిక్షానికి సంబంధించి ఒక స్వతంత్ర సైనిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
స్పేస్ ఫోర్స్ అనేది ఎలా ఉండవచ్చు?
అంతరిక్షంలో పోరాటమనేది స్టార్ వార్స్ సినిమాలో చూపించినట్లుగా ఉండదు. అంతరిక్ష మరీన్లు ఉండవు. అంతరిక్షంలో యుద్ధం చేసే సైనికులు ఉండరు. అది సుదూర ప్రాంతం. అక్కడ సైనిక అవసరాలకు ఉపయోగపడే మానవరహిత ఉపగ్రహాలున్నాయి. సైనిక అంతరిక్ష కార్యక్రమాలన్నీ మానవరహితమే. మనుషులున్నవి పౌర అంతరిక్ష కార్యక్రమాలు. వాటిని నాసా నిర్వహిస్తుంది.
ప్రస్తుతం, చాలా వరకు సైనిక అంతరిక్ష కార్యక్రమాలు వాయుసేన ఆధీనంలో ఉన్నాయి.
ఇతర అధ్యక్షులు చెప్పని విషయాలెన్నో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కానీ అమెరికా సైన్యం ఆ దేశ అంతరిక్ష సామర్థ్యాలపై ఆధారపడింది. అందుకే దీన్ని తీవ్రంగా పరిగణించాలి.
ఈ స్పేస్ ఫోర్స్ ఎప్పుడు చూడగలం?
ఈరోజు నిర్ణయం తీసేసుకున్నా ఇది పూర్తి చేయడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. ముందుగా దీని మీద కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తరువాత దాన్ని అమలు చేయాలి. ఒక ప్రత్యేక అంతరిక్ష సైనిక ఫోర్స్ ను తయారు చేయడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చు, లేదా పదేళ్లు పట్టవచ్చు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)