Secunderabad Railway Stationలో అగ్నిపథ్ నిరసనలు: ‘రెండు వేల మంది వచ్చారు.. మూడు గంటలు విధ్వంసం సృష్టించారు’

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకారులతో పోలీసులు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. దీని తర్వాత రాళ్లు రువ్వడం, బోగీలకు నిప్పు పెట్టడం లాంటి ఘటనలు ఆగిపోయాయి.

సహాయక చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి. రైల్వే సిబ్బంది, స్టేషన్‌ను శుభ్రం చేసే పనుల్ని ముమ్మరం చేశారు. రైల్వే ట్రాక్‌లపై చెత్తను తీసివేయడం, ధ్వంసమైన సామగ్రిని తొలిగించారు.

రైళ్ల రాకపోకలు కూడా మొదలయ్యాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్ని పథ్ ఆందోళన శుక్రవారం అత్యంత ఉద్రిక్తతకు దారి తీసింది. ఏకంగా స్టేషన్లో పోలీసు కాల్పులకు దారి తీసింది.

ఈరోజు ఉదయం ఒక్కసారిగా వందలాది మంది యువత రైల్వే స్టేషన్లోకి చొచ్చుకు వచ్చారు.

ప్లాట్ ఫాంలపైకి వెళ్లి షాపులు ధ్వంసం చేశారు. వస్తువులను ట్రాకులపై వేశారు.

రైల్వే పార్సిళ్లకు చెందిన పార్సిల్ వస్తువులను తీసుకుని ట్రాక్ పై వేసి నిప్పు పెట్టారు. వివిధ రైళ్లకు చెందిన బోగీలు తగలబడ్డాయి.

చేతికందిన రాళ్లు, కర్రలు, స్టీల్ రాడ్లతో కనిపించిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు ఆందోళన కారులు.

దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల లాఠీచార్జి, కాల్పుల్లో ఎందరికి గాయాలు అయ్యాయి అనేది స్పష్టతలేదు.

గాలిలోకి పది రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని బీబీసీ ప్రతినిధి సురేఖ అబ్బూరి తెలిపారు. ఒకరు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను పోలీసులు ధృవీకరించలేదు.

ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు జరిగే అవకాశాలు లేవని బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ తెలిపారు.

ప్లాట్‌ఫారమ్ నంబర్లు 1, 2, 3లపై ధ్వంసం ఎక్కువగా జరిగింది.

ఎనిమిదిసార్లు పరీక్షలు వాయిదా వేశారని, రెండుసార్లు హాల్ టికెట్లు కూడా ఇచ్చారని.. ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావడం ఏంటని ఆందోళన కారులు ప్రశ్నించారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు తోడు తెలంగాణ పోలీసులు కూడా స్టేషన్‌కు చేరుకుని పరిస్థితులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికీ వందలాది మంది యువత స్టేషన్‌లోనే ఉన్నారు.

‘జస్టిస్ ఫర్ ఆర్మీ స్టూడెంట్స్’ అనే ప్లకార్డులు పట్టుకున్నారు.

ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారితో పాటు స్థానికులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా రైల్వే స్టేషన్‌లో ఉన్నారు.

‘రెగ్యులర్ పద్ధతిలోనే నియామకాలు జరపాలి’

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఇప్పటికీ వందలాది మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చామని చెబుతున్న కొందరు విద్యార్థులతో బీబీసీ ప్రతినిధి సురేఖ అబ్బూరి మాట్లాడారు.

తాము ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నామని, ఇందుకోసం ఉన్నత విద్యను కూడా వదులుకున్నామని వారు చెబుతున్నారు.

గత రెండేళ్లుగా ఆర్మీ నియామకం కోసం తాము ప్రిపేర్ అవుతున్నామని, ఇప్పుడు నిబంధనలన్నీ మార్చేసి, అగ్నిపథ్ పథకం తీసుకువస్తే తమకు నష్టం జరుగుతుందని చెప్పారు.

పరీక్ష కూడా నిర్వహించారని, మెడికల్ టెస్టు మాత్రమే మిగిలిందని కొందరు చెప్పారు.

మిగిలిపోయిన నియామక ప్రక్రియను కొనసాగించాలని, తమకు న్యాయం చేయాలని కొందరు తెలిపారు.

రాజకీయాలతో తమకు సంబంధం లేదని, తామంతా స్వచ్ఛందంగా ఈ ఆందోళన చేస్తున్నామని చెప్పారు.

‘మూడు గంటలు విధ్వంసకాండ’

కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు మూడు గంటల పాటు విధ్వంసకాండ జరిగింది.

మొదటి, రెండు, మూడవ ప్లాట్‌ఫారమ్స్‌పైన ఈ విధ్వంసం జరిగింది.

ఇక్కడ ఉన్న తినుబండారాలు, పుస్తకాల షాపులను ఆందోళన కారులు ధ్వంసం చేశారు.

ఆగిఉన్న తిరుపతి-సికింద్రాబాద్ రైలుకు నిప్పు పెట్టారు.

రైల్వే పార్సిళ్లకు పట్టాలపై వేసి తగలబెట్టారు.

ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. సుమారు పది రౌండ్లకు పైగా గాల్లోకి కాల్పులు జరిపారు.

పలువురు ఆందోళనకారులకు గాయాలు అయ్యాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఇప్పుడు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. స్టేషన్‌ లోపలికి ఎవ్వరినీ అనుమతించట్లేదు.

కాగా, సుమారు రెండువేల మంది ఆందోళనకారులు ఒక్కసారిగా స్టేషన్‌లోకి వచ్చారని ఆందోళనకారుల్లో కొందరు చెబుతున్నారు. ఇంతమంది ఒకేసారి వచ్చి, ఆందోళనకు దిగుతుంటే రైల్వే పోలీసులు, నిఘా విభాగం ఎలా విఫలం అయ్యింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

‘ఇంతమంది ఇక్కడికి ఎలా వచ్చారు?’

అగ్నిపథ్ పథకంను ఉపసంహరించుకోవాలి, సీఈ పరీక్షను తక్షణం నిర్వహించాలి అనే డిమాండ్లపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసన తెలపాలని తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉదయం 8.30 గంటలకు సుమారు 2 వేల మంది చేరుకున్నారు.

దశల వారీగా వీరు ఇక్కడికి చేరుకున్నారు. ఆందోళన మొదలైన తర్వాత ఇంకొందరు వచ్చారు.

ఆందోళనకారుల్లో కొందరు విధ్వంసానికి దిగారు. 11.30 గంటల వరకు ఈ విధ్వంసం కొనసాగింది.

ప్లాట్‌ఫామ్ నెంబర్ 1పై ఆగి ఉన్న సికింద్రాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌, ప్లాట్‌ఫామ్ నెంబర్ 2పై ఆగి ఉన్న హైదరాబాద్-షాలిమార్ హమ్‌సఫర్ రైళ్లకు నిప్పు పెట్టారు. ప్లాట్‌ఫామ్ నెంబర్ 5పై ఆగి ఉన్న తిరుపతి వెళ్లే రైలును ధ్వంసం చేశారు.

‘ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదు’

ఈ ఆందోళనల్లో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదని, వారందరూ ఖాళీ చేసిన తర్వాతే ఆందోళనకు దిగామని కొందరు ఆందోళనకారులు బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌కు చెప్పారు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కూడా వందలాది మంది యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు.

సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ట్రాక్‌లపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు.

సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్లే ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులను బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పుడు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి సికింద్రాబాద్‌కు రైళ్ల రాకపోకలన్నీ నిలిచిపోయాయి.

‘విధ్వంసానికీ మాకూ సంబంధం లేదు’ - ఎన్ఎస్‌యూఐ

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసానికీ తమకూ సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకానికి నిరసనగా సికింద్రాబాద్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ తొలుత నిర్ణయించింది.

కానీ, తాను రైల్వే స్టేషన్‌కు వెళ్లకముందే తనను పోలీసులు నిర్బంధించారని వెంకట్ ఒక వీడియోను విడుదల చేశారు.

ఆందోళన చేస్తున్న వారు ప్రయాణీకులు ఇబ్బందులకు గురి చేయకూడదని, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు చూడాలని ఆయన కోరారు.

‘ఈ హింసాత్మక ఆందోళనలు నిరుద్యోగానికి సంకేతం’ - కేటీఆర్

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలు దేశంలో నెలకొన్న నిరుద్యోగ సంక్షోభం తీవ్రతకు సంకేతమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఉదయం 9 గంటలకు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)