‘మీరు అమెరికా పౌరులా, కాదా?’ - జనగణనలో ట్రంప్ ప్రభుత్వం వివాదాస్పద ప్రశ్న

అమెరికా జనగణన-2020లో భాగంగా పౌరసత్వానికి సంబంధించి చేర్చిన ఒక ప్రశ్నపై వివాదం రాజుకుంటోంది.

జనాభా లెక్కింపు సందర్భంగా ప్రజలను మీరు అమెరికా పౌరులా, కాదా అని అడగాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. 1950 తర్వాత జనగణనలో ఈ ప్రశ్న అడగడం ఇదే ప్రథమం.

అమెరికాలో పదేళ్లకోసారి జరిగే జనగణనలో దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి నుంచి సమాచారం సేకరిస్తారు.

ఈ ప్రశ్న అడగకుండా అడ్డుకుంటామని కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ప్రశ్న అడిగితే జనగణనలో పాల్గొని, సమాధానాలు ఇచ్చేందుకు వలసదారులు వెనకాడతారని ఈ రెండు రాష్ట్రాలు చెప్పాయి.

జనగణన వివరాల ఆధారంగా అమెరికా ప్రభుత్వం నిధుల పంపకాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రాష్ట్ర, స్థానిక ఎన్నికలకు జిల్లాలు ఏర్పాటు చేస్తుంది.

వలసదారుల జనాభా అధికంగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ ప్రాబల్య రాష్ట్రాలు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పౌరసత్వంపై ప్రశ్న అడిగితే జనగణనలో చాలా మంది పాల్గొనబోరని, ఫలితంగా జనసంఖ్య తక్కువగా నమోదవుతుందని వాదిస్తున్నాయి.

ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందించే నిధుల్లో కోతతోపాటు కాంగ్రెస్, రాష్ట్రాల చట్టసభల్లో సీట్లను కోల్పోవాల్సి వస్తుందని ఈ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇతర దేశాల వారి పట్ల, వలసదారుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల విధానాలను ఈ ప్రశ్న చాటి చెబుతోందని రాయిటర్స్ వార్తాసంస్థతో 'లాయర్స్ కమిటీ ఫర్ సివిల్ రైట్స్ అండర్ లా' అధ్యక్షురాలు క్రిస్టెన్ క్లార్కే చెప్పారు.

సరైన ధ్రువపత్రాలు చూపకుండానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో లక్షల మంది అక్రమ వలసదారులు ఓటు వేశారని లోగడ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

సమర్థించుకొంటున్న ప్రభుత్వం

ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకొంటున్నారు. ఈ ప్రశ్న అడగడం ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ నిధుల కేటాయింపులో, వివక్షను నివారించేందుకు ఉద్దేశించిన ఓటరు చట్టాల అమలులో తోడ్పడుతుందని చెబుతున్నారు.

న్యాయశాఖ విజ్ఞప్తి మేరకు జనాభా లెక్కింపు ప్రశ్నల్లో ఈ ప్రశ్నను చేర్చామని జనగణన వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికా వాణిజ్యశాఖ సోమవారం పేర్కొంది. మైనారిటీ గ్రూపులు వివక్షకు గురికాకుండా చూడాలంటే ఓటేసే వయసున్న పౌరుల వివరాల సేకరణ తప్పనిసరని, ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న అవసరమని వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్ చెప్పారు.

ఈ ప్రశ్న అడగడం వల్ల జనగణనలో సమాధానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనలపై ఆయన స్పందించారు. ఇలాంటి జనగణనతో ఒనగూరే ప్రయోజనాలతో పోలిస్తే ఆ ఆందోళనలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డారు.

తక్కువ జనాభాకు సంబంధించి చేసే సర్వేల్లోనూ మీకు అమెరికా పౌరసత్వం ఉందా, లేదా అని అడుగుతున్నారని వాణిజ్యశాఖ పేర్కొంది. జనగణన ప్రశ్నల తుది జాబితాను ఈ శాఖ మార్చి ఆఖరులోగా అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్‌కు సమర్పించనుంది.

ఈ ప్రశ్న అడగడాన్ని అడ్డుకొనేందుకు అక్రమ వలసదారుల జనాభా అధికంగా ఉండే కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాలతోపాటు మరో 10 రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. ఈ ప్రశ్న రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా ఒక కోర్టును అభ్యర్థించారు. ఈ ప్రశ్న అక్రమ వలసదారుల్లో అపనమ్మకాన్ని, ఆందోళనను కలిగిస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

ట్రంప్ ప్రభుత్వ చర్య తీవ్రమైన హాని కలిగిస్తుందంటూ ఫిబ్రవరిలో 19 రాష్ట్రాల ఉన్నతాధికారులు వాణిజ్యశాఖకు లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)