You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్నికల వివాదం: ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న డొనాల్డ్ ట్రంప్
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందన్న ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా ప్రకటించారు.
బుధవారం వైట్ హౌస్‌లో మాట్లాడుతూ.. విచారణ కోసం ఎదురు చూస్తున్నానని, అయితే విచారణలో తన న్యాయవాదుల సలహా తీసుకుంటానని అన్నారు.
ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి ట్రంప్ రష్యాతో కుమ్మక్కు అయ్యారా? అన్న విషయంపై ఎఫ్‌బీఐ విచారిస్తోంది.
అంతే కాకుండా ట్రంప్ విచారణను అడ్డుకున్నారా? అన్న దానిని కూడా అధికారులు విచారిస్తారు.
రష్యా, ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు మాస్కో ప్రయత్నించిందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే నిర్ధారించాయి.
అయితే.. తాను రష్యాతో కుమ్మక్కు కాలేదు కాబట్టి విచారణకు ఆస్కారమే లేదని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.
రష్యాతో కుమ్మక్కూ కాలేదు.. విచారణను అడ్డుకోనూ అని స్పష్టం చేశారు. విచారణను ఆయన 'వేధింపులు'గా పేర్కొన్నారు.
ట్రంప్ విచారణ ఎలా ఉంటుంది?
ఇంటలిజెన్స్ అధికారులతో విచారణ ఎలా ఉండబోతోంది? అది ఏ రూపంలో ఉండవచ్చు? అనే వివరాల గురించి ట్రంప్ లాయర్లు ఆరా తీస్తున్నారు.
ట్రంప్‌ను ముఖాముఖి ప్రశ్నలు లేదా రాతపూర్వకంగా లేదా రెండూ కలిపిన విధానం ద్వారా ప్రశ్నించవచ్చు. విచారణకు న్యాయ విభాగం ప్రత్యేక అధికారి రాబర్ట్ ముల్లర్ నేతృత్వం వహిస్తారు.
గతవారం అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను ముల్లర్ పలు గంటల పాటు విచారించారు.
ముల్లర్ విచారణలో భాగంగా ఇప్పటికే నలుగురిపై క్రిమినల్ ఛార్జీలు దాఖలయ్యాయి.
రష్యా దౌత్యవేత్తను కలిసిన విషయంపై గతంలో తాను ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పానని జాతీయ భద్రతా మాజీ సలహాదారు మైఖెల్ ఫ్లిన్ ఇప్పటికే అంగీకరించారు.
ట్రంప్ ప్రచారంలో సలహాదారు అయిన జార్జ్ పపాడోపౌలోస్ కూడా తప్పు చేసినట్లు ఎఫ్‌బీఐ ఎదుట ఒప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)