You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోలోగమీ: తనను తానే పెళ్లి చేసుకుంటోన్న 24 ఏళ్ల క్షమా బిందు ఎవరు?.. ఈ పెళ్లి ఎందుకు?
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
సోలోగమీ అనేది ప్రజలు తమను తామే వివాహం చేసుకునే వేడుక. గత కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఇది భారత్‌కు కూడా చేరింది.
గుజరాత్ రాష్ట్రం వడోదలోని ఒక గుడిలో జూన్ 11వ తేదీ సాయంత్రం, క్షమా బిందుకు ఒక సంప్రదాయ హిందూ వివాహ వేడుక జరుగనుంది.
పెళ్లికూతురు ఎరుపు రంగు దుస్తులతో చేతులకు మెహందీ, నుదుటిన సింధూరం ధరించి అగ్నిహోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయనున్నట్లు క్షమా బిందు ఫోన్‌లో నాతో చెప్పారు.
పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకలైన హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా ఆరోజు ఉదయం పూట జరుగుతాయి. పెళ్లి తర్వాత ఆమె రెండు వారాల హనీమూన్ కోసం గోవా వెళ్తారు.
అయితే, ఈ పెళ్లి తంతులో సంప్రదాయం ప్రకారం అన్నీ ఉన్నప్పటికీ కీలకమైన వ్యక్తి మాత్రం లేడు. అతనే వరుడు. వరుడు లేకుండానే క్షమా బిందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే, ఆమె తనను తానే వివాహం చేసుకోవాలని ఈ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. భారత్‌లో ఇలాంటి పెళ్లి జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీన్నే సోలోగమీ అని పిలుస్తున్నారు.
''చాలామంది, నేను మంచి జీవిత భాగస్వామిని కాగలనని చెబుతుంటారు'' అని 24 ఏళ్ల సోషియాలజీ విద్యార్థి, బ్లాగర్ క్షమా బిందు చెప్పారు. అయితే, నాకు నేనే మంచి భాగస్వామిని అని వారికి చెబుతుంటాను అని ఆమె తెలిపారు.
తనను తాను వివాహం చేసుకోవడం ద్వారా 'స్వీయ ప్రేమ' కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని బిందు అన్నారు.
''స్వీయవివాహం అనేది ఒక నిబద్ధత. మీ కోసం మీరు నిలబడేందుకు, మీకు నచ్చిన జీవన విధానాన్ని ఎంచుకునేందుకు ఈ స్వీయ వివాహం అనేది ఉపయోగపడుతుంది. మీరు మరింత అందంగా, సంతోషంగా, మీకు నచ్చినట్లుగా జీవించడంలో ఇది సహాయపడుతుంది'' అని బిందు వివరించారు.
''నాలోని శారీరక, మానసిక, ఉద్వేగపూరితమైన బలహీనతలు అన్నింటినీ నేను అంగీకరిస్తున్నానని చెప్పడానికి ఇదొక మార్గం. ఈ పెళ్లి స్వీయ అంగీకారానికి సంబంధించిన చర్య. నాలో నాకు నచ్చని కొన్ని అంశాలు ఉంటాయి. ఈ పెళ్లి ద్వారా ఆ లోపాలతో సహా నన్ను నేను అంగీకరిస్తున్నానని చెప్పడమే నా ఉద్దేశం'' అని ఆమె చెప్పారు.
ఈ పెళ్లికి తన కుటుంబం ఆశీర్వాదాలు లభించాయని, స్నేహితులతో కలిసి తన కుటుంబం ఈ వేడుకకు హాజరు అవుతుందని బిందు తెలిపారు.
''నువ్వెప్పుడూ ఏదో కొత్తగా ఆలోచిస్తావు అని మా అమ్మ అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించే మా అమ్మనాన్న దీన్ని అంగీకరించారు. నీకు ఆనందం కలిగించేది మాకు కూడా సంతోషమే'' అని అన్నారని బిందు చెప్పారు.
తనను తానే పెళ్లి చేసుకోవడం అనే ఈ ఆలోచన దాదాపు 20 ఏళ్ల క్రితం మొదటిసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన 'సెక్స్ అండ్ ద సిటీ' అనే అమెరికా సిరీస్‌లోని క్యారీ బ్రాడ్‌షా పాత్ర ద్వారా ఈ ఆలోచన బయటకు వచ్చింది. కానీ, ఇది ఒక కామెడీ డ్రామా.
అప్పటినుంచి ఇలాంటి వందలాది వివాహాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువ మంది ఒంటరి మహిళలే ఇలాంటి వివాహాలు చేసుకున్నారు. సాధారణ వధువుల తరహాలోనే వీరు కూడా వెడ్డింగ్ గౌన్లు ధరించి చేతిలో పష్పగుచ్ఛంతో బంధుమిత్రుల ఉత్సాహాల మధ్య స్వీయ వివాహాన్ని చేసుకుంటారు.
అయితే, 33 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్ కేసు కాస్త విచిత్రమైనది. ఆమె తనను తానే పెళ్లి చేసుకొని మూడు నెలల తర్వాత తనకు తానే విడాకులు కూడా ఇచ్చుకున్నారు.
ఇలాంటి పెళ్లిళ్లతో ముడిపడిన వ్యాపారాలు కూడా ప్రపంచంలోని అనేక భాగాల్లో విస్తరించాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు చేయడం, ఉంగరాలు అందించడం వంటి వ్యాపారాలు పెరిగాయి.
అయితే, ఇలాంటి కథలు భారత్‌లో వినిపించని కారణంగా ఇప్పుడు క్షమా బిందు వివాహం చర్చనీయాంశం అయింది.
నేను మాట్లాడిన మానసిక ఆరోగ్య నిపుణురాలు సోలోగమీపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
''నాకైతే ఇది చాలా విచిత్రమైన కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అందరికీ స్వీయ ప్రేమ ఉంటుంది. దీన్ని వ్యక్త పరచడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. ఇది మనందరిలో అంతర్గతంగా ఉంటుంది. పెళ్లి అంటే రెండు అస్తిత్వాలు కలిసి ప్రయాణించడం'' అని ఛండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రి మాజీ డీన్, సైకియాట్రి ప్రొఫెసర్ డాక్టర్ సవితా మల్హోత్రా అన్నారు.
ఈ వార్తపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. క్షమా బిందు ఎందరికో స్ఫూర్తి అంటూ కొంతమంది ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా.... చాలామంది ఈ సోలోగమీ కాన్సెప్ట్ గురించి తలలు బాదుకుంటున్నారు.
''ఎవరి ప్రమేయం అక్కర్లేదు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది'' అంటూ ఒక మహిళ ట్విటర్‌లో ఆశ్చర్యపోయారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు బిందు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
సోలోగమి అనేది ఒక విపరీతమైన, విషాదకరమైన చర్య అని కొందరు విమర్శించారు.
ఆమెను విమర్శించే అందరికీ బిందు ఒక్కటే చెప్పదల్చుకున్నారు. ''పెళ్లి అనేది నాకు సంబంధించిన నిర్ణయం. నేను అబ్బాయిని చేసుకుంటానా? అమ్మాయిని చేసుకుంటానా? లేదా నన్ను నేనే పెళ్లి చేసుకుంటానా? అనేది నా ఇష్టం. నన్ను నేను పెళ్లాడటం ద్వారా సోలోగమీ అనేది ఒక సాధారణ అంశమని చెప్పాలనుకుంటున్నా. మీరు ఒంటరిగా ఈ ప్రపంచంలోని వచ్చారు, ఒంటరిగానే వెళ్లిపోతారు. కాబట్టి మిమ్మల్ని మీకంటే ఎవరు ఎక్కువగా ప్రేమించగలరు? '' అని బిందు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి
- ‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు?’ - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)