You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆలం ఆరా: ఈ భారతీయ తొలి టాకీ సినిమా ఎప్పటికైనా దొరుకుతుందా?
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ నెలా ఆరంభంలో ముంబయికి చెందిన ఆర్కైవిస్టుల (పురాతన వస్తువులను భద్రపరిచేవారు) బృందం భారతదేశ తొలి టాకీ ఫిల్మ్ ఆలం ఆరాతో సంబంధం ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని గుర్తించగలిగారు.
1931లో ఆలంఆరా సినిమాను ప్రింట్ చేసిన ఒక పాత మెషీన్‌ను శివేంద్ర సింగ్ దుంగార్పూర్, ఆయన బృందం కనుక్కొంది. శివేంద్ర సింగ్ సినీ దర్శకుడు. పాత సినిమాలను సేకరించడం, భద్రపరచడం ఆయన ఆసక్తులతో ఒకటి.
ముంబయిలో ఓ చీరల దుకాణంలో ఈ మూలన పడి ఉంది ఈ మెషీన్. దీన్ని చికాగో లోని బెల్ అండ్ హావెల్ అనే కంపెనీ తయారు చేసింది. దీని అసలు ఓనర్ సినీ నిర్మాత ఆర్ధెశిర్ ఇరానీ కాగా, దీన్ని ఆయన నుంచి నళిన్ సంపత్ కొనుగోలు చేశారు.
సంపత్‌కు ముంబయిలో ఫిల్మ్ స్డూడియో, ప్రాసెసింగ్ లేబరేటరీ ఉంది. ''ఆలం ఆరాకు సంబంధించి మిగిలి ఉన్న కళాఖండం ఇదొక్కటే. ఇది తప్ప ఆ సినిమాకు సంబంధం ఉన్నదేదీ అందుబాటులో లేదు'' అన్నారు దుంగార్పూర్
1962 లో ఈ మెషిన్ ను కొనడానికి సంపత్ కుటుంబం రూ.2500 చెల్లించింది. అప్పట్లో వీరి కంపెనీ ప్రభుత్వ సంస్థ అయిన ఫిల్మ్ డివిజన్ రూపొందించిన సినిమాలను ప్రింట్ చేసేది. 2000 సంవత్సరం వరకు ఇది కొనసాగింది.
''ఇది చాలా సాధారణ ఫిల్మ్ ప్రింటింగ్ మెషిన్. కానీ, దీనితో మాకు భావోద్వేగమైన అనుబంధం ఉంది. 2000 సంవత్సరం నుంచి సినిమాలు డిజిటల్‌కు మారిపోవడంతో మేం దీన్ని ఉపయోగించడం మానేశాం'' అని సంపత్ అన్నారు.
కొన్ని దశాబ్దాలుగా దుంగార్పూర్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నడుపుతున్నారు. ముంబయి కేంద్రంగా పని చేసే ఈ లాభాపేక్ష లేని కంపెనీ, ఆలంఆరా ప్రింట్ కోసం అనేక ప్రయత్నాలు చేసినా విఫలమైంది.
ఈ సినిమాకు సంబంధించిన ఆధారాలు ఏవైనా లభిస్తే తెలియజేయాలంటూ సోషల్ మీడియలో కూడా దుంగార్పూర్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ సినిమా కాపీ అల్జీరియాలోని ఓ ఫిల్మ్ ఆర్కైవ్ లో ఉందని, అక్కడ ఇంకా అనేక పాత భారతీయ సినిమాలు ఉన్నాయని తెలిసింది.
కానీ, మీరే ఇక్కడికి వచ్చి ఈ ఆర్క్వైవ్స్ లో వెతుక్కోవాలని ఆ సంస్థ చెప్పంది. కానీ, దుంగార్పూర్ అక్కడికి వెళ్లలేకపోయారు.
ఆలంఆరా కాపీని ప్రింట్ చేసిన ఈ మెషీన్‌ను నళిన్ సంపత్ తాత కొనుగోలు చేశారు. ఆయన ముంబయిలో ఓ స్టూడియో నడిపేవారు.
ఈ సినిమా ఇరాన్ లోని ఫిల్మ్ ఆర్కైవ్ లో ఉండొచ్చని కూడా మరో ఆధారం లభించింది. ఇరానీ ఆలంఆరా సినిమా రూపొందిస్తున్న సమయంలోనే ఆయన సినిమా నిర్మాణ సంస్థ 'లోర్ గర్ల్' అనే తొలి పర్షియన్ టాకీ సినిమాను కూడా నిర్మించింది.
''ఆలంఆరా, లోర్ గర్ల్ అనే రెండు సినిమాలకు ఇరానీ, ఒకే బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులను ఉపయోగించారు. వారు రెండు సినిమాలలోనూ ఒకే కాస్ట్యూమ్స్ తో కనిపిస్తారు. ఆలంఆరా కనిపించకుండా పోయింది. కానీ, లోర్ గర్ల్ ఇప్పటికీ ఇరాన్ ఆర్క్కైవ్స్ లో ఉంది'' అని దుంగార్పూర్ అన్నారు.
''ఆలం ఆరా పూర్తిగా కనిపించకుండా పోయిందంటే నేను నమ్మలేను'' అని భారతీయ సినీ విమర్శకుడు, ఆర్కైవిస్ట్ పీకే నాయర్ ఓ సందర్భంలో అన్నారు. 2016లో మరణించిన నాయర్, ఈ సినిమా కోసం పరిశోధన చేసిన వారిలో ఒకరు. ఆయన ఇరానీ కుటుంబీకులను కూడా కలిశారు.
''ఒకటి రెండు రీళ్లు ఎక్కడో ఒక చోట ఉండవచ్చు'' అని ఇరానీ కుటుంబీకులలో ఒకరు చెప్పగా, దాని మీద ఉండే వెండి సేకరించిన తర్వాత వాటిని పారేసినట్లు మరొకరు చెప్పారు.
‘‘ఆలంఆరాను నైట్రేట్ ఫిల్మ్ మీద రికార్డు చేశారు.ఈ ఫిల్మ్ మీద వెండిపూత ఉంటుంది. ఇరానీ కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు దానిపై వెండిని సేకరించి అమ్ముకుని ఉండొచ్చు. ఇలాంటి ఘటనలు ఇంకా అనేక సినిమాలకు జరిగి ఉంటాయి'' అని దుంగార్పూర్ అభిప్రాయపడ్డారు.
పాతకాలం నాటి సినిమాలను దాచి పెట్టడం, భద్రపరచడం పై ఇండియాలో పెద్దగా ఆసక్తి ఉండదు. 1912 నుంచి 1931 మధ్య తయారైన దాదాపు 1138 మూకీ సినిమాలు కనిపించకుండా పోయాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఇలాంటి సినిమాలో 29 సినిమాలను భద్రపరచగలిగింది. ఇంకా అనేక పాత సినిమాల ప్రింట్లు, నెగెటివ్‌లు షాపుల్లో, ఇళ్లలో, గోడౌన్లలో పాడుబడిన స్థితిలో ఉన్నాయి.
థాయిలాండ్ లోని ఓ సినిమా హాల్లో కూడా ఇలాంటి అనేకం ఉన్నాయి. 1980లో సుప్రసిద్ధ బెంగాలీ సినిమా దర్శకుడు మృణాల్ సేన్, తాను సినిమా తీస్తున్న ఓ పురాతన భవనంలో పాతకాలపు బెంగాలీ టాకీ సినిమా రీళ్లు పడి ఉండటాన్ని గుర్తించారు.
కనిపించకుండా పోయిన సినిమాలలో ఆలంఆరా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ సినిమా 1929 నాటి హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా షో బోట్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుని రూపొందించిన సినిమా.
ఆరంభంలో ఈ సినిమా అప్పటి చాలా సినిమాల్లాగే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఒక రాజకుటుంబంలో రాణుల మధ్య ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు, రొమాన్స్ తదితర అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.
124 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను క్లోజ్డ్ డోర్స్ లో చిత్రీకరించారు. బయటి శబ్ధాలు రికార్డు కాకుండా ఈ ఏర్పాటు చేశారు. ఈ సినిమాను షూట్ చేసిన స్టూడియో ఎదురుగా ముంబయి రైల్వే ట్రాక్ ఉంటుంది.
పగలంతా రైళ్ల రాకపోకల శబ్దాలు వస్తుండటం, ఫ్లోర్ అదురుతుండటంతో ఈ సినిమాను రాత్రి పూట చిత్రీకరించారు. సౌండ్ రికార్డు చేయడానికి అప్పుడు బూమ్ మైక్ లు లేకపోవడంతో మైక్రోఫోన్‌లను నటుల చుట్టూ కనిపించకుండా అమర్చేవారు.
సంగీత వాయిద్యాల కోసం కళాకారులు చెట్ల చాటు నుంచి లేదా, చెట్ల పై నుంచి సంగీతాన్ని ప్లే చేసేవారు. ఈ సినిమాలో నటించిన వాజిర్ మహమ్మద్ ఖాన్ ఈ చిత్రానికి తొలి పాటను పాడారు. ఇదే ఇండియాలో మొదటి సినిమా పాట.
విదేశాల నుంచి వచ్చిన డెమింగ్ అనే నిపుణుడి నుంచి తాను సౌండ్ రికార్డింగ్ నేర్చుకున్నానని, అప్పట్లో ఆయన రోజుకు వంద రూపాయలు ఇందుకో ఛార్జ్ చేసేవారని ఆర్ధెశిర్ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
''అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. దాన్ని భరించలేక నేనే స్వయంగా సినిమాలను రికార్డ్ చేయడం ప్రారంభించా'' అని ఆయన వెల్లడించారు.
ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. కొన్ని వారాలపాటు దీని అమ్మకాలు జరిగాయి. థియేటర్ల ముందు ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసులు అవసరమయ్యేవారు. ఈ సినిమాలో నటించిన జుబేయిదా తన అమాయకమైనా, ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకలను అలరించారని ఓ సినీ విమర్శకుడు అన్నారు.
ఈ సినిమాను చూసిన ప్రముఖ డాన్సర్ సితారా దేవి, అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.
''అంతకు ముందు మూకీ చిత్రాల్లో సబ్ టైటిల్ కార్డులను చూశాక ప్రేక్షకులు సినిమా చూడాల్సి వచ్చేది. కానీ ఇందులో పాత్రలు స్వయంగా మాట్లాడుతుంటాయి. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రేక్షకులు అడిగేవారు'' అని సితారా దేవీ దుంగార్పూర్ తో అన్నారు.
ఇప్పుడు ఆలం ఆరాకు సంబంధించి మిగిలి ఉన్నది కేవలం కొన్ని ఫొటోలు, పోస్టర్లు, ఒక ప్రమోషన్ బుక్‌లెట్ మాత్రమే. ముంబయిలో సినిమాలు అమ్ముకునే షాప్ ఉన్న షాహిద్ హుస్సేన్ మన్సూరీ దగ్గర ఇలాంటి బుక్ లెట్ ఒకటి ఉంది.
''ఇది గత అరవై సంవత్సరాలుగా మా దగ్గరే ఉంది. ఆ సినిమాకు సంబంధించిన వాటిలో ఇదొక్కటే ఇప్పటికీ మిగిలి ఉన్నదని నేను విన్నాను. ఈ రోజుల్లో ఇలాంటి వాటి విలువ చాలామందికి తెలియదు'' అన్నారు మన్సూరీ.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)