You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
డబుల్ డోర్ ఫ్రిజ్ కొనడానికి వెళ్లిన సుప్రియ, శ్రీకాంత్ దంపతులు రూ.35 వేల విలువైన ఫ్రిజ్ కొన్నారు. షాపు యాజమానికి రూ. 25 వేలు క్రెడిట్ కార్డు ద్వారా, మిగతా పది వేలు నగదు రూపంలో చెల్లించారు.
అయితే నగదులో రెండు రూ.500 నోట్లు నకిలీవి ఉన్నట్లు షాపు యాజమాని గుర్తించి...అడిగారు. తాను నెలనెలా చీటీల రూపంలో దాచుకున్న సొమ్ములో దొంగ నోట్లు ఎలా వచ్చాయో తెలియక తలలు పట్టుకున్నారు సుప్రియ దంపతులు.
ఇటీవల రిజర్వు బ్యాంకు కూడా దేశంలో నకిలీ నోట్లు పెరిగిపోయాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వార్షిక నివేదికలో (2021-22) గత ఏడాదితో పోలీస్తే నకిలీ రూ.500 నోట్లలో 101.9 శాతం, రూ.2,000 నోట్లలో 54.16 శాతం పెరుగుదలను గుర్తించినట్లు ఆర్బీఐ పేర్కొంది.
ఈ నేపథ్యంలో మన జేబులోను, పర్సులోనూ ఉన్న కరెన్సీ నోట్లలో నకిలీ/దొంగ/ఫేక్ నోట్లను గుర్తించడం ఎలా? అనే అంశంపై విశాఖపట్నం యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎస్వీఎస్ మూర్తిని బీబీసీ సంప్రదించింది.
బ్యాంకు ఉద్యోగిగా 36 ఏళ్ల అనుభవమున్న ఎస్వీఎస్ మూర్తి... బ్యాంకు రోజువారీ కార్యకలాపాలు, ఫేక్ కరెన్సీ గుర్తించడం వంటి అంశాల్లో శిక్షణనిచ్చే స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌ఛార్జి కూడా.
చిన్న నోట్లు అంటే రూ.10, రూ.20, రూ.50 వంటి నోట్లలో నకిలీ నోట్లు కనిపించవు. అదే పెద్ద నోట్లు రూ.2,000, రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లలో ఫేక్ నోట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
రూ.100 నుంచి రూ.2,000 నోట్ల రంగు, సైజు తప్ప వాటిపై ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. వీటిలో నకిలీ నోట్లను ఏ విధంగా గుర్తించాలో ఎస్వీఎస్ మూర్తి చెప్పిన వివరాలు చూద్దాం.
కరెన్సీ నోటు ముందు భాగాన్ని మీకు ఎదురుగా పెట్టుకుని చూస్తున్నప్పుడు కనిపించే సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఆయన ఒక్కొక్కటిగా వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
1. సెక్యూరిటీ థ్రెడ్ (Security Thread):
మా వద్ద నోట్ షార్టింగ్ మిషన్స్, అల్ట్రా వైలెట్ ల్యాంప్స్ ఉంటాయి. పబ్లిక్ వద్ద ఇటువంటివి ఉండవు కాబట్టి... నోట్‌పై ఉన్న కొన్ని చిహ్నాల ఆధారంగా ఈ నోటు నకిలీదా, నిజమైనదా అనే విషయం తెలుసుకునే వీలుంది. అందులో మొదటిది నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్. నోటును కంటికి ఎదురుగా పట్టుకుని చూస్తే... మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది. దీనిని కొంచెం కిందకు వంచి చూస్తే ఆ ధ్రెడ్ బ్లూ కలర్‌లోకి మారుతుంది. అంటే ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే థ్రెండ్, 45 డిగ్రీల కోణంలోకి వంచి చూస్తే... నీలం రంగులో మారుతుంది. ఈ రంగుల మార్పు నకిలీ నోట్లలో కనిపించదు.
2.లాటెంట్ ఇమేజ్ (Latent Image):
నోటు ఎడమవైపు కింది భాగంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అంటారు. ఆ ఇమేజ్ లోపల ఏముందో మాత్రం స్పష్టంగా కనిపించదు. లాటెంట్ ఇమేజ్ అంటే దాగివున్న చిత్రం అని అర్థం. మహాత్మా గాంధీ-2005 సిరీస్‌లో విడుదలైన రూ.100 అంతకంటే ఎక్కువ విలువున్న కరెన్సీ నోట్లపై ఈ ఫీచర్ కనిపిస్తుంది. నోటు ఎడమ వైపు కింద భాగంలో కనిపించే పట్టీ లోపల ఆ నోటు విలువ సంఖ్య రూపంలో దాగి ఉంటుంది. ఆ పట్టీపై కాంతి పడేటట్లు చేస్తే పట్టీలో దాగిన ఉన్న లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది.
3. సీ త్రూ రిజిస్టర్ (See through Register):
నోటుకు ఎడమ వైపు 500 అనే సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనపడుతూ మరొక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలో కూడా అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే 500 అనే సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే రెండు వేల రూపాయల నోటుని వెలుతురుకి ఎదురుగా పెట్టి పరీక్షిస్తే ఆ స్థానంలో 2,000 అనే సంఖ్య కనిపిస్తుంది. దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు.
4. బ్లీడ్ లైన్స్ (Bleed Lines):
నోటుకి రెండు వైపులా నల్లని లైన్స్ ఉంటాయి. రూ.500 నోటుకి రెండు వైపులా ఈ లైన్స్ ఐదేసి ఉంటాయి. వీటిని బ్లీడ్ లైన్స్ లేదా బ్లీడ్ మార్క్స్ అంటారు. ఈ లైన్స్‌లను చేతితో తాకి చూసినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. ఈ లైన్స్ ఆ నోటు విలువని తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి. ఐదు లైన్స్ ఉంటే రూ.500 నోట్లు అని, ఏడు లైన్స్ ఉంటే రూ.2,000 నోట్లు అని, 4 లైన్లు ఉంటే రూ.100 నోటు అని, 4 బ్లీడ్ లైన్ల మధ్యలో రెండు చిన్న వృత్తాలు ఉంటే అది రూ.200 నోటు అని గుర్తించవచ్చు. ప్రధానంగా ఈ బ్లీడ్ మార్క్స్ తాకి దృష్టి లోపం ఉన్నవారు నోటు విలువను తెలుసుకోవచ్చు.
5. ఇంటాగ్లియో ప్రింటింగ్ (Intaglio Printing):
నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ, ఆర్బీఐ సీల్.. కుడి వైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుపై కుడి, ఎడమల చివర్లో ఉండే బ్లీడ్ లైన్లను కూడా ప్రత్యేక విధానంలో ప్రింట్ చేస్తారు. ఈ ప్రింటింగ్‌ను ఇంటాగ్లియో ప్రింటింగ్ లేదా రైజ్డ్ ప్రింటింగ్ అంటారు. ఈ విధానంలో ప్రింటైనవి తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా ఉంటాయి. పైన చెప్పుకున్న గాంధీ బొమ్మ, అశోక స్తంభం మొదలైనవి తాకినప్పడు మన చేతికి ఉబ్బెత్తుగా తగులుతాయి. ఈ ఫీచర్ రూ. 100 నుంచి రూ.2,000 వరకు ఉన్న నోట్లపై కనిపిస్తుంది.
6. వాటర్ మార్క్, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ (Water Mark and electrotype watermark):
సెక్యూరిటీ థ్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం, దాని కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటుంది. దాని పక్కన ఒక ఖాళీగా ఉన్నట్లు కనిపించే భాగంలో పరిశీలించి చూస్తే మహాత్మ గాంధీ బొమ్మతో వాటర్ మార్క్ ఉంటుంది. దీనిని ఎలక్ట్రో టైప్ వాటర్ మార్క్ అంటారు. అంటే ఇది నోటుపై చెక్కినట్లుగా కనిపిస్తుంది. గాంధీ బొమ్మ వాటర్ మార్క్ పక్కన, అది ఏ డినామినేషనో తెలిపే సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు రూ. 500 నోటు అయితే 500 అని, రూ. 2,000 నోటు అయితే 2,000 అనే వాటర్ మార్కు కనిపిస్తుంది. అది స్పష్టంగా కనపడాలంటే వెలుతురులో పెట్టి చూడాలి. దీనిని వాటర్ మార్క్, ఎలక్ట్రో టైప్ వాటర్ మార్క్ టెస్ట్ అంటారు.
7. న్యూ నెంబరింగ్ ప్యాటర్న్ (New Numbering Pattern):
2015 తర్వాత నోటుపై కుడి వైపు కింద భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఆ సంఖ్య ఎడమ నుంచి కుడికి చూస్తునప్పుడు సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే సంఖ్యకు ముందుండే మూడు ఆంగ్ల అక్షరాల సైజు మాత్రం పెరగదు. అవన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ తర్వాత వచ్చే ఆరు అంకెల సంఖ్యలోని ఒక్కో సంఖ్య సైజు కుడివైపు పెరుగుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు.
8. ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ (Optically variable Ink):
నోటుకు కుడివైపున ఆర్బీఐ ఎంబ్లమ్‌కు, అశోక స్తంభానికి మధ్యలో రూ.500 అని ఉంటుంది. ఈ సంఖ్య కంటికి నోటును ఎదురుగా పెట్టుకుని చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో, సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారుతుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడతారు. అందుకే రంగులు మారతాయి. అలాగే నోటుకు కుడివైపు చివర మధ్య భాగంలో రైజ్డ్ ప్రింటింగ్‌లో ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తు రూ. 20 నోటుకైతే నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం, రూ.50 నోటుకు చతురస్రం, రూ.100కు తిభ్రుజం, రూ.500 నోటుకు వృత్తం, రూ.2,000 నోటుపై దీర్ఘచతురస్రం ముద్రించి ఉంటాయి. ఈ ఫీచర్ కూడా దృష్టిలోపం ఉన్నవారి కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
9. నోటును వెనుక వైపు తిప్పితే....
ఎడమ వైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. దానికి పక్కన కింద భాగంలో స్వచ్ఛ భారత్ లోగో, నినాదం కూడా ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో ఆయా నోటు విలువ రాసి ఉంటుంది. రూ.2,000 నోటుపై మంగళయాన్, రూ. 500 నోటుపై ఎర్రకోట, రూ. 200 నోటుపై సాంచీ స్తూపం, రూ. 100 నోటుపై రాణి కా వావ్ చిత్రాలు ఉంటాయి. కుడివైపు చివర భాగం పైన ఆ నోటు విలువను తెలిపే సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది.
10. మరో ముఖ్యమైన రెండు విషయాలు...
అలాగే మన వద్ద ఉన్న నోట్లలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయనే అనుమానం వస్తే...ఏ బ్యాంకుకైనా తీసుకుని వెళ్లవచ్చు. ఆ బ్యాంకు సిబ్బంది ఆ నోటుని పరిశీలించి అది నకిలీదో, ఒరిజినల్‌దో చెప్తారు. ఒక వేళ నకిలీ నోటు అయితే ఆ బ్యాంకు సిబ్బంది దానిని తీసుకుని, ఎంత విలువైన నోటును తీసుకున్నారో, ఆ విలువను తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. ఆ నకిలీ నోటు ఎవరి వద్ద నుంచి మనకు వచ్చిందో, అతనికి ఆ రసీదు చూపించి...ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే ఆ రసీదుకు ఎటువంటి మారక విలువ ఉండదు.
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో అక్కడున్న యంత్రాలు కానీ, సిబ్బంది కానీ నకిలీ నోట్లను గుర్తిస్తే బ్యాంకు సిబ్బంది తీసుకుంటారు. అలా తీసుకున్న నోట్ల విలువ శూన్యం. ఎందుకంటే అది నకిలీది కాబట్టి. అలాగే ఒక లావాదేవీలో నాలుగు, అంత కంటే తక్కువ నకిలీ నోట్లు వస్తే...బ్యాంకు సిబ్బంది ఆ విషయాన్ని అప్రమత్తత కోసం పోలీసులకు తెలియ చేస్తారు. అదే ఒక లావాదేవీలో ఐదు, అంతకంటే ఎక్కువ ఫేక్ నోట్లు వస్తే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు పెడతారు.
ఇవి కూడా చదవండి:
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)