గర్భిణి అయిన మహిళా ఫారెస్ట్ రేంజర్‌ను భర్త కళ్లెదుటే ఎందుకు కొట్టారు? ఎవరు కొట్టారు

    • రచయిత, రాహుల్ గైక్వాడ్
    • హోదా, బీబీసీ మరాఠీ

"మూడు నెలల గర్భిణి అయిన నా భార్యను ఆ ఇద్దరూ కొడుతూనే ఉన్నారు. చాలా తీవ్రంగా కొడుతుండటంతో నేను జోక్యం చేసుకుని నా భార్యను కాపాడాను".

ఈ విషయాన్ని సూర్యాజీ థోంబ్రే బీబీసీకి వివరించారు. ఆయన భార్య సింధు సనాప్ సతారా జిల్లా పల్సావాడే గ్రామంలో ఫారెస్ట్ గార్డ్ గా పని చేస్తున్నారు. ఆమె విధులు నిర్వహిస్తుండగా కొంత మంది ఆమె పై చేయి చేసుకున్నారు.

పల్సావాడే అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులను లెక్కించిన తర్వాత సింధు సనాప్ ఆమె భర్తతో కలిసి బేస్ కు తిరిగి వస్తుండగా, ఆ దంపతుల పై ఈ దాడి జరిగింది.

పల్సావాడే మాజీ సర్పంచ్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ రామ్ చంద్ర జంకర్ ఆయన భార్య ప్రతిభ జంకర్ కలిసి ఆ దంపతుల పై దాడి చేశారు.

వారు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దాడిని ఖండిస్తూ చాలా మంది ఆగ్రహంతో స్పందించారు. ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు బీబీసీ సతారా వెళ్లి దాడికి గురైన సింధు దంపతులను కలిసింది.

ఈ సంఘటన తీవ్రత వల్ల అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా సనాప్ ను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి గురైన రోజు జరిగిన సంఘటనను సింధు బీబీసీకి వివరించారు.

"నేను నాలుగు నెలల క్రితమే ఈ ప్రాంతానికి డిప్యుటేషన్ పై వచ్చాను. నేనిక్కడ చేరిన రోజు నుంచి జంకర్ నన్ను వేధిస్తూనే ఉన్నారు. నేను అటవీ శాఖ పనుల నిమిత్తం చెక్కులను క్లియర్ చేయడం లేదని ఆరోపిస్తూ నన్ను బెదిరించడం చేసేవారు. అలాగే, అడవిలో జంతువులను లెక్కించేందుకు ఆయన అనుమతి లేకుండా మహిళా కూలీలను ఎందుకు తీసుకుని వెళ్లానని అడిగేవారు."

"జనవరి 17న పశువుల లెక్కింపు కోసం ఇద్దరు కూలీలను తీసుకుని వెళ్ళినప్పుడు, నన్ను చంపేస్తానని జంకర్ భార్య కూడా బెదిరించారు. దీని గురించి నా భర్తతో మాట్లాడాను. జనవరి 19న మేం పశువుల లెక్కింపు పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వస్తుండగా, నేను మహిళా కూలీలను జంకర్ అనుమతి లేకుండా ఎలా తీసుకుని వెళతానని అడిగారు".

ఆ తర్వాత నా భర్తను చెప్పు తీసి కొట్టడం మొదలుపెట్టారు. నేను కలుగచేసుకోగానే, జంకర్, ఆయన భార్య కలిసి నా పై కూడా దాడి చేశారు" అని సింధు చెప్పారు.

కూలీలకు ఇవ్వాల్సిన నిధుల్లో అవకతవకలు జరగకుండా సనాప్ జంకర్ ను ఆపడంతో ఆయన ఆమె పై చాలా కోపంగా ఉన్నారు. ఆయన అనుమతి లేకుండా వారిని అడవిలోకి అడుగుపెట్టవద్దని అన్నారని, సనాప్ ఆరోపిస్తున్నారు.

సనాప్ కు ముఖంపై గాయాలయ్యాయి. ఈ దాడి తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. అయితే, వైద్య నివేదికలు ఇంకా రాలేదు.

"అధికారిక పనుల కోసం కూలీలను అడవిలోకి తీసుకుని వెళ్లేందుకు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి ప్రభుత్వ ఆదేశాలేమి లేవు" అని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్ జర్ వేటర్ సుధీర్ సోనా వాలే బీబీసీ మరాఠీ కి చెప్పారు.

"జనవరి 17న జంకర్ భార్య సనాప్ ను చంపేస్తానని బెదిరించడంతో ఆమె జనవరి 19న అడవిలోకి వెళ్ళినప్పుడు భర్తను కూడా వెంట పెట్టుకుని వెళ్లారు. జంకర్ సనప్ ను చాలా సార్లు అవమానించి బెదిరించడంతో, ఆమె భర్త కూడా ఆమెతో పాటు వెళ్లారు" అని సోనావాలే చెప్పారు.

అడవిలో జంతువుల లెక్కింపు పూర్తి చేసుకుని వారిద్దరూ వెనక్కి తిరిగి సతారా వస్తుండగా జంకర్ భార్య థోమ్బ్రే పై దాడి చేశారు.

"జనవరి 19న నేను జంకర్ తో మాట్లాడుతూ ఉండగా, ఆయన భార్య తన చెప్పు తీసుకుని నన్ను కొట్టారు. నా భార్య అడ్డుకున్నారు. దాంతో, ఇద్దరూ కలిసి ఆమెను కొట్టడం మొదలుపెట్టారు. వారు ఆమెను చాలా సార్లు అవమానించి బెదిరించారు.

కానీ, ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత నా మొబైల్ తీసి సంఘటనను షూట్ చేయడం మొదలుపెట్టాను. కానీ, ఆమెను గట్టిగా తోస్తూ ఉండటంతో, నేను జోక్యం చేసుకుని నా భార్యను కాపాడాను" అని చెప్పారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత జంకర్, ఆయన భార్య కొంత సేపు పరారీ అయ్యారు. చివరకు జనవరి 20 తెల్లవారుజామున 3 గంటలకు శిర్వాల్ లో జంకర్ ను ఆయన భార్యను అరెస్ట్ చేశారు.

పోలీసులు వారిద్దరినీ 7 రోజులు కస్టడీలో ఉంచమని కోర్టును కోరారు. సంఘటన వివరాలను సతారా పోలీస్ సూపరింటెండెంట్ అజిత్ బోరాడేకు కూడా తెలియచేసారు.

ఈ సంఘటన గురించి మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వారు చట్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

ఈ విషయంలో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమీషన్ అధ్యక్షురాలు రుపాలీ చకాన్కర్ కూడా పోలీసులను కోరారు.

"మహారాష్ట్రలో జాతీయ పులుల జనాభా లెక్కింపు జరుగుతోంది. పొద్దున్న పూట ఈ లెక్కింపు చేపడుతున్నాం. ప్రతీ ఫారెస్ట్ గార్డ్ తమ ప్రాంతాల్లో పులులు లేదా ఇతర వన్య మృగాల గురించి సమాచారం సేకరించాల్సి ఉంది. ఆ సమాచారాన్ని వాళ్ళు మాకు అందించాల్సి ఉంది" అని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సుధీర్ సోనా వాలే చెప్పారు.

"సనాప్ ఆమె భర్త అధికారిక విధులు నిర్వహిస్తుండగా వారి పై జంకర్ దంపతులు దాడి చేశారు" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)