సినిమా టికెట్ల ధరలు పెంచుకోడానికి అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గిస్తే, తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుకోడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

టికెట్‌ ధరలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులపై భారీగా భారం పడబోతోంది.

టికెట్‌ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరుతూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్‌ ధరల ఖరారుకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.

సినీరంగ ప్రముఖులతో పలుదఫాలు చర్చలు జరిపిన అధికారుల కమిటీ చేసిన సిఫారసుల మేరకుప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందని పత్రిక రాసింది.

అయితే, టికెట్లపై జీఎస్టీ, నిర్వహణ చార్జీలు, ఆన్‌లైన్‌ చార్జీలకు సంబంధించిన వివరాలను వేర్వేరుగా ప్రింట్‌ చేయాలని సూచించింది.

నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌ పై రూ.5, నాన్‌-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించింది.

ఇవన్నీ కలిస్తే తడిసి మోపెడైన చందంగా.. ప్రేక్షకులపై భారీగా భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోందని ఆంధ్రజ్యోతి రాసింది.

ఉదాహరణకు.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయట్లేదు. టికెట్‌ ధర రూ.200గా ఉంటే, ఆన్‌లైన్‌లో దానికి అదనంగా కన్వీనియెన్స్‌ ఫీ కింద రూ.25.31 వసూలు చేస్తున్నారు.

కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వసూలు చేసే కన్వీనియెన్స్‌ రుసుము, నిర్వహణ చార్జీలు కలుస్తాయి.

దీంతో టికెట్‌ ధర భారీగా పెరిగిపోతుంది. నేరుగా థియేటర్లలో టికెట్‌ కొంటే కన్వీనియెన్స్‌ రుసుము తగ్గుతుందిగానీ.. జీఎస్టీ, నిర్వహణ చార్జీల భారం అలాగే ఉంటుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

మూడేళ్ల వయసులో మాయమైన బిడ్డ 14 ఏళ్ల కుర్రోడుగా దొరికాడు

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో మూడేళ్ల వయసులో అదృశ్యమైన బాలుడు మళ్లీ 14 ఏళ్లకు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కనిపించకుండా పోయిన కొడుకు చివరికి దొరకడంతో ఉద్వేగానికి లోనైన తల్లిదండ్రులు తమ బిడ్డను గుండెలకు హత్తుకున్నారు.

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డెమ్మ దంపతుల కుమారుడు ఆకాష్‌. మూడేళ్ల వయసులో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదృశ్యమయ్యాడు.

దీంతో తల్లిదండ్రులు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి గాలింపు చేపట్టారు.

మదనపల్లె మండలం రామాపురానికి చెందిన వెంకటరమణ, లలిత దంపతులు 14 ఏళ్లుగా ఓ బాలుడిని పెంచుకుంటున్నట్టు సీఐ నరసింహులుకు సమాచారం వచ్చింది.

వారిని విచారించగా 2008లో నీరుగట్టువారిపల్లెలో బాలుడు దొరికినట్టు ఒప్పుకున్నారు. దీంతో బాలుడిని ఆకాష్‌గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

వారొచ్చి తమ బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పట్టరాని సంతోషంతో బిడ్డను తమతో తీసుకెళ్లారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారని సాక్షి రాసింది.

ఎస్సై పరీక్ష కోసం విగ్గులో బ్లూటూత్ పెట్టుకొచ్చాడు

యూపీలో పోలీస్ ఎస్ఐ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డ ఒక యువకుడు అడ్డంగా బుక్కయ్యాడని వెలుగు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఉత్తర్ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది ఇతర అభ్యర్థుల్లాగే అతన్ని చెక్ చేశారు.

కానీ మెటల్ డిటెక్టర్ అతని తల వద్దకు రాగానే బీప్ మంటూ శబ్దం వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని అధికారులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తి తల పరిశీలించగా.. అతను విగ్ పెట్టుకున్నాడని అర్థమైంది. దాన్ని తొలగించి చూసిన అధికారులు అవాక్కయ్యారని పత్రిక రాసింది.

ఎగ్జామ్ లో చీటింగ్ చేసేందుకు సదరు కేటుగాడు ఓ సిమ్, బ్యాటరీతో పాటు కొన్ని వైర్లులతో ఓ హైటెక్ సెటప్ ను విగ్లో అమర్చుకున్నాడు.

అతి చిన్న ఇయర్ ఫోన్లను చెవుల్లో పెట్టుకున్నాడు. ఎవరికీ కనిపించనంత చిన్నగా ఉన్న ఆ ఇయర్ ఫోన్లను బయటకు తీయడం చాలా కష్టమైంది.

రూపిన్ శర్మ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని వెలుగు పత్రిక వివరించింది.

లుథియానా జిల్లా కోర్టులో పేలుడు

పంజాబ్ లుథియానా జిల్లా కోర్టు సముదాయంలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కోర్టు రెండో అంతస్తులోని మరుగుదొడ్డిలో జరిగిన పేలుడు ధాటికి గోడ కూలిపోయి, శిథిలాలు ఎగిరిపడ్డాయి. దీంతో భవనంలోని కిటికీ అద్దాలు, ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక కార్ల అద్దాలు పగిలిపోయాయి.

న్యాయవాదుల సమ్మె కారణంగా ఆ సమయంలో తాకిడి సాధారణం కంటే కాస్త తక్కువగా ఉంది.

ఈ ఘటనను ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఖండించారు. పేలుడు పదార్థాన్ని అమర్చుతున్న వ్యక్తే ఈ ఘటనలో చనిపోయినట్లు అనుమానం వ్యక్తంచేశారు.

సాధ్యమైనంత త్వరగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ కోరింది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించే అవకాశాలున్నాయని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)