రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ
హాని జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో
జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
ప్రపంచంలో బలమైన శక్తులుగా ఎదిగిన దేశాలు ఇంకా
వేరే ఉన్నాయన్న సంగతిని అమెరికా కావాలనే గుర్తించనట్లుగా నటిస్తోందని ఆయన
వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు ఇంకా గతించిన శతాబ్దంలో ఉన్నట్లే ఆలోచిస్తున్నాయి,
ఇతర దేశాలను ఇంకా తమ వలస పాలనలో ఉన్నట్లు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఎకనామిక్ పోరమ్‌లో పుతిన్ ప్రసంగం కొంత
ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశ స్థలంలోని సాంకేతిక వ్యవస్థలు సైబర్ దాడికి గురవడం
వల్లే ఈ జాప్యం చోటు చేసుకుంది. అతిథులకు గుర్తింపు, ప్రవేశ అనుమతి ఇచ్చే సాంకేతిక
వ్యవస్థ దాడికి గురి కావడంతో తీవ్రమైన సమస్యలు తలెత్తాయని, నిపుణులు ఈ సమస్యను
పరిష్కరించే పనిలో ఉన్నారని అంతకు ముందు రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్
మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఈ సదస్సులో పుతిన్ అమెరికా తదితర పశ్చిమ దేశాలను
తీవ్రంగా విమర్శించారు. యుక్రెయిన్ మీద దాడి చేసినందుకు రష్యాపై ఆంక్షలు విధించడం ‘ఆలోచన లేని
పిచ్చి పని’ ఆయన
అన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయాలనే ప్రయత్నాలలో పశ్చిమ దేశాలు దారుణంగా
విఫలమయ్యాయని పుతిన్ అన్నారు.
యూరోపియన్ యూనియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం బాగా
పెరిగిందని, అది అసమానతలకు దారి తీస్తోందని చెప్పిన పుతిన్, అందుకు కారణం ఆ దేశాలు
రష్యాపై ఆంక్షలు విధించడమేనన్నారు.
ఈ సందర్భంగా పుతిన్ పెట్టుబడిదారులకు స్వాగతం
పలికారు. ‘రష్యా మీకు సురక్షితమైన
సొంత ఇల్లు లాంటిది. రండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’ అని ఆయన వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.