You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా ఎన్నికలు: పుతిన్ ప్రత్యర్ధి అలెక్సీ నావల్సీపై అనర్హత వేటు
2018లో జరగబోయే రష్యా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని బహిష్కరించారు.
ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు రుజువవ్వడంతో అలెక్సీ నావల్నీ ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే.. ఈ అవినీతి ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నవని నావల్నీ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో 2018 మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాలంటూ తన మద్దతుదారులకు నావల్నీ పిలుపునిచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక నేతగా 41 సంవత్సరాల అలెక్సీ నావల్నీకి పేరుంది.
''2018లో జరగబోయే ఎన్నికలను మేం పరిగణలోకి తీసుకోబోము. ఎన్నికలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఓటర్ల సమ్మె చేపడతాం. అందుకు ప్రజల మద్దతును కోరుతున్నాం'' అని బహిష్కరణ అనంతరం నావల్నీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగే నిరసనలకు తాను నాయకత్వం వహిస్తానని చెప్పారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమం, పుతిన్ వ్యతిరేక ఆందోళనలతో నావల్నీ పేరొందారు. కానీ తనపై ఉన్న అవినీతి కేసుల పునర్విచారణలో భాగంగా 5సంవత్సరాల బహిష్కరణకు గురయ్యారు.
అధ్యక్షుడి అభ్యర్థిత్వానికి నావల్నీ దాఖలు చేసిన నేమినేషన్‌ను ఎన్నికల సంఘంలో ఉండే 13 మంది సభ్యుల్లో 12 మంది తిరస్కరించారని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు ఎల్లా పామ్ఫిలోవా తెలిపారు.
అనర్హత వేటు నిర్ణయం వెలువడ్డాక నావల్నీ మాట్లాడుతూ.. ‘‘రష్యాలో నెలకొన్న పరిస్థితులపై నిజాలు మాట్లాడకుండా నన్ను అడ్డుకుంటున్నారు’’ అని అన్నారు.
తనను బహిష్కరించడం అంటే.. లక్షలాది ప్రజల ఓటు హక్కును తిరస్కరించడమేనని ఆయన అభివర్ణించారు.
''వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు 2018 ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారంతా ఆయన అనుకూల వర్గానికి చెందినవారే'' అని నావల్నీ ఆరోపించారు.
తనపై ఎన్నికల సంఘం తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని రష్యా రాజ్యాంగ కోర్టులో సవాలు చేస్తానని నావల్నీ అన్నారు.
తన అభ్యర్థిత్వాన్ని నిలుపుకోవటానికి అవసరమైన 500 సంతకాలను సేకరించినట్టు నావల్నీ తెలిపారు. ఈ సంతకాల సేకరణ తనకు సానుకూల ఫలితాన్నిస్తుందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక.. నావల్నీ ఉద్యమ కార్యాచరణ ఏంటి?
సారా రెయిన్స్‌ఫోర్డ్, బీబీసీ న్యూస్, మాస్కో
రష్యాలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ.. అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడైన నావల్నీ దేశంలో ప్రజాకర్షణ కలిగి, గుర్తింపు కలిగిన నాయకుడు.
గత కొన్ని నెలలుగా నావల్నీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలతో మమేకమవుతున్నారు. తనకున్న విస్తృత మద్దతును చూపించి సంబంధిత సంస్థలపై ఒత్తిడి పెంచి, అధ్యక్ష పదవికి పోటీపడేందుకు అనుకూల మార్గం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
పోటీ నుంచి బహిష్కరణకు గురైన నావల్నీ.. 2018 అధ్యక్ష ఎన్నికలను సామూహికంగా బహిష్కరించేందుకు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అయితే, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇతర రాజకీయ నాయకులకు ఆమోదం తెలిపినట్లు ఎన్నికల కమిషన్ ఛీఫ్ చెప్పిన నేపథ్యంలో.. నావల్నీ నిరసనలకు మద్దతు తగ్గే అవకాశం ఉంది.
నావల్నీని అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించటం అనేది సాహసమే అయినా.. దాన్ని చాకచక్యంగా చక్కదిద్దవచ్చునని అంచనా వేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
2013లోనే అవినీతి ఆరోపణలు
నావల్నీపై 2013లో మొదటిసారి అవినీతి ఆరోపణలు వచ్చాయి.
కిరోవ్ రాష్ట్ర గవర్నర్‌కు సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ టింబర్ కంపెనీ ‘కిరోవ్లస్’లో 16 మిలియన్ రూబుల్స్ (5 లక్షల డాలర్ల) అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనకు శిక్ష పడింది.
ఈ కేసులో 5సంవత్సరాల బహిష్కరణ విధించారు. కానీ కేసు విచారణ సరిగా లేదంటూ 'యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్' న్యాయస్థానం శిక్షను రద్దు చేసింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా తిరిగి అదే శిక్షను ప్రస్తుతం ఖరారు చేశారు.
మరోవైపు.. నాలుగోసారి అధ్యక్షుడిగా విజయం సాధించాలని పుతిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాని ఎక్కువ కాలం పాలించిన అధ్యక్షుడిగా పుతిన్ నిలుస్తారు.
పుతిన్‌కు ఇప్పటికీ భారీ మద్దతు లభిస్తోంది, ఎన్నికల్లో విజయం ఆయనకు నల్లేరుమీద నడకలాగే కనిపిస్తోంది.
మా ఇతర కథనాలు:
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- అతన్ని రేప్ చేశారు
- నాటి తియానాన్మెన్ స్క్వేర్ ఘటనలో మృతుల సంఖ్య 10 వేలు
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- ట్రంప్ మునుపటి అనుచరుడు చెప్పింది అబద్ధమే!
- రాజకీయ ప్రకటనల గుట్టు ఇక రట్టు!
- సరిగ్గా చూడండి.. అందంగా ‘పడతారు’
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)