You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్.. ప్రాణాల్ని కాపాడుతుంది!
- రచయిత, జేమ్స్ గాలఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్.. అంటే ఒకరి మలాన్ని మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెట్టడం. వైద్య శాస్త్రంలో అత్యంత జుగుప్సాకర ప్రక్రియగా దీనికి పేరుంది. ఇదే ఇప్పుడు చాలామంది ప్రాణాల్ని కాపాడుతోంది.
వైద్య పరిభాషలో దీన్ని ట్రాన్స్-పూ-సియోన్ అని పిలుస్తారు.
సాధారణంగా మలంలో చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అనారోగ్యం బారిన పడి యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మలంలోని మంచి బ్యాక్టీరియాను.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి జీర్ణ వ్యవస్థలో ప్రవేశపెట్టడమే ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. దీనివల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో కూడా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఈ చికిత్స ప్రాణాలను కాపాడుతుందని వైద్యులు చెబుతారు.
మనిషి పేగుల్లో అనేక రకాల సూక్ష్మ జీవులు కనిపిస్తాయి. వాటిలో శరీరానికి మంచితో పాటు హాని చేసేవి కూడా ఉంటాయి.
ముఖ్యంగా క్లొస్ట్రీడియం డిఫిసిలె అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే జీర్ణ వ్యవస్థకు హాని జరుగుతుంది. క్రమంగా అది ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో క్లొస్ట్రీడియం బ్యాక్టీరియా సంఖ్య పెరగకుండా ఇతర మంచి బ్యాక్టీరియా నియంత్రిస్తాయి. కానీ అనారోగ్యం బారిన పడినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.
రోగులు తీసుకునే యాంటీ బయోటిక్స్ ప్రభావం మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియాపైనా పడుతుంది. దాంతో రెండు రకాల బ్యాక్టీరియా సంఖ్యా తగ్గుతుంది. అలాంటప్పుడే ఒక్కోసారి శరీరానికి హాని చేసే ఈ క్లొస్ట్రీడియం బ్యాక్టీరియా విజృంభిస్తుంది. మిగతా బ్యాక్టీరియా కంటే వేగంగా జీర్ణ వ్యవస్థను ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది. ఫలితంగా డయేరియా, జ్వరంతో పాటు ప్రాణాంతకమైన ఇతర సమస్యలూ తలెత్తే అవకాశం ఉంటుంది.
ఈ క్లొస్ట్రీడియం బ్యాక్టీరియా సంఖ్యను అదుపు చేయాలంటే మంచి బ్యాక్టీరియా కావాలి. ఆ మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండే మనిషి మలంలో మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని శరీరంలో ప్రవేశపెట్టడానికి ఈ ‘ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్’ పద్ధతిని వైద్యులు ఆశ్రయిస్తున్నారు.
కుటుంబ సభ్యుల పేగుల్లో ఒకే తరహా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా వాళ్ల మలాన్నే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో ప్రవేశపెడతారు.
మొదట మలం శాంపిల్‌ను సేకరించి దానికి కొన్ని నీళ్లు పోసి, మిక్సీలో కానీ, చేత్తో కానీ దాన్ని కలుపుతారు.
ఆ శాంపిల్‌ని నోటి ద్వారా కానీ, మలద్వారం నుంచి కానీ పెద్ద పేగులోకి పంపిస్తారు. అక్కడ ఈ మలం మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందని వైద్యులు చెబుతారు.
వాషింగ్టన్‌లోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరికి చెందిన డాక్టర్.జేనట్ జేన్సన్ చాలాకాలంగా ఈ ‘ట్రాన్స్ పూ సియోన్’ పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు. ఇది సాధిస్తున్న ఫలితాలు తనను ఆశ్చర్యపరుస్తున్నాయని ఆమె చెబుతారు.
‘ఓ మహిళ ఎనిమిది నెలలపాటు డయేరియాతో బాధపడుతూ 27కిలోల బరువు కోల్పోయారు. ఆ తరవాత ఆమెకు క్లొస్ట్రీడియం డిఫిసిలే ఇన్ఫెక్షన్ సోకింది. ఏ యాంటిబయోటిక్స్ పనిచేయకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.
దాంతో ఆమె భర్త నుంచి మలాన్ని సేకరించి ఆమె శరీరంలో ప్రవేశ పెట్టాం. ఆశ్చర్యకరంగా కేవలం రెండ్రోజుల్లోనే ఆమె కోలుకోవడం మొదలుపెట్టారు. తక్కువ వ్యవధిలోనే జీర్ణక్రియ సాధారణ స్థితికి చేరుకుంది’ అని డాక్టర్.జేనట్ వివరించారు.
కొన్ని రోజులకు ఆమె భర్త మలంలో ఉన్న ఆరోగ్యకర సూక్ష్మజీవులే ఆమె ‘శాంపిల్’లోనూ కనిపించాయని జేనట్ చెప్పారు.
ఈ ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్ 90శాతం సానుకూల ఫలితాల్నిస్తోందని ఇప్పటిదాకా జరిపిన ట్రయల్స్ చెబుతున్నాయి.
అమెరికాలో ఓపెన్ బయోమ్ పేరుతో ఓ ‘పబ్లిక్ స్టూల్ బ్యాంక్’(మలాన్ని నిల్వచేసే కేంద్రం)ని నెలకొల్పారు.
కేవలం క్లొస్ట్రీడియం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రోగుల్లోనే కాకుండా డయాబెటిస్, పార్కిన్సన్స్, క్యాన్సర్, డిప్రెషన్ లాంటి అనారోగ్యాలకూ ఈ పద్ధతిని అనుసంధానించే ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు. కానీ కొన్ని ఫలితాలు వాళ్లను ఆలోచనలో పడేస్తున్నాయి.
2015లో ఓ మహిళ ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తరవాత ఆమె 16కేజీల బరువు పెరిగినట్లు తెలుస్తోంది.
ఎలుకల్లో ఈ పద్ధతిని పాటించడం ద్వారా వాటిని సన్నగా కానీ, లావుగా కానీ మార్చొచ్చని తేలింది. కానీ మనుషులకూ ఇది వర్తిస్తుందో లేదోనని శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధరించలేదు.
మరోపక్క ఈ పద్ధతి ద్వారా మరింత హాని చేసే ప్రమాదకర బ్యాక్టీరియా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేకపోలేదు.
అందుకే భవిష్యత్తులో ఈ చికిత్స మరింత మెరుగవ్వాలనీ, మలాన్ని కాకుండా నేరుగా మంచి బ్యాక్టీరియాను మాత్రమే సేకరించి శరీరంలోకి ప్రవేశపెట్టే దిశగా అడుగేయాలనీ డాక్టర్ ట్రెవర్ లాలీ అభిప్రాయడ్డారు.
శరీరం.. సూక్ష్మ జీవుల మయం
- మనిషి శరీరంలోని కణాలన్నీ లెక్కిస్తే కేవలం 43శాతం మాత్రమే మానవ కణాలుంటాయి. మిగతాదంతా సూక్ష్మజీవులమయమే.
- బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఏక కణ ఆర్కియా లాంటి సూక్ష్మజీవులు శరీరంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి.
- మనిషి జీనోమ్‌లో 20వేల జీన్స్ ఉంటాయి. అదే శరీరంలోని ఈ సూక్ష్మ జీవుల జీనోమ్‌లో 20లక్షల నుంచి 2కోట్ల జీన్స్ వరకూ ఉంటాయి. దీన్ని సెకండ్ జీనోమ్ అని పిలుస్తారు.
ఇలస్ట్రేషన్స్: కేటీ హార్విచ్
ఇవి కూడా చదవండి
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
- #BBCSpecial: ప్రజల మధ్య పెరుగుతున్న విభజనలు.. పదేళ్లలో ఎక్కువయ్యాయి
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో ప్రతీ ఇంటి ముందూ సమాధులే!
- ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా-?
- వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- ఏం చదివితే మంచి ఉద్యోగం వస్తుంది-?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)