You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెక్సికోలో భారీ భూకంపం, 250 మంది మృతి
మెక్సికోలో భూమి తీవ్రంగా కంపించడంతో రాజధాని మెక్సికో సిటీ సహా చుట్టుపక్కల రాష్ట్రాలలో దాదాపు 250 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి.
సహాయదళం సభ్యులు భవన శిథిలాలలో బతికున్న వారి కోసం అన్వేషిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు తెలిపారు.
రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైన ఈ భూకంపం మెక్సికో సిటీ, మోరలియోస్, పుయెబ్లా ప్రావిన్స్‌లలో భారీ వినాశనం సృష్టించింది.
32 ఏళ్ల క్రితం మెక్సికోలో భారీ భూకంపం రాగా దాదాపు 10,000 మంది చనిపోయారు.
భూకంపం వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు ఎలా చేపట్టాలో మంగళవారం నాడు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నప్పుడే ఈ వినాశకర భూకంపం వచ్చింది.
మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకల్ని కొద్ది సేపు నిలిపివేశారు. నగరంలో భవనాలన్నింటినీ ఖాళీ చేయించారు.
భూమి కంపించే అవకాశాలున్న ప్రాంతం
మెక్సికోలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ నెలలోనే దేశంలోని దక్షిణ ప్రాంతంలో 8.1 తీవ్రతతో భూమి కంపించింది. ఆ సంఘటనలో 90 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం వచ్చిన భూకంపానికి కేంద్రం పుయెబ్లా రాష్ట్రంలోని ఎంటెసిగోకు దగ్గరగా ఉందని గుర్తించారు. ఇది రాజధాని మెక్సికో సిటీకి 120 కి.మీ. దూరంలో ఉంది. ఈ భూకంపం లోతు 51 కి.మీ. అని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే గుర్తించింది.
మోరలియోస్ రాష్ట్రంలో 54 మంది, పుయెబ్లో రాష్ట్రంలో 26 మంది మరణించినట్టు తెలుస్తోంది.
మెక్సికో సిటీలో 30 మంది మరణించినట్టు ధృవీకరించారు. మెక్సికో రాష్ట్రంలో 9 మంది చనిపోయారు.
ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.14 గంటలకు వచ్చింది.
జనం రోడ్లపై రావొద్దనీ, అత్యవసర సేవలకు అంతరాయం కలిగించవద్దనీ దేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియెటో విజ్ఞప్తి చేశారు.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో టెలిఫోన్ సేవలకు అంతరాయం కలిగింది. దాదాపు 40 లక్షల మంది కరెంటు కోత ఎదుర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందిస్తూ, "మెక్సికో సిటీ ప్రజలను భగవంతుడు రక్షించు గాక. మేం మీతోనే ఉన్నాం. ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం" అని ట్వీట్ చేశారు.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.