ఆస్ట్రేలియా చెఫ్‌ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?

    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’’ పోటీ 14వ సీజన్ చివరి ఎపిసోడ్లతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అందరిదృష్టీ భారతీయ వంటకాలపైపు మళ్లింది.

పోటీలో రన్నరప్‌గా నిలిచిన సారా టోడ్ అద్భుతమైన భారతీయ వంటకాలతో జడ్జిలను మెప్పించారు. గోవాలో ప్రఖ్యాతిగాంచిన, ఘాటైన ‘‘పోర్క్ విండలూ’’ను ఆమె ఫైనల్‌లో వండారు.

‘‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’’కు భారత్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. దీనిలో భారత చెఫ్‌లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన వంటల నిపుణులు పాలుపంచుకుంటారు. ఇదే తరహాలో భారత్‌లోనూ ఒక సీజన్‌ను మొదలుపెట్టారు. అయితే, దీని కంటే మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాకే ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది.

ఈ వంటల పోటీలో ఏళ్లుగా కంటెస్టెంట్లు బిరియానీ లాంటి భారతీయ రుచులతో జడ్జిలను మెప్పిస్తున్నారు. కొన్నిసార్లు సంప్రదాయ వంటకాలకు మోడర్న్ ట్విస్టులుచేసి ప్రజల ముందుకు తెస్తున్నారు.

2013లో నిర్వహించిన సీజన్ 5లో రిషి దేశాయ్‌ నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్లో ఆయన వండిన ‘‘పాలక్ పనీర్’’పై చాలా చర్చ జరిగింది. పాలకూరకు పన్నీర్‌ను కలిపి దీన్ని వండుతారు.

ఇలా ప్రతి సీజన్‌లోనూ కొందరు కంటెస్టెంట్లు నోరూరించే భారతీయ వంటకాలతో జడ్జిలను మెప్పిస్తున్నారు.

పరిచయం అక్కర్లేదు

భారతీయ వంటకాలను ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే, ఈ షోలో పాల్గొనే భారతీయ కంటెస్టులు కొత్తకొత్త రుచులు, ఫ్లేవర్లతో ముందుకు వస్తున్నారు.

‘‘భారతీయ వంటకాలను పశ్చిమ దేశాల ప్రజలకు చేరువచేయడంలో మాస్టర్‌ చెఫ్ ఆస్ట్రేలియా ముందుంటుంది. బట్టర్ చికెన్-నాన్ నుంచి మరిన్ని ప్రాంతీయ వంటకాలు, ఫ్లేవర్లపై ఈ పోటీ ఇష్టం పెరిగేలా చేస్తోంది’’అని అని సీజన్ 11లో పాల్గొన్న సందీప్ పండిట్ చెప్పారు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, కొత్తకొత్త వంటకాలు అవే వస్తుంటాయని సందీప్ అన్నారు. అలానే ఆయన ‘‘లాబ్‌స్టర్ మసాలా’’ వండారు.

‘‘ఒక్కో రౌండ్‌కు ఒక్కో వంటకం వండుకుంటూ వెళ్లినా.. నాకు తెలిసిన అన్ని వంటకాలు వండేందుకు సమయం దొరక్కపోవచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రత్యేకత ఏమిటి?

కొత్త వంటకాలను పరిచయం చేయడంతోపాటు వంటలను కొత్తగా ప్రెజెంట్ చేయడంలోనూ మాస్టర్‌ చెఫ్‌ కంటెస్టెంట్లు ఉత్సాహం చూపిస్తుంటారు.

అయితే, ‘‘ఫైన్ డైనింగ్‌’’లో ఇటాలియన్, ఫ్రెంచ్ లాంటి ఇతర ప్రఖ్యాత వంటకాలతో భారతీయ వంటకాలు పోటీ పడగలవా? లేదా వీటిని ‘‘దేశీ’’ వంటకాలుగానే చూడాలా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంటుంది.

‘‘ఇక్కడ ఫైన్ డైనింగ్ అంటే తక్కువ మొత్తంలో అందంగా అలంకరిస్తూ వడ్డించడమేనా? లేదా ప్రధానంగా ఒక ఫ్లేవర్‌తో ఉంటూ దానికి అనుబంధంగా కలిపేవన్నీ అదే ఫ్లేవర్‌తో ఉండేలా చూసుకోవడమా? లేదా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత కిచెన్‌లు, రాచ కుటుంబాల్లో వండి వడ్డించేవా? ఈ ప్రశ్నలకు మీరు అవునని సమాధానం ఇస్తే.. కచ్చితంగా భారత వంటకాలు పోటీ పడగలవు’’అని సందీప్ పండిట్ వ్యాఖ్యానించారు.

మొదటసారి భారతీయ వంటకాన్ని షోలో వండినప్పుడు చాలా ఆందోళన పడ్డానని దీపిందర్ ఛిబ్బర్ చెప్పారు. ఆమె సీజన్ 13లో పాల్గొన్నారు.

‘‘ఎందుకంటే చాలా మంది భారతీయులు మన వంటకాలను చాలా చిన్న చూపు చూస్తారు. నిజానికి మన వంటకాలు చాలా గొప్పవి. వీటితో ఏ ఇతర వంటకాలకూ పోలిక ఉండదు’’అని ఆమె చెప్పారు. స్మోక్డ్ లస్సీ, కఢాయ్ పనీర్ లాంటి వంటకాలతో ఆమె జడ్జిలను మెప్పించారు.

‘‘నేను చేసిన భారతీయ వంటకాలు జడ్జిలకు చాలా నచ్చాయి’’అని ఆమె చెప్పారు.

‘‘మన వంటకాలకు మనమే హద్దులు పెడుతున్నాం. మన ఫ్లేవర్లతో మనం ఇంకా చాలా కొత్తకొత్త వంటకాలు చేయొచ్చు’’అని ఆమె అన్నారు.

భారతీయ వంటకాలను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, ఒకప్పుడు మన వంటకాలన్నింటినీ కలిపి ‘‘కూర (కర్రీ)’’గా పిలిచేవారు. పైగా అది కూడా చాలా ఘాటుగా, గుప్పుమనే వాసనతో ఉండేదని చెప్పేవారు. కానీ, భారతీయ వంటకాలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరిగింది.

మరోవైపు ఫైన్ డైనింగ్‌కు సరిపోయేలా మన సంప్రదాయ, ప్రాచీన వంటకాలను భారతీయ చెఫ్‌లు కొత్తగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. దీంతో ఇతర వంటకాలతోపాటు భారతీయ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు చాలా వచ్చాయి.

‘‘అది తప్పు..’’

ఫైన్ డైనింగ్‌లో ఇతర వంటకాలతో భారతీయ రుచులు పోటీ పడలేవనేది అపోహ మాత్రమేనని గగన్ ఆనంద్ చెప్పారు. భారత్‌లోని ప్రముఖ చెఫ్‌లలో ఆయన కూడా ఒకరు.

‘‘అసలు ఇలాంటి ప్రశ్నే అడగకూడదు. చాలా రెస్టారెంట్లు ఇది తప్పని రుజువు చేశాయి. ఇప్పుడు భారతీయ వంటకాలతో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి’’అని ఆనంద్ వ్యాఖ్యానించారు.

కలకత్తాలో భారత సంస్కృతీ, సంప్రదాయాల మధ్య పెరిగిన ఆయన బ్యాంకాక్‌లో ఒక రెస్టారెంట్ తెరిచారు. ఇక్కడ సంప్రదాయ భారతీయ వంటకాలు మనకు కనిపిస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఆనంద్ రెస్టారెంట్‌కు వస్తుంటారు. 2019లో ప్రపంచంలోనే 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో ఈ రెస్టారెంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇక్కడ ‘‘యోగర్ట్ ఎక్స్‌ప్లోషన్’’ వంటకం ప్రసిద్ధి చెందింది.

అయితే, భారతీయ వంటకాలకు తనలాంటి కొద్ది మంది మాత్రమే న్యాయం చేయలేరని, అందరూ కలిసి కట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆనంద్ అంటున్నారు.

ప్రముఖ భారతీయ రెస్టారెంట్లతోపాటు ఉన్నత పదవుల్లో ఉండే వంట నిపుణుల్లో సృజనాత్మకత లేమి వల్లే మన వంటకాల విషయంలో కొందరు చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు.

‘‘కొంతమంది చెఫ్‌లకు సృజనాత్మకత ఉంటుంది. అయితే, మన పెట్టుబడిదారీ వ్యవస్థలో వారు ముందుకు రావడం చాలా కష్టం’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా మారాలని ఆయన చెప్పారు.

‘‘ఇక్కడ భారతీయ వంటకాలకు యూరోపియన్ బట్టలు వేయమని నేను చెప్పట్లేదు. మన వంటకాలనే మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలి’’అని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

‘‘భారతీయులు వంటల విషయంలో ఎప్పుడో తమ హద్దులను దాటి ముందుకు వెళ్లారు. మిరపకాయలు, టొమాటోలు, చీజ్, చాకోలేట్, టీ లాంటివి ఎప్పుడో మనతో కలిపేసుకున్నాం. ఇంకా కొత్తకొత్త దినుసులను మన వంటల్లో చేరుస్తున్నాం. రెస్టారెంట్ల చెఫ్‌లు కూడా అలా సృజనాత్మకంగా ఆలోచించాలి’’అని ఆయన అన్నారు.

మరోవైపు ఏ దేశపు వంటకాన్ని అయినా భారతీయులు తమదిగా సొంతం చేసుకుంటారు. ఇండియన్-చైనీస్ వంటకాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రోడ్డు పక్కన కనిపించే స్టాళ్ల నుంచి పెద్దపెద్ద రెస్టారెంట్ల వరకు ఈ రకం వంటలు మనకు కనిపిస్తుంటాయి.

‘‘ప్రస్తుతం వేరే ప్రాంతంలో చేసే వంటకాలను మనకు తగినట్లుగా మార్చి వండటం అద్భుతంగా అనిపిస్తుంది’’అని ఛిబ్బర్ వ్యాఖ్యానించారు.

అయితే, భారతీయ వంటకాలతో కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఎదురైందని ఛిబ్బర్ చెప్పారు. ముఖ్యంగా మాస్టర్ చెఫ్ లాంటి పోటీల్లో మరీ కష్టంగా ఉంటుందని అన్నారు.

‘‘కొన్నిసార్లు నేను భారతీయ వంటకాలను వండలేకపోయేదాన్ని. ఒక ఇటలీ బృందం.. పాస్తాతోపాటు తినేందుకు ఒక డిసెర్ట్ వండాలని సూచించింది. అప్పుడు కొంచెం కష్టమైంది’’అని ఆమె అన్నారు.

కొన్నిసార్లు తనకు కూడా ఇబ్బందిగా అనిపించిందని సీజన్ 13 విజేత జస్టిన్ నారాయణ్ చెప్పారు.

విదేశీయులు కూడా..

‘‘భారతీయ వంటకాలు నా జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితాల్లో భాగమైపోయాయి. మాస్టర్ చెఫ్ పోటీలోనూ వీటిని వండేందుకు నాకు అవకాశం వచ్చింది’’అని ఫిజియన్-ఇండియన్ అయిన జస్టిన్ చెప్పారు.

‘‘చాలా మంది భారతీయ వంటకాలను రుచి చూడాలని అనుకుంటున్నారు’’అని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ప్రఖ్యాత వంటకాలతో భారతీయ రుచులు పోటీపడేందుకు మాస్టర్ చెఫ్ ఒక మంచి అవకాశం లాంటిదని ఆయన అన్నారు.

మరోవైపు ఒక షో వల్ల పరిస్థితి పూర్తిగా మారుతుందని ఆశించకూడదని ఆనంద్ అన్నారు. ‘‘చెఫ్ జాకెట్ వేసుకునేందుకు విజేతలు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘మన దేశంలో అందరూ డాక్టర్, ఇంజినీర్ కావాలని అనుకుంటున్నారు. ఈ విధానం మారాలి. సృజనాత్మకతతో కొత్తగా ఆలోచించాలి. అప్పుడే పరిస్థితి మారుతుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కొత్తకొత్త వంటలు పుట్టుకొస్తాయి’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)