You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్: నా మానసిక పరిస్థితికేం ఢోకా లేదు, నేను జీనియస్!
తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అమెరికా అధ్యక్షుడిగా పనిచేయలేనంటూ తాజాగా విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొనడంపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ పుస్తకంలో రాసిన విషయాల్లో వాస్తవం లేదని, అన్నీ 'అభూత కల్పనలే'నని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పుస్తక రచయిత ఓ 'మోసకారి' అంటూ రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మండిపడ్డారు.
అంతకు ముందు ట్విటర్‌లోనూ ట్రంప్ స్పందించారు. తాను 'మానసిక స్థిరత్వం కలిగిన చాలా తెలివైన వాడిని(జీనియస్), చాలా స్మార్ట్' అంటూ తనను తాను పొగుడుకున్నారు.
గతంలో హిల్లరీ క్లింటన్ కూడా తనపై ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేశారనీ, అయితే అవన్నీ విఫలమైన సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
"నేను మంచి కాలేజీలో చదువుకున్నా. చాలా తెలివైన విద్యార్థిగా నాకు పేరుండేది. ఆ తర్వాత బిలియన్ల కొద్ది డబ్బు సంపాదించాను. టాప్ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచాను. పదేళ్ల పాటు టీవీలో ఎలా మెప్పించానో మీ అందరికీ తెలిసిన విషయమే" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే.. రచయిత మైఖేల్ వోల్ఫ్ మాత్రం ట్రంప్ వ్యవహార శైలిని, జీవితాన్ని దగ్గరగా పరశీలించిన తర్వాతే పుస్తకం రాశానని వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య జరిగిన 3 గంటల ఇంటర్వ్యూ సంభాషణలను రికార్డు కూడా చేశానని తెలిపారు.
దీన్ని ట్రంప్ తోసిపుచ్చారు. తాను వోల్ఫ్‌తో మాట్లాడనే లేదని స్పష్టం చేశారు. అయితే గతంలో ఓసారి మాత్రం తనను రచయిత ఇంటర్వ్యూ చేసింది నిజమేనని ఒప్పుకున్నారు.
అసలు ఏంటా పుస్తకం కథ?
'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్' పేరుతో అమెరికాలో శుక్రవారం ఓ పుస్తకం విడుదలైంది. దాని రచయిత మైఖేల్ వోల్ఫ్ .
డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వమని.. సరైన విధాన నిర్ణయాలు తీసుకోలేరని.. చెప్పిన దాన్నే పదేపదే చెబుతారంటూ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
వైట్‌హౌస్ సిబ్బంది కూడా ట్రంప్ మానసిక స్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారని, ఓ ఉన్నతాధికారి అయితే.. ట్రంప్‌ని 'మూర్ఖుడు'గా కూడా అభివర్ణించారంటూ అందులో రాశారు.
ప్రస్తుతం ఈ పుస్తకంపై అమెరికాలో తీవ్రమైన చర్చే నడుస్తోంది.
ట్రంప్ తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలను దాటుకుని, శుక్రవారం విడుదలైన ఈ పుస్తకం కాపీలు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)