You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీవాణువుల 'చిత్రకారులకు' నోబెల్ బహుమతి
జీవ అణువుల ఆకృతిని తెలిపే చిత్రాలను మెరుగుపరిచే ప్రక్రియను రూపొందించినందుకు రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతి వరించింది.
ప్రొఫెసర్ జాక్వెస్ డుబోచెట్ (స్విట్జర్లాండ్), జోచిమ్ ఫ్రాంక్ (జర్మనీ), రిచర్డ్ హెండర్సన్ (ఎడిన్‌బర్గ్, బ్రిటన్) ఈ ముగ్గురూ రూ. ఏడు కోట్ల 17 లక్షల (831,000 బ్రిటిష్ పౌండ్లు) నగదు బహుమతిని అందుకోనున్నారు.
ఈ ముగ్గురు కలిసి క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ(క్రయో-ఈయం) అనే సాంకేతిక ప్రక్రియను రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారా జీవుల్లోని ప్రతి కణం ఆకృతిని, పనితీరును గుర్తించడం చాలా సులభమవుతుంది.
ఇవి కూడా చదవండి:
ఈ కొత్త విధానాన్ని వినియోగించడం చాలా అద్భుతంగా ఉందని ప్రొఫెసర్ ఫ్రాంక్ అన్నారు. జీవరసాయన శాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారని నోబెల్ కమిటీ కొనియాడింది.
‘‘మనలోని జీవ అణువుల రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు. ప్రతి కణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంది. శరీరంలోని ప్రతి ద్రవం చుక్కలో ఏ కణం ఎలా ఉందో గుర్తించొచ్చు.
ఏ కణం నిర్మాణం ఎలా ఉంది? ఎలా పనిచేస్తుంది? ఒకదానికొకటి ఎలా సమన్వయం చేసుకుంటున్నాయి? వంటి విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు. జీవరసాయన శాస్త్రంలో ఇదో విప్లవం’’ అని నోబెల్ కమిటీ ఛైర్మన్ సారా అభిప్రాయపడ్డారు.
రోగ నిరోధకాలుగా పనిచేసే కణాలు, ప్రొటీన్లే లక్ష్యంగా దాడి చేసే సాల్మొనెల్ల బ్యాక్టీరియా చిత్రాలను తీసేందుకు క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని వినియోగించారు.
బ్రెజిల్‌లోని చంటి బిడ్డలో జికా వైరస్ ఉన్నట్లు అనుమానం రావడంతో పరిశోధకులు క్రయో-ఈయం ద్వారా దాని ఆకృతి, కదలికలను గుర్తించారు. ఆ తర్వాత దానికి 3డీ చిత్రాలను రూపొందించడంతో, మందులను కనుగొనటం సాధ్యమైంది.
ఈ సాంకేతిక ప్రక్రియతో వైద్య శాస్త్రంలో వినూత్న మార్పులకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)