You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హెచ్-1బీ వీసా రెన్యువల్ ఇక మరింత కఠినతరం
హెచ్-1బీ, ఎల్-1, ఇతర నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల రెన్యువల్ నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. అమెరికా వెళ్లే భారత ఐటీ వృత్తినిపుణులు హెచ్-1బీపైనే ఎక్కువగా ఆధారపడతారు. కాబట్టి వీరిపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
వీసా గడువు పొడిగింపును కోరిన ప్రతిసారీ సదరు వీసాను కలిగి ఉండేందుకు తనకున్న అర్హతను పిటిషనరే ఫెడరల్ అధికార యంత్రాంగం ఎదుట నిరూపించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ విషయమై అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఈ నెల 23న ఒక మెమోరాండం జారీచేసింది. వీసా రెన్యువల్‌కు సంబంధించి 13 సంవత్సరాలకు పైగా ఉన్న విధానం స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
పాత విధానం ప్రకారం- వర్క్ వీసాకు మొదట్లో అర్హత నిర్ధరణ అయితే, వీసా పొడిగింపు అభ్యర్థనను అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకొనేది.
2004 ఏప్రిల్ 23 నాటి ఆదేశం ప్రకారం దరఖాస్తుదారు అర్హతను తేల్చే బాధ్యత తమ సంస్థపై ఉందని యూఎస్‌సీఐఎస్ చెప్పింది.
కొత్త నిబంధన అమెరికాలో ఇప్పటికే ఉంటున్నవారికీ వర్తిస్తుందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలియం స్టాక్‌ను ఉటంకిస్తూ వార్తాసంస్థ పీటీఐ పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు రజిత్ ఆకుల దీనిపై బీబీసీతో మాట్లాడుతూ ఈ నిర్ణయం అమెరికాలో పని చేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్‌కు చాలా ఇబ్బందికరమని అన్నారు.
"ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లే వారికి గుర్తింపు పత్రాలు వగైరా అన్నింటితో పాటుగా, ఉద్యోగం ఆఫర్ చేస్తూ కంపెనీ ఇచ్చే పత్రాలు సమర్పిస్తే హెచ్-1బీ వీసా మంజూరు చేస్తారు. ఈ వీసా సాధారణంగా 2-3 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ గడువు పూర్తి కావడానికి నెల రోజుల ముందు కంపెనీ ఫార్మల్‌గా ఇచ్చే ఓ ఉత్తరంతో ఈ వీసాను రెన్యువల్ చేస్తారు. ఇప్పటి దాకా ఇదే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ అర్హతకు సంబంధించిన మొత్తం పత్రాలతో పాటు కంపెనీ ఇచ్చే పత్రాలను మళ్లీ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది" అని రజిత్ అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)