మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఒడిశాలోని జైపూర్ మహరాజ్ విక్రమ్ దేవ్ తన సంస్థానాన్ని, దాని పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ విద్యుత్ వెలుగులతో నింపేయాలని 95 ఏళ్ల క్రితం అనుకున్నారు. దానికోసం ఒక విద్యుత్ ప్లాంటు పెట్టాలని నిర్ణయించి, ఆ బాధ్యతను ఒక బ్రిటిష్ ఇంజనీరుకు అప్పగించారు.

అలా మొదలైన మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ కథ, ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు దాదాపు ఏడు దశాబ్ధాలుగా నిరంతరం విద్యుత్ వెలుగులు అందిస్తోంది.

1926 సమయంలో జైపూర్ ఒక జమీందారీ సంస్థానం. దాని జమీందారుగా రాజా విక్రమ దేవ్ వర్మ (IV) ఉండేవారు. ఒక జల విద్యుత్ ప్లాంట్ పెట్టి, తన సంస్థానానికి విద్యుత్ అందించాలని అనుకున్నారు. దాని బాధ్యతలను బ్రిటిష్ ఇంజనీరు హెన్రీ హవార్డ్‌కు అప్పగించారు.

దీనిపై పని చేయడం ప్రారంభించిన హవార్డ్ 1929లో డుడుమ వాటర్ ఫాల్స్ నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ సర్వే ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా మద్రాసు రాష్ట్రం కింద ఉండేది.

"చాలా సర్వేలు చేసిన తర్వాత, దాదాపు 500 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న డుడుమ జలపాతం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఒక స్కెచ్‌ను 1931లో హవార్డ్ గీశారు. అక్కడ నుంచి అనేక సర్వేలు చేశారు. నీటి లభ్యత, విద్యుత్ ప్లాంట్ స్థాపిస్తే దాని సామర్థ్యం, మిగులు జలాలు వంటి అంశాలపై ఒక నివేదికను రూపొందించారు" అని ఎలక్ట్రికల్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సత్యకిరణ్ బీబీసీకి చెప్పారు.

'రాతిని పేల్చి, ప్లాంట్ కట్టారు'

"ఆ నివేదిక ఆధారంగా 1946లో పనులు ప్రారంభమయ్యాయి. సర్వేల ప్రకారం జల విద్యుత్ కేంద్రం పెట్టాలని అనుకున్న స్థలమంతా నల్లరాయే ఉంది. దాంతో దానిని తొలిచేందుకు వందల డైనమేట్లు పెట్టి రాతిని పేల్చారు. దాని గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే కొండ పైభాగం నుంచి దాదాపు 900 అడుగుల దిగువన ఉన్న ఈ ప్లాంట్‌కు యంత్రాలు, ఇతర వస్తువులు రవాణా చేసేందుకు రోడ్డు సదుపాయం కూడా లేదు. దాంతో వించ్ (సిట్టింగ్ ఏర్పాటు ఉన్న క్లోజ్డ్ ట్రాలీ వంటిది) ఉపయోగించి కొండ పైకి, కిందకు రాకపోకలు చేసేవారు. ఆ వించ్‌లను ఇప్పటికీ వినియోగిస్తున్నాం’’ అని జనరేటర్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

"భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన ప్రదేశంలో ఈ ప్లాంట్ నిర్మాణం జరగడంతో దీనిని ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతమే అంటారు. 1955లో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం మూడు యూనిట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1959లో మరో మూడు యూనిట్లు అదనంగా చేరాయి. మొత్తం 120 మెగావాట్ల సామర్థ్యంతో ఇది నిరంతరం పని చేస్తోంది.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి, జైపూర్ మహరాజుకి మధ్య ఒప్పందంలో భాగంగా ఈ విద్యుత్ కేంద్రానికి అంకురార్పణ జరిగింది. ఈ ప్లాంట్‌ను భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ విశాఖపట్నం నుంచి ప్రారంభించారు" అని పవన్ కుమార్ చెప్పారు.

ఒడిశాలో ప్లాంట్..ఏపీ నుంచి నీళ్లు

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి విశాఖ జిల్లాలోని పాడేరులో మత్స్యగెడ్డ (మాచ్‌ఖండ్ నది.. దీనిని స్థానికంగా మత్స్యగెడ్డ అంటారు) నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. ఇలా వచ్చే నీటిని ఏవోబీలోని జోలాపుట్ వద్ద ఉన్న రిజర్వాయరులో నిల్వ చేస్తారు. ఒడిశా నదుల నుంచి కూడా నీరు కొంత చేరినా, మత్స్యగెడ్డ నీరు ఎక్కువగా ఉంటుందని రిజర్వాయర్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు.

"మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం ప్రతిరోజు 2 వేల క్యూసెక్యుల నీటిని పంపేందుకు ఇక్కడ నీటిని నిల్వ చేస్తాం. తూర్పు కనుమల్లో పుట్టిన మాచ్ ఖండ్ నది నీరే ఇక్కడకు చేరుతుంది. ఏడాది పొడవునా నీరు చేరడంతో, ఏ రోజు కూడా మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని పంపడంలో మేం విఫలం కాలేదు. జోలాపుట్ రిజర్వాయర్ నుంచి విడుదలైన నీరు డి.డ్యామ్ (డైవర్షన్ డ్యామ్) చేరి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచ్‌ఖండ్ ప్లాంట్‌కు చేరుతుంది" అని జోలాపుట్ జలాశయం డిప్యూటీ ఇంజనీర్ టి. వెంకట మధు బీబీసీకి చెప్పారు.

20 కోట్లతో జాయింట్ వెంచర్

ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు ఈ మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభమైనా, నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండూ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ప్లాంట్ ఒడిశా భూభాగంలో ఉండటం, నీరు ఆంధ్ర నుంచి రావడంతో, భవిష్యత్తులో వివాదాలు లేకుండా దీనిని ఏపీ-ఒడిశా జాయింట్ వెంచర్‌గా ప్రకటించారు.

అప్పటి లెక్కల ప్రకారం ఖర్చులు, ఉత్పత్తి అన్నీ కూడా ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు 70-30 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే తర్వాత జరిగిన ఒప్పందాల్లో భాగంగా ప్రస్తుతం ఇది చెరో 50 శాతంగా మారింది.

"మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం 6 యూనిట్లతో నిర్వహిస్తున్నారు. 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీని నిర్మాణానికి అప్పట్లోనే 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ ప్లాంట్ రెండు రాష్ట్రాల ఆస్తి. దీనిని ఏపీ తరపున ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఒడిశా తరపున ఒడిశా హైడ్రోపవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్నాయి. ప్లాంట్ ఒడిశాలోని కోరాపూట్ జిల్లా, ఒనకడెల్లి ఉంది. ఈ ప్లాంట్‌కు అవసరమైన నీరు ఏపీలోని పాడేరు మీదుగా జోలాపుట్ రిజర్వాయరుకు చేరి మాచ్‌ఖండ్‌కు వస్తుంది" అని టి. వెంకట మధు చెప్పారు.

'మాచ్‌ఖండ్ ఒక మ్యూజియం కూడా…'

జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఒనకడెల్లీ అనుకూలమైన ప్రదేశం. కానీ నిర్మాణానికి అవసరమైన వనరులు, యంత్రాలు అక్కడికి తరలించడం దాదాపు అసాధ్యమనే ప్రదేశంలో ఉంటుంది. అటువంటి చోట కూడా ఒక అద్భుతమైన ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టారు ఇంజనీర్లు. అందుకే దీనిని ఇంజనీరింగ్ అద్భుతమంటారని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు చెప్పారు.

"ప్లాంట్ నెట్‌ హెడ్ (కొండ పై భాగం) దాదాపు 9 వందల మీటర్ల ఎత్తులో ఉండటం, జల విద్యుత్ ప్లాంట్‌కు చాలా అనుకూలం. దీని వలన తక్కువ నీటితోనే ఎక్కువ విద్యుత్‌ను జనరేట్ చేయవచ్చు. ఇతర జల విద్యుత్ ప్లాంట్లకు లేనిది, మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకత ఇదే. జెన్‌కో పరిధిలో ఉన్న నాగార్జున సాగర్‌, శ్రీశైలం వంటి పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు నీటి కొరత వల్ల వర్షాకాలంలోనే విద్యుదుత్పత్తి చేస్తుంటాయి. మాచ్‌ఖండ్‌లో మాత్రం ఏడాదంతా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఏటా కేంద్ర విద్యుత్తు బోర్డు విద్యుత్ కేంద్రాలకు విధించే లక్ష్యాలను మాచ్‌ఖండ్‌ ఏటా మూడు నెలల ముందుగా డిసెంబరుకే చేరుకుంటుంది" అని మాచ్‌ఖండ్‌లో జల విద్యుత్ కేంద్రం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. చిరంజీవి బీబీసీతో చెప్పారు.

"నిర్మాణం ప్రారంభం నుంచి కూడా ఇక్కడ వాడే యంత్రాలు అన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇప్పటికీ వాటికి మరమ్మత్తులు చేస్తూ, కొత్తవాటితో పాటు వాడుతూనే ఉన్నాం. అప్పుడు 1960లో చూసిన టెక్నాలజీ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీ వరకు అన్నీ మాచ్‌ఖండ్‌లో చూడొచ్చు. ఒక రకంగా దీనిని ఒక మ్యూజియం అని చెప్పొచ్చు. వించ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రత్యేక ఆకర్షణే. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్లాంట్ మ్యూజియంతో సమానం" అని వై. చిరంజీవి చెప్పారు.

త్వరలో సామర్థ్యం పెంపు

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్ ప్లాంట్ ముందు నుంచి 120 మెగావాట్ల సామర్థ్యంతోనే నడుస్తోంది. అయితే దీనిని పెంచేందుకు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని మాచ్‌ఖండ్‌ జల విద్యుత్ కేంద్రం అధికారులు తెలిపారు.

"ఒక రోజుకు 2.88 మిలియన్ యూనిట్లు జనరేట్ చేయగలం. సాంకేతిక కారణాలతో ఏ రోజు కూడా ప్లాంట్ సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తి చేయలేదు. ఇది ఈ ప్లాంట్‌కున్న మరో రికార్డు. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ. 500 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసేందుకు ఒడిశా గవర్నమెంట్, ఆంధ్రా గవర్నమెంట్ ఒప్పందానికి వచ్చాయి. దీనికి సంబంధించి అధ్యయనం కోసం టాటా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించాం. అనుకున్నవన్ని జరిగితే...మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం కెపాసిటీ 150 మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉంది" అని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం సూపరింటెండెంట్ ఇంజనీరు టి. వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

మత్స్యగెడ్డతో మొదలై...బలిమెల మీదుగా గోదావరిలోకి

ప్లాంట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలాపుట్ రిజర్వాయర్ ఆధారంగా పని చేస్తున్న విద్యుత్ కేంద్రం మాచ్‌ఖండ్. విశాఖ జిల్లా పాడేరులోని మత్స్యగెడ్డ (మాచ్‌ఖండ్ నది) నుంచి మొదలైన దీని ప్రయాణం గోదావరి నదిలో ముగుస్తుంది.

"మాచ్‌ఖండ్‌ నదిలోని నీరు పాడేరు మీదుగా జోలాపుట్ జలాశయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రానికి ఉన్న డిమాండ్ బట్టి రోజుకు 2 వేల క్యూసెక్యుల వరకు నీటిని కిందకు వదులుతారు. అక్కడ నుంచి డైవర్షన్ డ్యాంకు చేరుకున్న ఆ నీరు డుడుమ చేరుకుంటుంది. డుడుమ వద్ద నీరు జలపాతంగా మారి 500 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది.

అక్కడ నుంచి వచ్చే నీటిని ఆరు మోటారు యూనిట్ల సహాయంతో మాచ్‌ఖండ్ పవర్ హౌస్‌లోకి నీరు చేరుతుంది. అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి అనంతరం మిగిలిన నీరు చిత్రకొండ రిజర్వాయరుకు చేరుకుంటుంది. ఆ నీరు ఒడిశాలోని బలిమెల రిజర్వాయకు 50శాతం, ఏపీలోని సీలేరుకు 50శాతం చేరుకుంటుంది. అనంతరం భద్రాచలం సమీపంలోని శబరి నదిలో చేరి గోదావరిలో కలుస్తుంది" అని మాచ్‌ఖండ్‌ పవర్ ప్లాంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యకిరణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)