విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"భార్యాబిడ్డలకు మెయింటెనెన్సు ఇవ్వడాన్ని తిరస్కరించడం మానవతా కోణంలో కూడా దారుణమైన నేరం. భార్యా బిడ్డలు జీవితాన్ని హుందాగా గడిపేలా చూడాల్సిన బాధ్యత నుంచి భర్త పక్కకు తప్పుకునేందుకు లేదు" అని దిల్లీ హై కోర్టు ఇటీవల చెప్పింది.

"భార్య తన మాట విననందుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సంపాదనను తగ్గించి చూపించి బాధపెట్టాలని చూడటం అహంకార ధోరణిని తెలియచేస్తుంది. భార్యా భర్తల మధ్య సంబంధాలు ఏ కారణంతోనైనా తెగిపోవచ్చు. ఒక్కొక్కసారి కేవలం ఇగో వల్ల కూడా ఇద్దరూ విడిపోవచ్చు. భాగస్వాముల్లో ఎవరైనా కోర్టులో పిటిషన్ వేసినప్పుడు అవతలి వారి వైఖరి మారాల్సిన అవసరముంది".

"మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులు ఆదేశించిన తర్వాత కూడా మొత్తం ప్రక్రియను జాప్యం చేసే ఉద్దేశ్యంతో భాగస్వామి తిరిగి దరఖాస్తు (ఎగ్జిక్యూషన్ పిటిషన్) నమోదు చేసే పరిస్థితులను కల్పించడం "విచారకరమైన వాస్తవం".

ఫ్యామిలీ కోర్టు ఆదేశించిన మెయింటెనెన్స్ ఆదేశాలను సవాలు చేస్తూ దిల్లీ హై కోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ ఆశా మీనన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మెయింటెనెన్స్ అంటే ఏమిటి?

ఈ కేసులో ఏమి జరిగిందని చూసే ముందు, మెయింటెనెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

భార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య లేదా భాగస్వామి జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది.

మెయింటెనెన్స్‌కు సంబంధించిన చట్టాలు, మెయింటెనెన్స్ లభించనప్పుడు బాధితులకు అందుబాటులో ఉండే మార్గాల గురించి హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల బీబీసీకి వివరించారు.

మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పే చట్టాలేంటి?

  • కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడర్ 1973 ( సెక్షన్ 125-128),
  • ఫ్యామిలీ కోర్స్ యాక్ట్ 1984,
  • హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956
  • హిందూ వివాహ చట్టం 1955

ఆదాయం లేని భార్యకు తిండి, దుస్తులు, వసతి, విద్య, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చులను భాగస్వామి ఇవ్వాలని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 3 (బి) చెబుతోంది.

వివాహం కాని కూతురు ఉన్నప్పుడు ఆమె వివాహం అయ్యేవరకు అవసరమైన ఖర్చులను ఇవ్వాలి.

భర్త మరణిస్తే ఆమె మామగారు (భర్త తండ్రి) మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇదే చట్టంలోని సెక్షన్-19 చెబుతోంది.

దిల్లీ హైకోర్టు కేసులో ఏమి జరిగింది?

భార్యాభర్తలకు సంబందించిన ఒక కేసులో రూ.20,000 మధ్యంతర భృతి (ఇంటెరిమ్ మెయింటెనెన్స్) ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు భర్తను ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను సవాలు చేస్తూ భర్త దిల్లీ హై కోర్టులో పిటిషన్ వేశారు.

తన ఆదాయం రూ.28,000 కాగా, సొంత ఖర్చులు రూ.25,000 పోను రూ.4000 మాత్రమే భార్యకు ఇవ్వగలనని ఆ పిటిషన్‌లో చెప్పారు. దీంతో పాటు భార్యా బిడ్డలకు వసతి కల్పిస్తానని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దిల్లీ హై కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు పూర్తయ్యే వరకు ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ. 20,000 ఇంటెరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వాలని చెబుతూ జూలై 18న ఆదేశాలు జారీ చేసింది.

"పిటిషనర్ సొంత ఖర్చులకు రూ.25,000 ఖర్చు పెట్టుకుంటూ, భార్యా బిడ్డల ఖర్చులకు మాత్రం రూ.4000 ఇస్తాననడం సిగ్గుచేటు" అని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో దిల్లీ హై కోర్టు మెయింటెనెన్స్ ఇమ్మని ఆదేశించింది. కానీ, కొన్నిసార్లు కోర్టు ఆదేశించిన తర్వాత కూడా మెయింటెనెన్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన రజియా (పేరు మార్చాం) బీబీసీతో మాట్లాడారు.

తండ్రి లైంగిక వేధింపులు

2020లో రజియా తల్లి చనిపోయారు. ఆమెకొక చెల్లి, తమ్ముడు ఉన్నారు. వారిద్దరూ కూడా మైనర్లు. తండ్రి సైన్యంలో పని చేస్తున్నారు.

తల్లి మరణం తర్వాత తండ్రి పిల్లలను వదిలిపెట్టి మరొక వివాహం చేసుకున్నారు.

పిల్లల బాధ్యతను తండ్రి పూర్తిగా విస్మరించడంతో సైనిక విభాగంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లల చదువు, వివాహం ఇతర బాధ్యతలు స్వీకరిస్తానని అధికారుల సమక్షంలో ఆయన అంగీకరించారు.

కానీ, ఆయన బాధ్యతను పక్కనబెట్టి రెండవ భార్యతో కలిసి తమను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టినట్లు రజియా చెప్పారు.

దీంతో వారు తమకు తెలిసిన వ్యక్తి ద్వారా స్థానిక స్వచ్చంద సంస్థకు సమాచారం అందించారు. వారీ సమాచారాన్ని తెలంగాణ బాలల సంక్షేమ సంఘానికి తెలిపారు. వారు జోక్యం చేసుకుని పిల్లలను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకుని వచ్చి 7 నెలల పాటు సంరక్షణ గృహంలోనే ఉంచారు.

తల్లి తండ్రుల పై పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ - 2012) కింద కేసు నమోదు చేశారు. సవతి తల్లిని, తండ్రిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు బెయిల్ పై విడుదల అయ్యారు.

ఇంతలో తండ్రి ఉద్యోగానికి కూడా స్వచ్చంద పదవీ విరమణ చేశారు.

సెప్టెంబరు 2021లో రజియా ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు నమోదు చేశారు. అయితే, తనకు ఉద్యోగం లేదంటూ పిల్లల బాధ్యత చూసేందుకు తండ్రి అంగీకరించటం లేదు.

కోర్టులు మెయింటెనెన్స్‌ను ఎలా నిర్ణయిస్తాయి?

భర్త/భాగస్వామి ఆదాయంలో 25% తో పాటు భాగస్వామి జీవన శైలిని పరిగణనలోకి తీసుకుని కోర్టులు మెయింటెనెన్స్‌ను నిర్ణయిస్తాయి.

టెంపరరీ మెయింటెనెన్స్ అంటే ఏంటి?

కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో భార్యకు తాత్కాలిక మెయింటెనెన్స్ ఇమ్మని కోర్టు చెబుతుంది. హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 24 ప్రకారం భాగస్వాముల్లో ఎవరికైనా జీవితాన్ని గడిపేందుకు ఆదాయం లేని పక్షంలో వారికి కోర్టు మెయింటెనెన్స్ మంజూరు చేస్తుంది.

మెయింటెనెన్స్ ఎప్పుడు లభించదు?

  • భార్యకు వివాహేతర సంబంధాలున్నప్పుడు
  • కారణాలేవీ లేకుండా భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించనప్పుడు
  • పరస్పర అంగీకారంతో భార్యా భర్తలిద్దరూ వేర్వేరుగా బ్రతుకుతున్నప్పుడు

భర్త కూడా భార్య నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చా?

భార్యకు భర్త కంటే అధిక సంపాదన ఉన్నప్పుడు, భర్తకు తగినంత ఆదాయం లేనప్పుడు మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుందని హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 చెబుతోంది.

కోర్టు ఆదేశించిన తర్వాత కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఏమి చేయాలి?

సాధారణంగా కోర్టులు మెయింటెనెన్స్ ఇమ్మని ఆదేశించిన తర్వాత ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. లేదా కోర్టుకు అతని ఆదాయాన్ని అటాచ్ చేసే అధికారముంటుంది.

రజియా విషయంలో ఎదురైన సమస్య ఏంటి?

రజియా తండ్రి ప్రస్తుతం పెన్షనర్. పెన్షన్, గ్రాట్యుటీని అటాచ్ చేసే అధికారం కోర్టుకు ఉండదు. దీంతో, రజియా తండ్రి డబ్బు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు.

ఈ కేసుకు పరిష్కారమెలా?

కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా స్పందించని పక్షంలో కోర్టు వారంట్ ఇస్తుంది. మెయింటెనెన్స్ ఇచ్చే వరకూ ఆయనకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

విశాఖపట్నంకు చెందిన రాగిణి (పేరు మార్చాం) పరిస్థితి వేరు. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణం అందింది. కానీ ఆమె కూతురు మెయింటెనెన్స్ కు విడాకుల ఒప్పందంలో ప్రస్తావన లేదు. ఆమె ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో, ఆ బిడ్డ మెయింటెనెన్స్ ఇచ్చేందుకు తండ్రి అంగీకరించటం లేదు. విడాకుల సమయంలో ఇచ్చిన భరణంతోనే బిడ్డ మెయింటెనెన్స్ చూడాలని చెబుతూ పిల్లల బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నారు.

భరణం తీసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ పొందవచ్చా?

ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది. ఇది కేసు పూర్వాపరాల పై ఆధారపడి ఉంటుంది. ఆమె సంపాదన, విడాకుల సమయంలో భరణం ఇచ్చిన విధానం లాంటివన్నీ పాత్ర పోషిస్తాయి. అయితే, ఆమె తిరిగి వివాహం చేసుకుంటే మెయింటెనెన్స్ లభించదు.

విడాకుల సమయంలో భరణం తీసుకున్న తర్వాత పిల్లల మెయింటెనెన్స్ అడగవచ్చా?

భరణానికి, పిల్లల మెయింటెనెన్స్‌కు సంబంధం లేదు. అమ్మాయి వివాహం అయ్యే వరకూ తండ్రి బాధ్యత వహించాలి. భార్యా భర్తల మధ్య విడాకులకు, పిల్లల మెయింటెనెన్స్‌కు సంబంధం లేదు. ఈ మేరకు పిల్లలు తిరిగి కోర్టులో కేసు నమోదు చేయవచ్చు.

మెయింటెనెన్స్ అన్ని మతాల వారికి ఒకే విధంగా ఉంటుందా?

మెయింటెనెన్స్‌కు సంబంధించిన చట్టాలు వివిధ మతాలకు వేర్వేరుగా ఉన్నాయి. కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్ని మతాల వారికి వర్తిస్తుంది.

షా బానో కేసు ఇందుకోక ఉదాహరణగా నిలుస్తుంది. ముస్లిం మహిళల హక్కులను పొందే విషయంలో ఈ కేసు న్యాయ చరిత్రలోనే ఒక మైలు రాయిలా నిలిచింది.

తనకు, పిల్లలకు మెయింటెనెన్స్ కావాలంటూ షా బానో 1978లో భర్త పై కేసు నమోదు చేశారు. ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదన్న ఆమె భర్త వాదనలను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

భారతదేశంలో పౌరులందరికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 వర్తిస్తుందని సుప్రీం కోర్టు 1985లో తీర్పు చెబుతూ ఆమెకు మెయింటెనెన్సు ఇవ్వాలని ఆదేశించింది.

"న్యాయ ప్రక్రియలో వైరాన్ని తీసుకురావడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. కుటుంబ సమస్యలను ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిష్కరించడమే ఫ్యామిలీ కోర్టులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, మీడియేషన్ ప్రక్రియ ఉద్దేశ్యం. న్యాయ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్న విధానాల ద్వారా సత్వర పరిష్కారం లభించేటట్లు చూడాలి. జీవితాలు నాశనం కాకుండా చూడటంలో న్యాయ సిబ్బంది పాత్ర వెలకట్టలేని పాత్రను పోషిస్తుంది" అని జస్టిస్ ఆశా మీనన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)