You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Agnipath Scheme - Indian Army: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
సైన్యంలో చేరడానికి కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. దాని పేరు అగ్నిపథ్. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు.
అగ్నిపథ్ పథకం అంటే?
రక్షణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.
జీతం ఎంత?
అగ్నిపథ్ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.
ఎవరు అర్హులు?
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.
సైన్యంలో ఉండగా చనిపోతే..
సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.
వైకల్యం సంభవిస్తే..
సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.
రక్షణమంత్రి ఏమన్నారు?
ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని రక్షణమంత్రి అన్నారు. సైన్యంలో చేరాలన్న చాలామంది యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)