You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిస్ ఇండియా యూఎస్.. గుండెలో పేస్‌మేకర్!
- రచయిత, ఇరామ్ అబ్బాసీ
- హోదా, బీబీసీ కోసం
కొండంత ఆత్మవిశ్వాసంతో పాటు ఓ పేస్ మేకర్ కూడా సైనీ గుండెలో ఉంది. సమస్య ఉందని కుంగిపోకుండా జీవితంతో పోరాడిన సైనీ ‘మిస్ ఇండియా యూఎస్-2017 టైటిల్ గెలుచుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో జర్నలిజం చదువుకున్న సైనీ తన జీవితాన్ని సేవకు అంకితం చేయాలనుందని అన్నారు. ఆమెకు పన్నెండేళ్ళ వయసులో గుండెకు పేస్ మేకర్ అమర్చారు.
శరీరంలో సమస్య ఉందని అధైర్య పడకుండా ఆమె కూడా అందరిలా నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకున్నారు. అణచివేత ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ మిస్ ఇండియా యూఎస్ఏ ‘బీబీసీ’తో మాట్లాడారు. ఆమె ఏం చెబుతున్నారంటే...
‘నమస్తే, నా పేరు ష్రీ సైనీ. నేను మీ మిస్ ఇండియా యూఎస్ఏ.
నేను హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్నాను. యేల్ యూనివర్సిటీలో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నా.
ఇప్పుడు సియాటెల్‌లో ఉంటూ యునివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో జర్నలిజం చదువుతున్నాను.
నేను పుట్టింది భారత్‌లోని లూధియానాలో. నా ఐదేళ్ళ వయసులో వాషింగ్టన్‌కు వచ్చేశాం. నేను భారత్ లో ఉన్నపుడు తీవ్రమైన పేదరికాన్ని కళ్ళారా చూశాను. ఆ సంఘటనల వల్లే నాలో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే భావన కలిగింది.
అందాల పోటీలు.. మనం అనుకున్నవన్నీ సాధించడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి.
పన్నేండేళ్ళ వయసులో నాకు గుండె జబ్బు ఉందని నిర్థారించారు. నాకు పేస్ మేకర్‌ను అమర్చారు. దానివల్ల నేను అందరిలా సాధారణ జీవితం గడపలేనని అన్నారు.
కానీ నాకు అందాల పోటీల్లో పాల్గొనాలని, పెద్ద చదువులు చదవాలని ఉండేది. అయితే, ఈ సమస్య నా లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అడ్డు కాకూడదని అనుకున్నాను. జీవితాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను.
ఈ ఏడాది భారత్, అమెరికా దేశాలలో... మిస్ ఇండియా యూఎస్‌గా కనీసం 100 ఈవెంట్లు చేయాలనుకుంటున్నా. నాకు నటించాలన్న కోరిక కూడా బలంగా ఉంది.
నా స్వచ్ఛంద సంస్థ బాగా నడవాలని ఆశిస్తున్నా. ఫిజికల్ ఫిట్‌నెస్ అనే కాకుండా ఎమోషనల్ ఫిట్‌నెస్ సమస్యలకు కూడా పరిష్కారాలు సూచించాలనుకుంటున్నాం.
నా చిన్నప్పటి నుంచి నేను రకరకాల చర్చల్లో పాల్గొనేదాన్ని. ఉపన్యాసాలు రాసుకోవడానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకునేదాన్ని.
ఫుడ్ బ్యాంక్, షెల్టర్ హోమ్స్‌కు వెళ్ళేదాన్ని. మీరు కూడా మీ మనసుకు బాగా నచ్చిన విషయాలపై టైమ్ కేటాయించుకోవడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం మర్చిపోవద్దు.’
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)