You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Jasprit Bumrah: టెస్టుల్లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు, యువరాజ్ సింగ్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ ట్వీట్లు
భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌కు క్రికెట్ అభిమాని కార్తీక్ చౌదరీ ఫిదా అయ్యారు.
ఆయన ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ 'ఈ రెండు చిత్రాల మధ్య మనమంతా పెరిగి పెద్దవారమయ్యాం' అంటూ వ్యాఖ్య జోడించారు.
అంతేకాకుండా, యువీ, బుమ్రా అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు.
శనివారం బర్మింగ్‌హామ్ టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బుమ్రా ఆట చూసిన అభిమానులకు, 2007 నాటి టి20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌ల ప్రదర్శన గుర్తొచ్చి ఉంటుంది.
యువరాజ్ సింగ్‌కు సమానం
బుమ్రా దాదాపుగా యువరాజ్ సింగ్ రికార్డును అందుకున్నాడు. స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తగా పేరు తెచ్చుకున్న బుమ్రా, శనివారం బ్యాట్‌తో అద్భుతం చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా సాధించలేని ఘనతను బుమ్రా సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు సృష్టించాడు. భారత తొలి ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బ్రాడ్ బౌలింగ్ చేయగా భారత్ 35 పరుగులు సాధించింది.
ఈ ఓవర్‌లో బుమ్రా చెలరేగిపోయాడు. వరుసగా 4, 5 (వైడ్ ప్లస్ ఫోర్), 7 (నోబాల్ ప్లస్ సిక్స్), 4,4,4,6,1 కొట్టడంతో 35 పరుగులు వచ్చాయి.
గతంలో ఈ రికార్డు బ్రయాన్ లారా, జార్జ్ బైలీ పేరు మీద ఉంది. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో అత్యధికంగా 28 పరుగులు చేశారు.
బుమ్రా ఈ రికార్డు నమోదు చేసినప్పుడు మరో ఎండ్‌లో మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. బుమ్రా అద్భుత బ్యాటింగ్ చూసి సిరాజ్ ఆశ్చర్యపోయాడు. సిరాజ్ సంబరంగా నవ్వడం కూడా అభిమానులకు తెగ నచ్చింది.
సూరజ్ కుమార్ అనే ట్విటర్ ఖాతాదారుడు సిరాజ్ నవ్వుతోన్న ఫొటోను పంచుకుంటూ 'నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను' అంటూ వ్యాఖ్యానించారు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందిస్తోన్న ఫొటోను జర్నలిస్ట్ వివేక్ సింగ్ ట్వీట్ చేశారు.
కానీ చాలామంది అభిమానులు దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి యువరాజ్ సింగ్ ఆటను గుర్తు చేసుకున్నారు.
తొలి టి20 ప్రపంచకప్ సందర్భంగా 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.
ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే యువరాజ్ 58 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.
శనివారం నాటి ఇన్నింగ్స్‌లో బుమ్రా 16 బంతుల్లో అజేయంగా 31 పరుగులు చేశాడు. దీంతో భారత స్కోరు 400 పరుగులు దాటింది.
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అయిదో టెస్టులో భారత్ ఒకానొక దశలో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) సెంచరీలతో భారత్‌ను ఆదుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది రాజకీయ వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?
- హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం చేస్తారు?
- హీరో విశాల్: 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావట్లేదు.. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేయట్లేదు'
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)