You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శత్రువులపై రక్తసిక్త పోరుకైనా చైనా రెడీ: షీ జిన్‌పింగ్
తమ దేశానికి చెందిన ఒక అంగుళం భూభాగాన్ని కూడా తమ నుంచి వేరు చేయలేరని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించారు.
పార్లమెంట్‌లో ముగింపు ప్రసంగం చేస్తూ, చైనాను విభజించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని అన్నారు. దేశం ముక్కలు కాకుండా చూడడమే ప్రజాభిమతం అని తెలిపారు.
"చైనా ప్రజలు తమ శత్రువులకు వ్యతిరేకంగా రక్తసిక్త పోరాటాలు సాగించడానికి సైతం సిద్ధంగా ఉన్నారు" అని షీ అన్నారు.
జిన్‌పింగ్ ప్రసంగం - చైనా నుంచి వేరు పడాలని తైవాన్, హాంకాంగ్‌లాంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయత్నాలకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు.
అభివృద్ధి విషయంలో ఉపేక్షించబోమని తన ప్రసంగంలో జిన్‌పింగ్ అన్నారు.
కేవలం సోషలిజం మాత్రమే చైనాను రక్షించగలదని చరిత్ర నిరూపించిందని ఆయన తెలిపారు.
తైవాన్‌కు పరోక్ష హెచ్చరిక!
చైనా లక్ష్యాల గురించి చెబుతూ జిన్‌పింగ్, తమ దేశం బలోపేతం కావాలనుకుంటున్నా, అది దౌర్జన్యంతో కానీ ఇతర ప్రపంచాన్ని పణంగా పెట్టి కానీ కాదన్నారు.
దేశాన్ని ముక్కలు చేయడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని, అలాంటి ప్రయత్నాలను చరిత్ర శిక్షిస్తుందని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు ప్రధానంగా తైవాన్‌కు వ్యతిరేకంగా చేసినవని భావిస్తున్నారు. తైవాన్ స్వయం పాలిత దేశమైనా, చైనా మాత్రం ఆ దేశాన్ని తిరుగుబాటు ప్రాంతంగా భావిస్తోంది. అవసరమైతే బలాన్ని ఉపయోగించి అయినా, తిరిగి ఆ దేశాన్ని చైనాలో కలిపేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు, ఇటీవలి కాలంలో హాంకాంగ్‌కు మరింత స్వయం ప్రతిపత్తి లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండ్‌లు కూడా పెరిగాయి.
నిరసనలకు చోటేది?
చైనాలో అసమ్మతి గళాలను కానీ, నిరసనలను కానీ సహించరు. సైద్ధాంతికంగా 3 వేల మంది డెలిగేట్లను ఎన్నుకున్నా, నిజానికి ప్రభుత్వమే తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటుంది.
ప్రస్తుతం చైనాలో మావో తర్వాత అంతటి శక్తిమంతుడైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్, తన ముఖ్య అనుచరులను కీలక పదవుల్లో నియమించుకున్నారు.
2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జిన్‌పింగ్, ఇటీవలే జీవితాంతం అధ్యక్షుడిగా ఉండేలా రాజ్యాంగాన్ని సవరించారు. అయితే దీనిపై చైనా లోపల, బయట కూడా విమర్శలు వినవస్తున్నాయి.
జిన్‌పింగ్ అధ్యక్ష పదవిని స్వీకరించాక అవినీతి వ్యతిరేక చర్యలలో భాగంగా సుమారు లక్ష మంది అధికారులను శిక్షించారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నారని ఆయన విమర్శకులంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)