ప్రధాని నరేంద్ర మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విపక్షాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు, విమర్శలు రెండూ వస్తున్నాయి. ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ ఇలా స్పందించారు.
‘‘మీరు చూసే ఉంటారు... కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చర్చ జరుగుతోంది. ఎప్పుడూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ జెండాలు పట్టుకుని తిరిగిన వర్గమంతా నాలుగైదురోజులుగా కంగారు పడిపోతోంది. వాస్తవాల ఆధారంగా దాన్ని సమీక్షించడానికి బదులు, దాన్ని కించపరిచేలా పెద్ద ప్రచారం ప్రారంభించారు. అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకరు సత్యాలను బయటపెట్టే సాహసం చేశారు, తనకు నిజం అనిపించింది చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా, అంగీకరించకుండా ప్రపంచం దాన్ని చూడకుండా చేయాలని కొందరు ఎన్నో చేస్తున్నారు. ఐదారు రోజులుగా కుట్ర జరుగుతోంది’’
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రధాని మోదీ వ్యాఖ్యలివి.
ఎన్నో ఏళ్లుగా దాచి పెట్టిన సత్యాన్ని సినిమాగా చూపిస్తే కొందరిలో ఆందోళన మొదలైందని ఆయన విమర్శించారు.
ఈ సినిమా సరైనది కాదు అనేవారు వేరే సినిమా తీసుకుంటే ఎవరు వద్దంటారు అని ఆయన ప్రశ్నించారు.
‘‘నేను చెప్పేది సినిమా గురించి మాత్రమే కాదు. సత్యాన్ని సరైన రూపంలో దేశ ప్రజల ముందుకు తీసుకురావడం అనేది దేశం ప్రయోజనం కోసమే జరుగుతుంది. ఈ సినిమా సరికాదనిపించిన వారు... వేరే సినిమా తీసుకోవచ్చు. ఎవరు వద్దంటారు? కానీ ఏ సత్యాన్ని ఇన్నేళ్లూ దాచిపెట్టారో, దాన్ని ఎవరో ఇప్పుడు వాస్తవాల ఆధారంగా, కష్టపడి బయటకు తీసుకొస్తుంటే.. వారిలో ఆందోళన మొదలైంది. దానికి వ్యతిరేకంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సత్యం కోసం జీవించేవారు ఆ సత్యం వైపు నిలబడాలి. అది వారి బాధ్యత. ఆ బాధ్యతను అందరూ నిర్వరిస్తారనుకుంటున్నా’’ అని మోదీ అన్నారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విపక్షాల విమర్శలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు, విమర్శలు వస్తున్నాయి.
''కశ్మీరీ పండిట్లు తిరిగి తమ ఇళ్లకు, కశ్మీర్‌కు వెళ్లే అవకాశం లభిస్తుందా?'' - సినిమా మొత్తం కథను వివరించే డైలాగ్ ఇది.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ సినిమా మార్చి 11న విడుదలైంది.
బీజేపీ పాలనలో ఉన్న హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి.
బీజేపీ నేతల్లో కొందరు ఈ సినిమాకు అనుకూలంగా సోషల్ మీడియాలో తమ మద్దతును ప్రకటించారు.
కశ్మీరీ పండిట్ల సమస్య ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది.
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన తర్వాత గుజరాత్ అల్లర్లపైనా చర్చ జరిగింది.
'వివేక్ అగ్నిహోత్రి తర్వాతి చిత్రం గోద్రా మారణకాండపై తీస్తారు. అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది' అంటూ కేఆర్కే ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- "నా పెళ్లాం మహిళ కాదు.. పెళ్లై 6 ఏళ్లు దాటినా ఇంకా మేం కలవలేదు" - సుప్రీం కోర్టును ఆశ్రయించిన భర్త
- యుక్రెయిన్ శరణార్థుల ఆకలి తీర్చి, ఆదుకుంటున్న భారతీయులు- గ్రౌండ్ రిపోర్ట్
- మీ వంటింట్లో దాక్కున్న ప్రమాదాలు ఎన్నో తెలుసా..
- పాకిస్తాన్లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)