You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KK: ప్రదర్శన తరువాత కుప్పకూలిన గాయకుడు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే(53) మంగళవారం అర్ధరాత్రి మరణించారు. కోల్‌కతాలో ఒక ప్రదర్శన కోసం వెళ్లిన ఆయన అకస్మాత్తుగా చనిపోయారు.
ప్రదర్శన పూర్తయిన తరువాత హోటల్‌కు చేరుకున్న ఆయన ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో వెంటనే దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే కేకే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఆయన మరణానికి కారణం గుండెపోటు కావొచ్చనే ప్రాథమిక అంచనాకు వైద్యులు వచ్చినట్లు వెస్ట్ బెంగాల్ మంత్రి అరుప్ బిశ్వాస్ తెలిపారు.
సంగీత ప్రపంచంలో కేకేగా సుపరిచితులైన కృష్ణ కుమార్ కున్నథ్... హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి అనేక భాషల్లో పాటలు పాడి ప్రజలను అలరించారు.
తెలుగులో పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, గోపీ చంద్, రవితేజ వంటి నటుల సినిమాల్లో పాడారు.
ఖుషి, బాలు, గుడుంబా శంకర్, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఘర్షణ, అతడు, సైనికుడు, డార్లింగ్, జయం, మనసంతా నువ్వే, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాల్లో పాడారు కేకే.
ఏ మేరా జహా...(ఖుషి), మై హార్ట్ ఈజ్ బీటింగ్...(జల్సా), అవును నిజం నువ్వంటే నాకిష్టం...(అతడు), గుర్తుకొస్తున్నాయి...(నా ఆటోగ్రాఫ్) వంటి హిట్ పాటలున్నాయి.
దిల్లీలో 1968, ఆగస్ట్ 23న జన్మించిన కేకే, 1994లో కెరియర్ ప్రారంభించారు.
1999లో విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా 'హమ్ దిల్ దే చుకే సనమ్'తో బాలీవుడ్‌లో ఆయన ప్రస్థానం మొదలైంది.
కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
గొంతులో ఆయన ఎన్నో భావాలను పలికించారని, తన గాన మాధుర్యంతో అన్ని తరాల వారిని అలరించారని మోదీ అన్నారు.
సినీ నటుడు చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘కేకే చనిపోయారని తెలిసి షాక్‌కు గురయ్యా. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. అద్భుతమైన గాయకుడు, మంచి వ్యక్తి కూడా. ఇంద్ర సినిమాలో నా కోసమని ‘దాయి దాయి దామ్మ...’ పాటను పాడారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుబూతి.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
జీవితంలోని ప్రతి మలుపులోనూ కేకే పాటలు భాగంగా ఉన్నాయంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అన్ని తరాలు వారు, అన్ని భాషల వారు ఆయనకు అభిమానులుగా ఉన్నారని... ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు.
కేకే మృతి బాధాకరమని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- ఎఫ్3 రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల వేసవి కాలక్షేపం... లాజిక్ లేని మ్యాజిక్
- ఆలం ఆరా: ఈ భారతీయ తొలి టాకీ సినిమా ఎప్పటికైనా దొరుకుతుందా?
- టైటానిక్: ‘దేవుడు కూడా ముంచేయలేడు’ అనుకున్న నౌక మునిగిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటంటే
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)