You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆధార్ లీక్స్‌పై కథనం రాసిన జర్నలిస్టుపై కేసు
చండీగఢ్ నుంచి ప్రచురితమయ్యే 'ద ట్రిబ్యూన్' పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్న రచన కొద్ది రోజుల క్రితం రాసిన కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తానొక 'ఏజెంట్'ను కలిశాననీ, అతడు తాను ఏ ఆధార్ నెంబర్ ఇచ్చినా సదరు వ్యక్తి వివరాలన్నీ వెల్లడిస్తున్నాడని రచన తన కథనంలో రాశారు.
"అందిన ఫిర్యాదు మేరకు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఒక కేసు నమోదు చేసింది" అని తన పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి తెలిపారు.
'వివరాలు తెలిశాకే స్పందిస్తా'
దీనిపై రచనా ఖైరాను బీబీసీ సంప్రదించగా, "ఓ పత్రికలో అచ్చయిన సమాచారం ద్వారా ఎఫ్ఐఆర్ గురించి నాకు తెలిసింది. అయితే కేసు వివరాలు నాకింకా అందాల్సి ఉంది" అని చెప్పారు.
"నాకు పూర్తి వివరాలు అందిన తర్వాతే నేను దీనిపై ఏదైనా మాట్లాడగలను" అని రచన అన్నారు.
మీడియా కథనాల ప్రకారం, యూఐడీఏఐ అధికారి ఒకరు రచనపై ఫిర్యాదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని 419 (తప్పు పేరుతో మోసం చేయడం), 420 (మోసం), 468 (ఫోర్జరీ), 471 (నకిలీ దస్త్రాన్ని నిజమైందిగా ఉపయోగించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆ అధికారి కోరారు.
ఈ ఎఫ్ఐఆర్‌లో మరి కొందరి పేర్లు కూడా నమోదు చేశారు. ఈ కథనం కోసం రిపోర్టర్ సంప్రదించిన వారిపై కూడా కేసు పెట్టినట్టు తెలుస్తోంది.
ఆధార్‌పై ట్రిబ్యూన్ కథనం ఏం చెప్పిందంటే..
గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా ఫ్రీగా ఆధార్ సీక్రెట్ డేటా అందజేస్తున్నారని జనవరి 4న 'ద ట్రిబ్యూన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
పేటీఎం ద్వారా కేవలం రూ.500 చెల్లించగా ఈ రాకెట్‌ను నడిపిస్తున్న ఓ ఏజెంటు ఆధార్ డేటా యాక్సెస్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇస్తున్నాడంటూ ఆ కథనంలో రాశారు. ఈ సీక్రెట్ డేటాలో వ్యక్తి పేరు, చిరునామా, పోస్టల్ కోడ్, ఫొటో, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ అన్నీ ఉన్నాయని కథనం వెల్లడి చేసింది.
ఆ ఏజెంట్‌కు అదనంగా రూ.300 ఇస్తే.. ఆధార్ కార్డులను ప్రింట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను కూడా తమకిచ్చాడని తెలిపింది.
నిరాధారం: యూఐడీఏఐ
యూఐడీఏఐ ఈ కథనాన్ని తోసిపుచ్చింది. ఇది తప్పుడు కథనం అని ఆరోపించింది. ఆధార్ డేటా లీక్ అవుతోందన్న వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. బయోమెట్రిక్ సమాచారం సహా ఆధార్ డేటా అంతా సురక్షితంగా ఉందని యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.
'సుప్రీం' విచారణలో ఆధార్
ఆధార్, వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంలో దీన్ని సవాల్ చేసిన పిటిషనర్లు.. ఆధార్ పేరుతో వ్యక్తిగత సమాచార గోప్యత హక్కుకు పూర్తిగా భంగం కలిగిస్తున్నారని, ఆధార్‌ను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమ వాదన వినిపించారు.
ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా వెల్లడించడాన్ని నిరోధించే, అలాంటి చర్యలకు పాల్పడినవారిని శిక్షించే సమాచార భద్రత నిబంధనలు లేకపోవడం పెద్దముప్పని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు మొబైల్ నంబర్లకు ఆధార్ లింకేజి గడువును ఈ కేసు విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే మార్చి 31 వరకు పొడిగించింది.
దీంతోపాటు ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 కింద 139 రకాల సేవలు, రాయితీలు పొందేందుకుగాను ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు. ప్రస్తుతం కొత్త మొబైల్ ఫోన్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఇప్పటికే ఉన్నదానికైనా ఈ-కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది, అందుకోసం ఆధార్ సంఖ్యతో అనుసంధానించాలన్న నిబంధన ఉంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)