You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేటీఆర్: ‘వీ6ను ఎప్పుడు బ్యాన్ చేయాలో మాకు తెలుసు’
దిల్లీ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, కానీ వాస్తవానికి స్కామ్‌లు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే...
ఎయిర్‌పోర్టులు:
దేశంలో ఒక సంస్థకు రెండు కంటే ఎక్కువ ఎయిర్‌పోర్టులు ఉండకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ నిబంధనలు తుంగలో తొక్కి అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇచ్చారు. ఇదొక స్కాం.
కృష్ణపట్నం పోర్టు:
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులతో పాటు జీవీకే ముంబయి ఎయిర్‌పోర్టును అదానీ కోసం బలవంతంగా లాక్కున్నారు. అదొక పెద్ద స్కాం.
అదానీ పోర్టులో డ్రగ్స్:
అదానీ ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల హెరాయిన్ దొరికింది. కోట్ల విలువైన కొకైన్ దేశంలోకి వస్తోంది. వారి మీద కేసులు లేవు.
అదానీ ఆస్ట్రేలియా బొగ్గు:
ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి మాత్రమే బొగ్గు కొనాలని పాలసీ చేయడం ఒక స్కాం.
గుజరాత్ లిక్కర్ మరణాలు:
గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంది. అయినా లిక్కర్ తాగి 42 మంది చనిపోయారు. అదొక స్కాం.
అదానీతో సంబంధాల మీద నరేంద్ర మోదీ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అయితే అదానీకి మేలు కలిగేలా నరేంద్ర మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఆరోపణలను బీజేపీ ఖండిస్తూ వస్తోంది.
‘వీ6ను ఎప్పుడు బ్యాన్ చేయాలో మాకు తెలుసు’: కేటీఆర్
ప్రెస్‌మీట్ సందర్భంగా వీ6 రిపోర్టర్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చానెల్‌ను ఎప్పుడు బ్యాన్ చేయాలో తమకు తెలుసంటూ హెచ్చరించారు.
''వీ6లో ఏం మాట్లాడతారో మాకు తెలుసు. ఏం చూపెడతారో మాకు తెలుసు. ఏం డ్రామాలు చేస్తరో మాకు తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా?రాష్ట్రంలో బీజేపీ మౌత్ పీసెస్‌లాగా ఉన్న చిల్లర సంస్థలను ప్రజల ముందు ఎండగడతాం. అది వెలుగా? వీ సిక్సా? ఇంకోటా కాదు... నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అనే వాటిని బీజేపీ ఆఫీసులో బ్యాన్ చేశారు. వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మరి అది అప్రజాస్వామికం కాదా? ఈ దేశంలో పత్రికలు ఎవరు ఆడించినట్లు ఆడుతున్నాయి? మోదీ మీద శ్రీలంక అనే దేశం ఆరోపణలు చేస్తే ఒక్క పత్రికైనా రాసిందా? ఒక్క మీడియా సంస్థకైనా ధైర్యం ఉందా? ధైర్యం లేదు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బీబీసీ మీదనే దాడి చేసినోడు మిమ్మల్ని విడిచిపెడతడా? మీరెంత ఆయన ముందు. సగం మీడియా సంస్థలను కొనేశారు. మొన్న ఎన్‌డీటీవీని ఎవరు కొన్నారు?... గౌతమ్ అదానీ. ఒక మాఫియా నడిపించినట్లు మీడియాను నడిపిస్తున్నారు'' అని కేటీఆర్ అన్నారు.
‘తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నరు?’: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ కుట్ర ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కవితలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
అన్నాచెల్లెల్లు ఇద్దరూ అబద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. 'తెలంగాణ ప్రజలెవరైనా మీరు దిల్లీకి వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారం చేయాలని కోరారా?' అంటూ ఆయన ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ '' మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నరు? మీ అక్రమ వ్యాపారానికి మహిళా సమాజానికి ఏ రకంగా లింక్ పెడుతున్నరు? మీరు వ్యాపారం తెలంగాణ ప్రజల కోసం, మహిళల కోసం చేశారా? మీరు నీతిమంతులైతే, అక్రమ మద్యం వ్యాపారం చేయనట్లయితే, అక్రమంగా డబ్బులు సంపాదించనట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నరు? ఎందుకు భయపడుతున్నరు?
లక్షల రూపాయల విలువజేసే మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? ప్రధానికి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన గొప్పవాళ్లేం కాదు మీరు. వ్యాపారం చేసింది మీరు, ఇరుక్కున్నది మీరు, దర్యాప్తు చేయడం నరేంద్ర మోదీ తప్పా?'' అని ప్రశ్నించారు.
మద్యం వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమంటూ విమర్శించారు కిషన్ రెడ్డి.
''మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి ఐదు సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన మీకు రిజర్వేషన్ గురించి అడిగే హక్కు ఉందా?'' అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా-
- యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది, కారణమేంటి--వీక్లీ షో విత్ జీఎస్
- నగరాలలో మహిళలు గుమ్మం దాటి బయటకు రావడం బాగా తగ్గిందా... ఎందుకిలా-
- పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది...-
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)