You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెక్సికో సరిహద్దు వద్ద బలగాలను మోహరిస్తున్న అమెరికా
అమెరికా- మెక్సికో సరిహద్దు వద్ద టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన అనంతరం ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.
సరిహద్దులో పెట్రోలింగ్ కోసం 250 మంది భద్రతా సిబ్బందిని పంపుతున్నామని అమెరికా నేషనల్ గార్డ్ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు.
అరిజోనా ప్రభుత్వం కూడా వచ్చే వారంలో 150 మందిని మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించే వరకు 4,000 మంది నేషనల్ గార్డ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అందుకు అవసరమైన బడ్జెట్‌కు రక్షణ మంత్రి జేమ్స్ మోటిస్ ఆమోదించారని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
టెక్సాస్, అరిజోనా మాదిరిగానే బలగాలను పంపించాలని న్యూ మెక్సికో, కాలిఫోర్నియా రాష్ట్రాలకు కూడా ఆదేశాలు అందాయి.
'పట్టుకుని వదిలేసే' పద్ధతికి ముగింపు పలకాలని శుక్రవారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
సరిహద్దులో భద్రత కోసం అవసరమైన మిలిటరీ సిబ్బంది, వసతుల వివరాలను ఇవ్వాలని రక్షణ శాఖను కోరారు.
అక్రమ వలసదారుల గురించి వారం రోజులుగా ట్రంప్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సరిహద్దులను గాలికొదిలేసి మాదకద్రవ్యాలు, నేరాల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
ఇప్పుడు కఠిమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
సరిహద్దు వద్ద అక్రమ వలసలను అడ్డుకోకపోతే ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందానికి (నాఫ్టా) ముగింపు పలకాల్సి వస్తుందని మెక్సికోను ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలను మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఖండించారు.
మెక్సికో సరిహద్దులో పెట్రోలింగ్ కోసం గతంలోనూ భద్రతా బలగాలను మోహరించారు.
'ఆపరేషన్ జంప్ స్టార్ట్ బరాక్' పేరుతో ఒబామా అధక్ష్యుడిగా ఉన్నప్పుడు 1,200 మందిని, జార్జ్ బుష్ హయాంలో 6,000 మంది సైనికులను పంపించారు.
ఆ ఆపరేషన్ రెండు సార్లు సుమారు ఏడాదిపాటు సాగింది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)