You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చార్ ధామ్ యాత్ర: ఇప్పటివరకు 86 మంది యాత్రికులు చనిపోయారు.. కారణం ఏమిటి?
- రచయిత, రోహిత్ జోరీ
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర మొదలై నెల రోజులు కూడా పూర్తికాలేదు. అయితే, ఈ యాత్రకు వెళ్లిన 86 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ 86 మందిలో 44 మంది కేదార్‌నాథ్ యాత్ర మార్గ మధ్యంలో, 25 మంది యమునోత్రికి వెళ్లే దారిలో, మరో 13 మంది బద్రీనాథ్‌కు వెళ్లే దారిలో, మరో నలుగురు గంగోత్రి మార్గ మధ్యంలో మరణించారు.
మరణించిన వారిలో చాలా మంది వృద్ధులు ఉన్నారని, గుండె పోటు వల్లే ఎక్కువ మంది మరణించారని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.
ఈ యాత్ర మే మూడో తేదీన మొదలైంది. ఇప్పటికి కేవలం 25 రోజులే పూర్తయింది. అయితే, ఇదివరకటి సంవత్సరాలతో పోలిస్తే, ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువని వార్తలు వస్తున్నాయి.
ఈ పెరుగుతున్న మరణాలు చార్ ధామ్ యాత్రపై చాలా సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కేదార్‌నాథ్ యాత్రపై ప్రశ్నలు వస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తోంది. సరైన మౌలిక, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరుగుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
దీనిపై ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ ఒక ఫేస్‌బుక్ పోస్టు చేశారు. ‘‘నిర్లక్ష్యానికి కూడా హద్దు ఉంటుంది. ఇలానే మరణాల సంఖ్య పెరుగుతూ పోతే మన రాష్ట్రం గురించి దేశంలోని ఇతర రాష్ట్రాలు ఏమని అనుకుంటాయి?’’అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏం అంటోంది?
సరైన ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే యాత్రికులు చనిపోతున్నారన్న వార్తలను ఉత్తరాఖండ్ ఆరోగ్య విభాగం ఖండిస్తోంది. ‘‘ఈ మరణాలేవీ ఆసుపత్రుల్లో సంభవించలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఆసుపత్రులకు తీసుకురాకముందే, వారు మరణిస్తున్నారు. ఈ యాత్ర కోసం మేం ప్రత్యేక వైద్య సదుపాయాలను ఏర్పాటుచేశాం. ఎక్కడికక్కడే ఆరోగ్య శిబిరాలను కూడా పెడుతున్నాం. రక్తపోటు, మధుమేహం, శ్వాస సమస్యలుండే 50ఏళ్లకు పైబడిన వ్యక్తుల విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాం’’అని హెల్త్ డీజీ శైలజా భట్ బీబీసీతో చెప్పారు.
‘‘రిషీకేశ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉంటుంది. కేదార్‌నాథ్‌లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. మరోవైపు రిషీకేశ్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. హెలికాప్టర్లలో నేరుగా కేదార్‌నాథ్ వెళ్లినప్పుడు ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. వయసు పైబడిన వారిపై ఉష్ణోగ్రతల్లో తేడా ప్రభావం చూపిస్తోంది. మరోవైపు కొందరు ఉపవాసంతో యాత్ర చేయాలని భావిస్తారు. అలా ఉపవాసంతో వెళ్లడం చాలా ప్రమాదకరం. మరికొందరు ఉత్సాహంతో వేగంగా ముందుకు వెళ్తుంటారు. అందుకే ఆహారం, నీరు తీసుకుంటూ నెమ్మదిగా వెళ్లాలని మేం యాత్రికులకు సూచిస్తుంటాం’’అని శైలజ చెప్పారు.
కరోనావైరస్ లాక్‌డౌన్ వల్ల గత రెండేళ్లలో చార్ ధామ్ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ సారి చాలా ఎక్కువ మంది యాత్రికులు వస్తున్నారు. ఇప్పటివరకు 10.26 లక్షల మంది చార్ ధామ్ యాత్రను పూర్తి చేసుకున్నారు. మే 25నాటికి మొత్తంగా 21 లక్షల మంది ఈ యాత్ర కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. ఆరు నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.
విపక్షాలు ఏం అంటున్నాయి?
ఈ అంశంలో ప్రభుత్వంపై ఉత్తరాంఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కరణ్ మాహ్రా విమర్శలు చేశారు. ‘‘ఈ యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, నేను 12 రోజుల యాత్ర ముగించుకున్న తర్వాత దేహ్రాదూన్‌లో ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడాను. ఆ రోజును నేను ఆందోళన వ్యక్తంచేసిన పరిణామాలే నేడు చోటుచేసుకుంటున్నాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారి యాత్ర జరుగుతోంది. అందుకే ప్రత్యేక ఆక్సిజన్ సదుపాయాలు అవసరం అవుతాయని చెప్పాను. లద్ధాఖ్ తరహాలో ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాను. కానీ, నేను జోక్ చేస్తున్నానని విమర్శించారు. 50 మంది మరణించిన తర్వాత ఆక్సిజన్ సదుపాయాలు ఏర్పాటుచేశారు’’అని కరణ్ బీబీసీతో చెప్పారు.
కేదార్‌నాథ్ యాత్ర మార్గ మధ్యంలో మంచి సదుపాయాలు ఏర్పాటుచేశామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ కరణ్ తప్పుపట్టారు. ‘‘ఆయన దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ ఈ యాత్రకు రావాలని పిలుపునిస్తున్నారు. కానీ, సరైన మౌలిక సదుపాయాలను మాత్రం ఏర్పాటు చేయడంలేదు’’అని కరణ్ వ్యాఖ్యానించారు.
‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తెరచివుంచే రోడ్డు మార్గం ఏర్పాటుచేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, కొండ చరియలు విరిగిపడటంతో యాత్రికులు చనిపోతున్నారు’’అని కరణ్ అన్నారు. ‘‘ఇదివరకు మార్గ మధ్యంలోని చాలా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. కొత్త మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు చలిలో భారీ వరసల్లో నిలబడుతున్నారు. వారి కోసం ఎలాంటి సదుపాయాలూ ఏర్పాటు చేయడం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
గత సంవత్సరాలతో పోలిస్తే, ప్రస్తుతం మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, 2017లో ఈ యాత్రకు వచ్చిన 112 మంది మరణించారు. 2018లో మృతుల సంఖ్య 102గా ఉంది. 2019లో 90 మంది మరణించారు. ప్రస్తుతం 25 రోజుల్లోనే 86 మంది మరణించారు. ఈ యాత్ర ఆరు నెలలు కొనసాగుతుంది.
అయితే, ఇలా గత ఏడాదితో ప్రస్తుత మృతులను పోల్చకూడదని శైలజా భట్ అన్నారు. ‘‘ప్రస్తుత మరణాలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉన్నాయో లేదో మేం ఇంకా పరిశీలించలేదు. ప్రస్తుతం మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే’’అని ఆమె చెప్పారు.
కోవిడ్ ప్రభావం కూడా కారణమా?
మౌలిక సదుపాయాలను సరిగా ఏర్పాటు చేయలేదంటూ తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ మీడియా విభాగం ఇన్‌ఛార్జి మన్వీర్ చౌహాన్ మాట్లాడారు.
‘‘చార్ ధామ్ యాత్రపై మేం చాలా శ్రద్ధ పెడుతున్నాం. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేకంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ఈ యాత్రతో ప్రత్యేక అనుబంధముంది. ఆయన కూడా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటుంటారు. ప్రస్తుతం చనిపోతున్న వారందరివీ సహజ మరణాలే. ఆరోగ్య సదుపాయాల కొరత వల్ల ఎవరూ మరణించలేదు’’అని చౌహాన్ చెప్పారు.
‘‘కోవిడ్-19తో చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు కూడా ఈ మరణాలకు ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ సారి రికార్డు స్థాయిలో యాత్రికులు వస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం అన్నిరకాల వైద్య, ఆరోగ్య సదుపాయాలనూ ఏర్పాటుచేస్తోంది. ఆక్సిజన్ సిలెండర్లు కూడా అందుబాటులో ఉంచాం’’అని ఆయన వివరించారు.
‘‘కోవిడ్-19 వ్యాప్తి తర్వాత తొలిసారి యాత్రను ప్రారంభించడంతో భారీగా ప్రజలు వస్తున్నారు. అయితే, ఇలా వచ్చే ప్రజల సంఖ్యను ప్రభుత్వం నియంత్రించాలి. లేకపోతే ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకునే ముప్పుంటుంది’’అని ఉత్తరాఖండ్ పర్యటక విభాగం పీఆర్‌వో కమల్ కిశోర్ జోషి చెప్పారు.
కేదార్‌నాథ్‌కు రోజుకు 13,000 మంది, బద్రీనాథ్‌కు 16,000 మంది, గంగోత్రికి 5,000 మంది, యమునోత్రికి 8,000 మందికి, హేమ్‌కుండ్ షాహిబ్‌కు 5,000 మందికి అనుమతి ఇస్తున్నారు.
ప్రస్తుతం మరణాల సంఖ్య ఇలా పెరుగుతుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ యాత్రకు ఐదు నెలలు మిగిలేఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- ‘ముస్లింలను ముస్లింలే చంపుతున్నారు, ఇది ఎలాంటి జిహాద్’- అమ్రీనా భట్ తండ్రి
- Monsoon: తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఇకపై సాధారణం అయిపోతాయా?
- నార్మల్ డెలివరీయా, సిజేరియనా? బిడ్డను ఎలా కనాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు లేదా
- తమిళ కుటుంబానికి ఆస్ట్రేలియన్ల మద్దతు, దిగొచ్చిన ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)