కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి? పిచ్చి కుక్క కాటు అంటే ఏంటి?

  • హైదరాబాద్‌లో ఫిబ్రవరి 19న వీధి కుక్కల దాడిలో ఒక ఐదేళ్ల బాలుడు చనిపోయాడు.
  • కరీనంగర్‌ జిల్లాలో హాస్టల్‌లోకి చొరబడిన కుక్కలు విద్యార్థిని కరిచాయి.
  • కేరళలో గత ఏడాది వీధికుక్క దాడిలో 12 ఏళ్ల బాలికపై మరణించింది.
  • ముంబైలో ఓ పెంపుడు కుక్క, ఆహారం డెలివరీ చేసే వ్యక్తిని గాయపరిచింది.
  • ఉత్తర్‌‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో పిట్‌బుల్ జాతి కుక్క తన 82 ఏళ్ల యజమానురాలిపై దాడి చేసింది. తరువాత ఆమె చనిపోయారు.

ఇలాంటివి ఎన్నో వింటుంటాం. కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధితో ప్రతీ సంవత్సరం సుమారు 55,000 మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఆసియా, ఆఫ్రికాల్లో కుక్క కాటుకు సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.

భారతదేశంలో దాదాపు 30 నుంచి 60 శాతం రేబిస్ కేసులు, మరణాలు 15 ఏళ్లలోపు పిల్లల్లోనే కనిపిస్తున్నాయి.

కుక్క కాటుకు సంబంధించిన ఓ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లిందంటేనే ఈ వ్యవహారం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.

కేరళలో కుక్కకాటుకు ఓ బాలిక మృతి చెందడంతో న్యాయవాది వీకే బిజు దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, గత అయిదేళ్లలో పది లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 5న దాఖలైన ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 9న విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రజల భద్రత, జంతు హక్కుల మధ్య సమతుల్యాన్ని సాధించాలని పేర్కొంది.

వీధికుక్కల సమస్య పరిష్కారానికి హేతుబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 28న జరగనుంది.

కుక్కలు ఎందుకు కరుస్తాయి?

ప్రముఖ పశువైద్యుడు అజయ్ సూద్ ప్రకారం, కుక్క కాటు కేసుల్లో చాలావరకు అభద్రతాభావం కారణంగా జరుగుతాయి.

''ప్రతీ కుక్క కొంత ప్రాంతాన్ని తనదిగా భావిస్తుంది. ఇప్పుడు ఓవైపు మానవ జనాభా పెరిగిపోతుంది, మరోవైపు కుక్కల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలు తమదిగా భావించే ప్రాంత విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో వాటిలో అభద్రతాభావం పెరుగుతుంది. మానవులు, తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారని వాటికి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి.

కొన్నిసార్లు ప్రజల్ని భయపెట్టడాన్ని కుక్కలు ఒక ఆటలా చూస్తాయి. అవి వెంటపడినప్పుడు ప్రజలు పరుగు పెడతారు. అది చూసి మానవులు తమకు భయపడుతున్నారని అవి తెలుసుకుంటాయి. వెంటనే దాన్నొక ఆటలా భావిస్తాయి. ఈ క్రమంలో అవి ఒక్కోసారి కరుస్తాయి'' అని ఆయన చెప్పారు.

ఉష్ణోగ్రతలు పెరగడం, తిండి దొరక్కపోవడం, పెద్ద శబ్ధాలు, ప్రకాశవంతమైన లైట్లు కారణంగా కూడా వీధుల్లో ఉండే కుక్కలు దూకుడుగా ప్రవర్తిస్తాయి.

పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయి?

పెంపుడు కుక్కలను వాటి యజమానులే అలా తయారయ్యేలా చేస్తారని డాక్టర్ అజయ్ సూద్ అన్నారు.

''రెండు, మూడు నెలల వయస్సున్న బుజ్జి కుక్కపిల్లలు ప్రతీ వస్తువును నోటితో పట్టుకుంటాయి. వాటికి అప్పుడప్పుడే దంతాలు వస్తుంటాయి. అందుకే అన్నింటినీ నోట్లోకి తీసుకుంటాయి. ఆ సమయంలో యజమానులు వాటిని నోటితో పట్టుకోకుండా ఆపరు. అవి ఆడుకుంటున్నాయని చూస్తూ ఆనందిస్తారు. తర్వాత వాటికి అదొక అలవాటుగా మారుతుంది. నిజానికి ఇది వాటికి మంచి అలవాట్లు నేర్పించాల్సిన వయస్సు.

చాలామంది కుక్కలను తెచ్చుకొని వాటిని ఇంట్లో ఒక మూలన కట్టేసి ఉంచుతారు. దీంతో అవి అభద్రతాభావానికి గురవుతాయి. వాటికి అంతగా పరిచయం లేని వ్యక్తులు ఎదురైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తాయి. ఇలాంటి సమయంలో ఒక్కోసారి కరుస్తాయి'' అని ఆయన వివరించారు.

ఆహారం, పానీయాల్లో అసమతుల్యత కూడా అవి దూకుడుగా వ్యవహరించేందుకు కారణం అవుతుందని ఆయన చెప్పారు.

''కొన్నిసార్లు ఇంట్లో, పెంపుడు కుక్కలకు వాటికి సరిపోయేదాని కంటే అధికంగా ఆహారం పెడుతుంటారు. ఎక్కువ శారీరక శ్రమ కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి శారీరక శక్తి మొత్తం ఖర్చు అవ్వదు. దీంతో అవి దూకుడుగా మారతాయి'' అని తెలిపారు.

భారత్‌లో పశువుల కోసం పనిచేస్తోన్న 'ఫ్రెడికోజ్ సంస్థ'కు చెందిన అభిషేక్ సింగ్... వీధి కుక్కలు ప్రమాదకరమా? లేక పెంపుడు కుక్కలు ప్రమాదకరమా అనే ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశం వాటి జాతిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. హైపర్ బ్రీడ్ కుక్కలు మరింత దూకుడుగా ఉంటాయని చెప్పారు.

''ఒకవేళ ఒక కుక్క, హైపర్‌బ్రీడ్‌కు చెందినదైతే దాని ప్రవర్తన ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు'' అని అన్నారు.

పెంపుడు కుక్క, వీధి కుక్కలు కరవడంలో ఎలాంటి తేడా ఉంటుంది?

పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కరవడంతో తేడాలు ఉంటాయని డాక్టర్ సూద్ చెప్పారు. పెంపుడు కుక్క ఒకసారి కరవగానే వెనక్కి తగ్గుతుందని అన్నారు.

''సాధారణంగా పెంపుడు కుక్కలకు తాము తప్పు చేశామని గ్రహించే గుణం ఉంటుంది. అందుకే ఒకసారి కరవగానే అవి వెనక్కి తగ్గుతాయి. అదే వీధి కుక్కలు ఇలా ఉండవు. వాటికి వేటాగే గుణం ఉంటుంది. పుట్టుకతోనే వాటికి కరవాలనే గుణం ఉంటుంది'' అని వివరించారు.

పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు ఇప్పిస్తారు. వీధి కుక్కలకు ఎలాంటి టీకాలు వేయరు. కాబట్టి వీధి కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

పిచ్చి కుక్క కాటు అంటే ఏంటి?

'ఒకవేళ పిచ్చి కుక్క కరిస్తే దాన్ని నాలుగు రోజుల పాటు గమనించాలి. ఒకవేళ అది బతికే ఉంటే పర్లేదు, లేకపోతే చాలా ప్రమాదకరం' అని అందరూ తరచుగా అంటుంటారు.

దీని గురించి డాక్టర్ సూద్ వివరించారు. ''రేబిస్ సోకిన నాలుగు నుంచి పది రోజుల్లోగా ఆ కుక్క చనిపోతుంది. ఒకవేళ వీధి కుక్క ఎవరినైనా కరిస్తే, అదే రోజున దానికి రేబిస్ సోకినట్లుగా భావిస్తారు. దాన్ని నాలుగు రోజుల పాటు గమనించాలని చెబుతుంటారు. ఒకవేళ అది మరణిస్తే అప్పుడు మీరు ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి'' అని ఆయన చెప్పారు.

రేబిస్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది డంబ్ రేబిస్. ఇది సోకితే కుక్క శరీరంలోని నరాలు బలహీనం అవుతాయి. అది కదల్లేక ఎప్పుడూ ఒక దగ్గరే కూర్చొని ఉంటుంది. తర్వాత పక్షవాతంతో నాలుగు రోజుల్లోనే చనిపోతుంది.

రెండోది ఫ్యూరియస్ రేబిస్. ఇది సోకితే కుక్క మరణించడానికి పది రోజులు పడుతుంది. ఈ సమయంలో అది మరింత కోపంగా, దూకుడుగా మారుతుంది.

''ఈ రకమైన రేబిస్ సోకితే కుక్క మరింత దూకుడుగా తయారవుతుంది. లాలాజలం మింగలేకపోతుంది. గొంతులోని నరాలు పక్షవాతానికి గురవుతాయి. అది ఆ అనారోగ్యంతో మరింత కలతకు గురై కరవడం ప్రారంభిస్తుంది'' అని డాక్టర్ సూద్ చెప్పారు.

కుక్క కరిస్తే ఏం చేయాలి?

కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి సోకుతుందనే భయం చాలామందిని చుట్టుముడుతుంది.

కుక్క కరిచినప్పుడు మొదట గాయాన్ని కనీసం పది నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. తర్వాత బీటాడిన్ క్రీమ్ రాయాలి.

''సాధారణంగా పెంపుడు కుక్కలకు టీకాలు ఇస్తారు కాబట్టి రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు. అందుకే దాన్నొక మామూలు గాయంల లాగే పరిగణించాలి. ఒకవేళ వీధి కుక్క కరిస్తే దాన్ని తప్పకుండా గమనించాలి. అది మరణిస్తే కచ్చితంగా యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి.

తర్వాత పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణను కొనసాగిస్తుండాలి. కుక్క కరిచిన రోజుతోపాటు మూడో రోజు, ఏడో రోజు, పద్నాలుగో రోజు, 28వ రోజు.. ఇలా మొత్తం అయిదు ఇంజెక్షన్లు తీసుకోవాలి'' అని డాక్టర్ సూద్ వివరించారు.

యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ధర రూ. 300-400 ఉంటుంది. దీనికంటే ముందు 'ఇమ్యునోగ్లోబులిన్' అనే మరో ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని ఉచితంగా అందజేస్తారు.

కుక్కలను పెంచుకోవాలంటే నిబంధనలు ఏంటి?

ప్రతీ కుక్కను ఒక నిర్ణీతమైన వాతావరణంలో పెంచాల్సి ఉంటుంది.

ఉదాహరణకు జర్మన్ షెఫర్డ్‌ను ప్రతీరోజూ వాకింగ్‌కు తీసుకెళ్లాలి. రోజూ దాన్ని నడిపించకపోతే, దాని ఆరోగ్యానికి చేటు కలుగుతుంది.

పరిమాణంలో పెద్దగా ఉండే పిట్‌బుల్స్ వంటివి నిజానికి కాపలా కోసం ఉద్దేశించినవి. మీకు విశాలమైన స్థలం ఉంటే వాటిని పెంచుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ, పరిమిత స్థలంలో వాటిని పెంచకూడదు. అలా చేస్తే వాటి ఆరోగ్యానికి మంచిది కాదు.

పరిమిత స్థలం ఉంచే చిన్న పరిమాణంలో ఉండే వాటిని పెంచుకోవడం మంచిది.

పెంపుడు కుక్కల యజమానులు కింది నియమాలను పాటించాలని అభిషేక్ సింగ్ చెప్పారు.

  • పెంపుడు కుక్కలకు పూర్తిస్థాయిలో టీకాలు కచ్చితంగా ఇప్పించాలి
  • వ్యాక్సినేషన్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
  • తరచుగా హెల్త్ చెకప్స్ చేయిస్తుండాలి.
  • పెంపుడు కుక్కలను వదిలిపెట్టకూడదు.
  • వాటిని హింసించకూడదు.
  • ప్రతీ సమాజానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. కాబట్టి వాటిని పాటించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)