You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్థానీ ‘నిర్భయ’ కేసులో నిందితుడికి మరణశిక్ష
పాకిస్థాన్‌లో ఆరేళ్ల బాలిక జైనబ్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు ఇమ్రాన్ అలీ(24)కి అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
లాహోర్ సమీపంలోని కసూర్ పట్టణంలో గత నెల 9న జైనబ్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
గత నెల 23న ఇమ్రాన్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం జరిగిన విచారణలో న్యాయస్థానం.. అపహరణ, అత్యాచారం, హత్య, తీవ్రవాద నేరాలకు గాను అతనికి నాలుగు మరణ శిక్షలు విధించింది.
మరికొందరు బాలికలపైనా అఘాయిత్యాలు?
కాగా అలీపై మరికొన్ని హత్య, అత్యాచార నేరారోపణలూ ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణ జరగాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది ఖాదిర్ షా రాయ్‌టర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
జైనబ్ కేసులో పదుల సంఖ్యలో సాక్షులను విచారించడంతో పాటు ఫోరెన్సిక్, డీఎన్‌ఏ, పాలిగ్రాఫిక్ పరీక్షల ఫలితాలను పరిశీలించిన తరువాత న్యాయమూర్తి మరణశిక్షలు విధించారు.
దీంతో పాటు భారీమొత్తంలో జరిమానా కూడా విధించారు. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ఇమ్రాన్‌కు 15 రోజుల సమయం ఇచ్చారు.
అయితే, అలీ నేరాన్ని అంగీకరించడంతో ఆయన తరఫు న్యాయవాది కేసు నుంచి తప్పుకొన్నారు.
న్యాయస్థానం ఈ తీర్పు చెప్పేటప్పటికి జైనబ్ తండ్రి అక్కడే ఉన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)