జపాన్ ఎలక్ట్రిక్ మరుగుదొడ్ల గుర్తుకు అంతర్జాతీయ గుర్తింపు!

ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను వాడే విధానాన్ని సంజ్ఞల రూపంలో పొందుపరిచిన ఓ చిత్రాన్ని జపాన్ రూపొందించింది. ఈ గుర్తుకు ‘అంతర్జాతీయ ప్రమాణం’గా గుర్తింపు లభించింది.

ఇకపై.. ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను వాడే ప్రతి చోటా ఈ గుర్తు కనిపిస్తుంది.

ఈ గుర్తులో మొత్తం ఆరు సంజ్ఞలు ఉంటాయి. వీటి ఆధారంగా ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను ఏవిధంగా వాడాలో వినియోగదారులకు సులువుగా అర్థమవుతుందని, అందుకే ఈ గుర్తును అంతర్జాతీయ స్టాండర్జైజేషన్ సంస్థ ఆమోదించిందని జపాన్‌లోని ‘క్యుడో’ వార్తా సంస్థ పేర్కొంది.

2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు పెద్ద సంఖ్యలో విదేశీ పర్యటకులు రానున్న నేపథ్యంలో ఈ గుర్తును తయారు చేసినట్టు.. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ మరుగుదొడ్ల వాడకం తెలీక పర్యటకులు అయోమయం చెందే అవకాశం ఉందని, ఈ సంజ్ఞలతో.. ఆ మరుగుదొడ్లను ఎలా వాడాలో అర్థమైపోతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.

జపాన్ శానిటరీ ఇండస్ట్రీ అసోసియేషన్.. గత సంవత్సరంలో ఈ సంజ్ఞలను రూపొందించింది. అంతకు ముందే.. తయారీదారులు కూడా తమ ఉత్పత్తులపై వీటిని ముద్రించేందుకు అంగీకరించారు.

''ఈ సంజ్ఞలతో ఎవరైనా ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను పూర్తి విశ్వాసంతో వాడొచ్చు'' అని శానిటరీ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది.

ఈ సంజ్ఞలను మరుగుదొడ్లపై ముద్రించడం ద్వారా వీటి అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ మరుగుదొడ్లలో.. ఈ మరుగుదొడ్లను వేడి నీళ్లతో ఫ్లఫ్ చేసే విధానం, వాడకం పూర్తయ్యాక కమోడ్ మూతలు ఆటోమెటిక్‌గా మూతపడే సౌకర్యాలున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)