You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్, ఏపీలోనూ మొదలైన సమావేశాలు
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో తొలి రోజు బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కాగా ఆర్థిక మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతున్నారన్న కారణంతో బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కూడా తొలిరోజు వాడివేడిగానే మొదలయ్యాయి.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగం ప్రారంభించగానే 'రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్' అంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.
రూ. 2,56,958.51 కోట్ల బడ్జెట్
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2022-23ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
రూ. 2,56,958.51 కోట్లతో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు.
ఆర్థిక మంత్రి హరీశ్ తన ప్రసంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు తెలంగాణలో లేవు అని హరీశ్ రావు చెప్పారు.
మొత్తం బడ్జెట్: రూ. 2,56,958.51 కోట్లు
వ్యవసాయ రంగం - రూ. 24,254 కోట్లు
ఆసరా పెన్షన్లు - రూ. 11,728 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ - రూ. 2,750 కోట్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు - రూ. 12,000 కోట్లు
దళితబంధు - రూ. 17,700 కోట్లు.
మన ఊరు- మన బడి - రూ. 7,289 కోట్లు.
ఎస్టీల సంక్షేమం - రూ. 12,565 కోట్లు
పట్టణ ప్రగతి - రూ. 1,394 కోట్లు
బిసి సంక్షేమం - రూ. 5,698 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం - రూ. 177 కోట్లు
పల్లె ప్రగతి - రూ. 3330 కోట్లు
ఫారెస్ట్ యూనివర్సిటీ - రూ. 100 కోట్లు
హరితహారం - రూ. 932 కోట్లు
రోడ్లు, భవనాలు - రూ. 1,542 కోట్లు
బీజేపీ నేతల సస్పెన్షన్
కాగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల సమస్యలను సభలో ప్రస్తావిస్తామని ఈటల చెప్పారు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, గవర్నరుకు ఆయన విలువ ఇవ్వడం లేదని మరో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు.
సభలో ఆర్థిక మంత్రి ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుతగలడంతో వారిని సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ అనంతరం వారు నల్ల కండువాలతో అసెంబ్లీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో
ఏపీ బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు.
కోవిడ్ వల్ల రెండేళ్లుగా దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయని గవర్నర్ చెప్పారు.
ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పాలన మొదలవుతుందని గవర్నర్ స్పష్టం చేశారు.
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన వృద్ధి సాధించిందని.. మన బడి, నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలు పొందుతున్న లబ్ధిని గవర్నర్ తన ప్రసంగంలో గణాంక సహితంగా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉందని చెప్పారు. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని గవర్నర్ తెలిపారు.
టీడీపీ నిరసన
గవర్నర్ ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
గందరగోళం మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
కాగా సభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)