You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహేశ్ బాబు: బాలీవుడ్ తనను 'అఫర్డ్' చేయలేదని ఎందుకన్నారు?
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ తనను 'అఫర్డ్' చేయలేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇంతకీ మహేశ్ బాబు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు? ఆయన వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి? నిజంగానే బాలీవుడ్ ఆయన రేటును భరించలేదా?
వందల కోట్ల వ్యయంతో సినిమాలు నిర్మించే బాలీవుడ్‌పై మహేశ్ బాబు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
మహేశ్ బాబు ఏం అన్నారు?
అడవి శేష్ సినిమా ‘‘మేజర్’’ ఆడియో కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడారు. బాలీవుడ్ తనను భరించలేదని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని ఆయన అన్నారు.
‘‘నేను ప్యాన్ ఇండియా స్టార్‌ను అవ్వాలని అనుకోవడం లేదు. తెలుగు ఇండస్ట్రీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి కానీ, నాకు ఇక్కడే సంతోషంగా ఉంది’’అని అని ఆయన చెప్పారు.
దీంతో ‘‘మహేశ్ బాబు మరీ అంత ఖరీదైనవాడా?’’అనే శీర్షికలతో హిందీ మీడియాలో వార్తలు వచ్చాయి. మరికొందరు మహేశ్ బాబును సినిమాల్లోకి తీసుకొనేంత డబ్బు మన నిర్మాతల దగ్గర లేదా? అని కూడా విశ్లేషణలు చేశారు.
హిందీ బెల్టుకు ఆయనేమీ కొత్త కాదు
హిందీ బెల్టుకు మహేశ్ బాబేమీ కొత్త కాదు. ప్రముఖ కూల్‌డ్రింక్ బ్రాండ్‌కు మహేశ్ చేసిన యాడ్‌లు తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతుంటాయి.
ప్యాన్ ఇండియా స్థాయిలో పొగాకు ఉత్పత్తులకు కూడా మహేశ్ బాబు యాడ్‌లు చేశారు.
తెలుగులో మహేశ్ బాబు చేసే సినిమాలు హిందీలోనూ డబ్ అవుతూ ఉంటాయి. వీటికి అక్కడ కూడా మంచి మార్కులే పడుతుంటాయి.
ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు?
సాధారణంగా వివాదాలు సృష్టించేందుకు సినీనటులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ, అలాంటి వివాదాలకు మహేశ్ బాబు చాలా దూరంగా ఉంటారు. ఆయనను అందరూ ‘‘ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్’’గా పిలుస్తుంటారు.
కుటుంబ సభ్యుల ఫోటోలను సోషల్ మీడియాలో మహేశ్ బాబు అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటారు. వీటిలో ఆయన చాలా కూల్‌గా కనిపిస్తుంటారు.
2012లో ఫోర్బ్స్ 100 మంది సెలబ్రిటీల జాబితాలో మహేశ్ బాబు కూడా ఒకరు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిలో జిమ్, స్విమ్మింగ్ పూల్‌తోపాటు మినీ థియేటర్ కూడా ఉంటుంది.
జూబ్లీ హిల్స్‌లో రూ.30 కోట్ల విలువైన రెండు భారీ బంగ్లాలు మహేశ్ బాబు పేరిట ఉన్నాయి. బెంగళూరులోనూ ఆయనకు ఆస్తులు ఉన్నాయి.
డాట్‌కామ్ కంపెనీ సమాచారం ప్రకారం, మహేశ్ బాబు ఒక్కో సినిమాకు రూ.55 కోట్ల వరకు తీసుకుంటారు. ప్రాఫిట్స్‌లోనూ ఆయనకు కమీషన్ ఉంటుంది.
ప్రముఖ బ్రాండ్ల యాడ్‌ల ద్వారా ఆయనకు ఏడాదికి రూ.15 కోట్లకుపైనే అందుతుంది. షూటింగ్ స్పాట్‌కు ఆయన వెళ్లే లగ్జరీ బస్ విలువే రూ.7 కోట్ల వరకు ఉంటుంది.
తన 20ఏళ్ల కెరియర్‌లో మహేశ్ బాబు 40కిపైగా సినిమాల్లో నటించారు. ఆయనకంటూ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.
బాలీవుడ్ ప్రముఖులు ఏం అంటున్నారు?
బాలీవుడ్ సినీ ప్రముఖులు మహేశ్ బాబు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఫిల్మ్ ట్రేడ్ నిపుణుడు అతుల్ మోహన్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఆయన బహుశా సినిమా కోసం రూ.100 కోట్లు లేదా రూ.150 కోట్లు డిమాండ్ చేస్తూ ఉండొచ్చు. నేటి హీరోలను మనం రజనీకాంత్ లాంటి స్టార్‌లతో పోల్చలేం. రజనీ కాంత్ లాంటివారికి ప్రపంచం మొత్తంగా అభిమానులు ఉన్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి’’అని అతుల్ అన్నారు.
‘‘ఇప్పుడు అక్షయ్ కుమార్ లేదా హృతిక్ రోషన్‌లను తీసుకోండి. వీరు సినిమాకు రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. దక్షిణ భారతీయ స్టార్‌లకు అంత మొత్తంలో ఎవరు ఇస్తారు? మహేశ్ బాబు వ్యాఖ్యలు చాలా చైల్డిష్‌గా ఉన్నాయి. సుదీప్ కూడా ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు’’అని అతుల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఫిల్మ్ జర్నలిస్టు జ్యోతి వెంకటేశ్ కూడా మహేశ్ బాబు వ్యాఖ్యలను విమర్శించారు. ‘‘నాకు తెలిసినంతవరకు బాలీవుడ్ నుంచి ఎవరూ మహేశ్ బాబును సంప్రదించి ఉండరు. ఆయన కేవలం తెలుగు సినిమాలే చేస్తారు. తమిళ్‌లోనూ ఆయనకు మార్కెట్ లేదు’’అని వెంకటేశ్ వ్యాఖ్యానించారు.
తప్పుగా అర్థం చేసుకున్నారా?
అయితే, బాలీవుడ్‌ను తక్కువ చేయాలని లేదా వివాదం సృష్టించాలని మహేశ్ బాబు ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలుగు సినీ విమర్శకులు అంటున్నారు.
ఈ వివాదంపై ఒక సీనియర్ సినీ విమర్శకురాలు బీబీసీతో మాట్లాడారు.
‘‘బాలీవుడ్‌కు వెళ్లడం ఇష్టంలేదని మహేశ్ బాబు చెప్పడం ఇదేమీ కొత్త కాదు. ఆయన ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు’’అని ఆమె వివరించారు.
‘‘మహేశ్ లాంటి స్టార్‌హీరోల సినిమాలకు చాలా పంక్చువల్‌గా ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు షూటింగ్ మొదలవుతుంది. బాలీవుడ్ షూటింగ్స్‌లో ఆ కల్చర్ ఉండదు. ఇక్కడ మన వాళ్లు ఒక రోజులో చేసే పనికి అక్కడ రెండు రోజులు పడుతుంది. దీని వల్ల షూటింగ్ చేయాల్సిన రోజులు పెరిగిపోతాయి. ఉదాహరణకు సర్కారువారి పాట సినిమా తీసుకోండి. ఇది ఇక్కడ 80 రోజుల్లో పూర్తవుతోంది అనుకోండి. బాలీవుడ్‌లో దీనికి 160 రోజులు పడుతుంది. దీని వల్ల మహేశ్ బాబు ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుంది’’అని ఆమె చెప్పారు.
‘‘మహేశ్ బాబు ఒక్కో సినిమాకు రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు తీసుకుంటారు. షేర్లు వీటికి అదనం. ఒక సినిమా 80 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. అంటే రోజుకు అటూఇటూగా రూ.కోటి వస్తుంది. మధ్యమధ్యలో ఆయన వేరే సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటారు. యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటారు. ఇక్కడ హీరో కాల్‌షీట్ల బట్టే సినిమా షెడ్యూల్ ఉంటుంది. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. అక్కడి షెడ్యూల్.. హీరోలతోపాటు మిగతా నటులపైనా ఆధారపడి ఉంటుంది. ఖాన్‌ల సినిమాలు మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌కు వెళ్తే మహేశ్ బాబుకు పనిచేయాల్సిన రోజులు పెరుగుతాయి. ఫలితంగా రోజుకు రూ.కోటి లెక్క వేసుకున్నా చాలా ఎక్కువ అవుతుంది. పైగా ఆయనతోపాటు వచ్చే వారికి సదుపాయాలు, మెయింటెనెన్స్ అదనం. ఇవన్నీ హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు అదనపు ఖర్చు అవుతుంది’’అని ఆమె విశ్లేషించారు.
మరోవైపు మహేశ్ బాబు వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించారని సినీ విమర్శకులు అన్వర్ అన్నారు.
‘‘తనకు ఇక్కడే బావుందని, ఇక్కడి అభిమానులను సంతృప్తి పరచడమే కష్టం అవుతోందనే కోణంలో మహేశ్ బాబు ఆ వ్యాఖ్యలు చేశారు’’అని అన్వర్ వివరించారు.
‘‘బాలీవుడ్‌కు వెళ్లి కొత్తగా నిరూపించుకోవడం ఎందుకనే కోణంలో మహేశ్ బాబు వ్యాఖ్యలు చేశారు. మన సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లి ఆడితే గొప్ప కదా.. మనం ఎందుకు అక్కడికి వెళ్లి నటించడం అని మహేశ్ బాబు అన్నారు. ఇక్కడ బాలీవుడ్‌ను ఆయన తక్కువ చేసి మాట్లాడే విషయమే లేదు’’అని అన్వర్ అన్నారు.
‘‘మహేశ్ బాబు ఒక సినిమాకు రూ.60 కోట్ల వరకు తీసుకుంటారు. దీనిలో బాలీవుడ్ భరించకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఆయన వ్యాఖ్యలు చేసిన ఉద్దేశమే వేరు’’అని అన్వర్ చెప్పారు.
మరోవైపు సర్కారువారి పాట సినిమా ప్రమోషన్‌లో హైదరాబాద్‌లో మీడియాతో మంగళవారం మహేశ్ బాబు మాట్లాడారు.
‘‘బాలీవుడ్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. తెలుగు వాళ్లని మెప్పించడానికే చాలా కష్టపడాల్సి వస్తోంది. నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్లే ఆలోచన లేదు’’అని మహేశ్ బాబు వ్యాఖ్యానించారు.
(బీబీసీ హిందీ కోసం పరాగ్ ఛాపేకర్ అందించిన ఇన్‌పుట్స్‌తో కలిపి)
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లైన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య.. ఏం జరిగిందంటే..
- 'ముస్లింలలో బహుభార్యత్వం అరుదు, అదొక సమస్య కాదు'.. 'అలాగైతే, రద్దు చేయొచ్చుగా, ఏం నష్టం?'
- ఆంధ్రప్రదేశ్: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ఏ కేసులో అరెస్ట్ చేశారు? తెరవెనుక ఏం జరిగింది?
- యుక్రెయిన్-రష్యా యుద్ధంతో ఈ దేశం సంపద ఎందుకు పెరుగుతోంది?
- ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)