తల్లిని కాల్చి చంపిన తండ్రిని శిక్షించాలంటూ రక్తంతో లేఖ రాసిన కూతుళ్లు.. ఆరేళ్ల తర్వాత జీవిత ఖైదు విధించిన కోర్టు

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సజీవ దహనమైన తల్లి మరణానికి న్యాయం కోరుతూ తమ రక్తంతో లేఖ రాసిన భారతీయ టీనేజీ బాలికలకు ఆరేళ్ల తర్వాత న్యాయం దక్కింది. చివరకు హంతకుడికి శిక్ష పడింది.

ప్రత్యక్ష సాక్షులైన 21 ఏళ్ల లతికా బన్సల్, ఆమె చెల్లి చెప్పిన సాక్ష్యాల ఆధారంగా కోర్టు, వారి తండ్రికి జీవిత ఖైదు విధించింది.

మగపిల్లాడికి జన్మినివ్వలేదన్న కారణంతో తమ తండ్రి తరచుగా తమ తల్లిని కొడుతుండేవాడని వారు కోర్టుకు వివరించారు.

ఈ ఆరోపణలను బన్సల్ ఖండించారు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ కోర్టు బుధవారం వెలువరించిన తీర్పులో బన్సల్‌ను దోషిగా నిర్ధారించింది. మగపిల్లాడికి జన్మనివ్వలేదనే కారణంతోనే ఆయన, తన భార్యను చంపివేశాడని పేర్కొంది.

కుటుంబ వారసత్వాన్ని కుమారుడు ముందుకు తీసుకెళతాడనే నమ్మకం, భారతీయ సంస్కృతిలో నాటుకుపోయింది.

భారత్‌లో బాలికల పట్ల వివక్ష, నిర్లక్ష్యానికి ఈ నమ్మకమే కారణమని ప్రచారకర్తలు అంటున్నారు.

ఆడపిల్లలకు జన్మనివ్వడంతో తమ తల్లి అను బన్సల్‌ను తమ తండ్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తిట్టడం, వేధించడాన్ని చూస్తూ తాము ఎలా పెరిగామో ఆ అమ్మాయిలు ఇద్దరూ విచారణ సందర్భంగా కోర్టులో చెప్పారు.

అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా గర్భంలో ఉన్న పిండం, ఆడపిల్ల అని తెలియడంతో అను బన్సల్ బలవంతంగా ఆరుసార్లు అబార్షన్ చేయించుకోవల్సి వచ్చినట్లు కూడా కోర్టు దృష్టికి వచ్చింది.

2016 జూన్ 14వ తేదీ ఉదయంతో తమ జీవితాలు మారిపోయాయని వారిద్దరూ కోర్టులో చెప్పారు. ఆరోజు ఉదయం తమ తండ్రి, తమ తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పారు.

''ఉదయం 6:30 గంటలకు మా అమ్మ ఏడుపు వినిపించడంతో మేం మేల్కొన్నాం. మా గది తలుపు బయట వైపుకు గడియ పెట్టడంతో ఆమెకు సహాయం చేయలేకపోయాం. ఆమె కాలిపోవడాన్ని మేం చూశాం'' అని కోర్టులో ఆ అమ్మాయిలిద్దరూ సాక్ష్యం చెప్పారు.

స్థానిక పోలీసులకు, అంబులెన్స్ సర్వీసులకు ఫోన్ చేయగా తమను పట్టించుకోలేదని లతిక చెప్పారు. ఆ తర్వాత తమ అమ్మమ్మ, మామయ్యలకు ఫోన్ చేయగా వెంటనే వారు అక్కడికి వచ్చి తమ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు.

ఆమెకు చికిత్స అందించిన వైద్యులు చెప్పినదాని ప్రకారం, అను బన్సల్ 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రిలోనే మరణించారు.

ఈ ఘటన జరిగినప్పుడు 15 ఏళ్లు, 11 ఏళ్ల వయస్సున్న అను బన్సల్ కూతుర్లు ఇద్దరూ తమ రక్తంతో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు లేఖ రాయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు తమ తల్లి హత్య కేసును, ఆత్మహత్యగా మార్చేశారంటూ వారిద్దరూ ఆ లేఖలో ఆరోపించారు.

ఈ కేసును సరిగ్గా విచారించని పోలీసు అధికారిని సస్పెండ్ చేసిన అఖిలేశ్ యాదవ్, ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ పోలీస్ అధికారులకు అప్పగించారు.

''మాకు న్యాయం దక్కడానికి 6 సంవత్సరాల ఒక నెల మీద 13 రోజులు పట్టింది'' అని అమ్మాయిల తరపున వాదించిన లాయర్ సంజయ్ శర్మ, బీబీసీతో అన్నారు.

''ఇలా కూతుర్లు, తండ్రికి వ్యతిరేకంగా కేసు వేయడం, న్యాయాన్ని పొందడం చాలా అరుదుగా జరుగుతుంది. గత ఆరేళ్లలో ఈ అమ్మాయిలిద్దరూ 100 సార్లకు పైగా కోర్టు విచారణలకు హాజరయ్యారు. కోర్టు విచారణకు ఒక్కసారి కూడా దూరం కాలేదు'' అని ఆయన చెప్పారు.

''ఇది కేవలం ఒక మహిళను హత్య చేసినట్లు కాదు. సొసైటీకి వ్యతిరేకంగా జరిగిన నేరం ఇది. గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించడం మహిళల చేతుల్లో లేదు. అలాంటప్పుడు మహిళలను ఎందుకు శిక్షించాలి? ఎందుకు చిత్రవధ చేయాలి? ఇది చాలా దుర్మార్గం'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)