You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆధార్ డాటా: లీకేజీని బయటపెట్టిన రిపోర్టర్‌కు మద్దతు తెలిపిన ఎడ్వర్డ్ స్నోడెన్
వివాదాస్పద ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు పథకం లీకేజీ అంశంపై కథనం రాసిన భారతీయ జర్నలిస్టు రచనా ఖైరాకు అమెరికా ఉద్యమకారుడు ఎడ్వర్డ్ స్నోడెన్ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఆధార్ వివరాలను కేవలం రూ. 500 మొత్తానికే తాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్న రచనాకు అవార్డు దక్కాలని ఆయన పేర్కొన్నారు.
ఆమె ఆధార్ సమాచారాన్ని తెలుసుకోవటం ద్వారా ‘నేరానికి’ పాల్పడ్డారని యూఐడీఏఐ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటంపై చాలా మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆమె పనిచేస్తున్న వార్తాపత్రిక ‘ద ట్రిబ్యూన్’ ఎడిటర్ హరీశ్ ఖరే కూడా రచన వార్తా కథనాన్ని సమర్థించారు. ‘‘ఈ విస్తృత ప్రజాప్రయోజన అంశం మీద పౌరుల్లో వ్యక్తమవుతున్న న్యాయమైన ఆందోళనకు ప్రతిస్పందనగా ఈ కథనాన్ని ప్రచురించాం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన మార్గాలన్నిటినీ తమ పత్రిక పరిశీలిస్తుందని చెప్పారు.
జర్నలిస్టుపై కేసు నమోదు చేయటం ‘‘అన్యాయం, అక్రమం, పత్రికా స్వాతంత్ర్యం మీద నేరుగా దాడి’’ అని అభివర్ణిస్తూ ఎడిటర్స్ గిల్డ్ కూడా ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ఆ కథనాన్ని ఇతర మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.
పోలీసులకు యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చేసిన ఫిర్యాదులో రచనా ఖైరాతో పాటు.. ఆమె పేర్కొన్న ‘ఏజెంట్ల’ను కూడా చేర్చింది. వారందరూ భారతీయ గోప్యతా చట్టాలను ఉల్లంఘించారని, వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
రచనా మీద కేసు నమోదు చేయటానికి బదులుగా ఆమెను ప్రశంసించాలని స్నోడెన్ పేర్కొన్నారు.
ఆమెకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన వారితో స్నోడెన్ తాజాగా జతకలిశారు.
తాను ఒక ‘ఏజెంటు’కు నగదు చెల్లించిన తర్వాత తనకు ఒక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చారని.. వాటి ద్వారా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో తాను ఏ ఆధార్ నంబర్ ద్వారా అయినా సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు వంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చునని ఖైరా తన కథనంలో పేర్కొన్నారు.
మరో 300 రూపాయలు చెల్లించటం ద్వారా.. ఏ ఆధార్ నంబర్ వివరాలనైనా ప్రింట్ తీసుకునే సాఫ్ట్‌వేర్ కూడా లభించిందని ఆమె చెప్పారు.
చిరునామా మార్పు, తప్పు అక్షరాలను దిద్దటం వంటి వినియోగదారుల సమాచారాన్ని సరిచేసేందుకు ఆధార్ ఏజెంట్లకు అనుమతించే పథకాన్ని ఇలా దుర్వినియోగం చేసినట్లు కనిపిస్తోందని యూఐడీఏఐ పేర్కొంది.
అయితే.. ప్రజల బయోమెట్రిక్ వివరాలను ఏజెంట్లు పొందలేరని, ఆ సమాచారం సురక్షితంగానే ఉందని ఆ సంస్థ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)