'అమర జవాను జ్యోతి'ని శాశ్వతంగా ఆర్పివేస్తున్నారా? అసలేం జరుగుతోంది? సామాజిక మాధ్యమాల్లో నేతలు ఏం అంటున్నారు?

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గత 50 ఏళ్లుగా అలుపెరగకుండా జ్వలిస్తోన్న 'అమర జవాను జ్యోతి' నేటి నుంచి కనుమరుగు కానుంది.

ఈ జ్యోతిని 'నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యద్ధ స్మారకం)’’ వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేయనున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

ఇండియా గేట్ వద్ద ఉన్న 'అమర జవాను జ్యోతి'ని ఆర్పివేసి, శుక్రవారం, దాన్ని నేషనల్ వార్ మెమోరియల్‌లో విలీనం చేస్తారని గురువారం నుంచి అనేక కథనాలు వెలువడుతున్నాయి.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

'అమర జవాను జ్యోతి'ని ఆర్పివేస్తారని, దాన్ని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేస్తారని వస్తోన్న కథనాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''మన వీర సైనికుల కోసం నిరంతరం వెలుగుతోన్న అమర జ్యోతిని ఆర్పివేయాలని అనుకోవడం చాలా బాధాకరం. దేశభక్తిని, సైనికుల త్యాగాలను కొంతమంది అర్థం చేసుకోలేరు. మీరేం బాధపడకండి. మన అమర జవాన్ల కోసం, మేం మరోసారి అమర జవాన్ జ్యోతిని వెలిగిస్తాం'' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఈ చర్యను 'జాతీయ విషాదం, చరిత్రను చెరిపివేయడం' అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ వర్ణించారు.

''ఇప్పుడు జరుగుతున్నదంతా చరిత్రను తిరగరాసే ప్రయత్నం. ఇదో జాతీయ విషాదం. అమర జ్యోతిని, వార్ మెమోరియల్‌లో కలపడమంటే చరిత్రను తుడిచిపెట్టడమే. బీజేపీ, నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మించింది. అంటే దీనర్థం అమర జవాను జ్యోతిని ఆర్పివేసే హక్కు వారికి ఉన్నట్లు కాదు'' అని ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐతో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఈ ప్రభుత్వం విలువ ఇవ్వదని మరో కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.

''50 ఏళ్లు నిర్విరామంగా వెలిగిన జ్యోతిని ఆర్పివేయనున్నారనే వార్తల్ని భారత మాజీ ఎయిర్‌ఫోర్స్ ఫైలట్‌గా జీర్ణించుకోలేకపోతున్నాను'' అని నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా దీని గురించి స్పందించారు. జ్యోతిని ఆర్పివేయడం లేదని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతిని కలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

జాతీయ యుద్ధ స్మారకంతో పాటు అమర జవాను జ్యోతి వద్ద కూడా జ్యోతులు నిరంతరంగా వెలిగించాలని పలువురు సోషల్ మీడియా యూజర్లు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

అక్కడ వెలిగించడమే నిజమైన నివాళి: ప్రభుత్వ వర్గాలు

''1971 యుద్ధ వీరుల సంస్మరణార్థం అమర జవాను జ్యోతిని నిర్మించారు. కానీ అక్కడ వారి పేర్లు లేవు. మొదటి ప్రపంచ యద్ధం, ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధాల్లో మరణించిన సైనికులు పేర్లు ఇండియా గేట్ వద్ద ఉన్నాయి. ఇది మన వలసవాద పాలనకు చిహ్నం. నేషనల్ వార్ మెమోరియల్‌లో 1971 యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల పేర్లతో పాటు వివిధ యుద్ధాల్లో అమరులైన వారి పేర్లు ఉన్నాయి. అక్కడ జ్యోతిని వెలిగించడమే నిజమైన నివాళి'' అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

అమర జవాను జ్యోతి, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నిరంతరంగా వెలుగుతూనే ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ట్వీట్ చేశారు.

‘‘70 ఏళ్ల పాటు జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేకపోయిన వారు ఇప్పుడు అమర జవాను జ్యోతి గురించి మాట్లాడుతున్నారు'' అని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ సెహ్రావత్ ట్వీట్ చేశారు.

అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్ని మంచి నిర్ణయమని భారత ఆర్మీ మాజీ డీజీఎంఓ, లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా (రిటైర్డ్) పేర్కొన్నట్లు వార్తా సంస్త ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

'అమర జవాను జ్యోతి' చరిత్ర

మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు నివాళిగా బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌లో ఇండియా గేట్‌ను నిర్మించింది.

ఆ తర్వాత, 1971 పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అక్కడ 'అమర జవాను జ్యోతి'ని ఏర్పాటు చేశారు. 1972 గణతంత్ర దినోత్సవం రోజున ఈ జ్యోతిని వెలిగించారు. అప్పటినుంచి ఇది నిరంతరంగా వెలుగుతూనే ఉంది.

ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా తొలుత ఈ జ్యోతికి వందనం సమర్పించిన తర్వాతే, ప్రధాని జెండా కార్యక్రమానికి హాజరవుతారు.

నేషనల్ వార్ మెమోరియల్

మరోవైపు 2019 ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 'నేషనల్ వార్ మెమోరియల్'ను ప్రారంభించారు.

అనేక యుద్ధాల్లో మరణించిన భారత సైనికుల జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేశారు.

176 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో అమర జవాన్ జ్యోతికి సమీపంలోనే ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఇక్కడ కూడా ఒక జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఇందులోనే అమర జవాను జ్యోతిని కలుపనున్నారు.

1962 నుంచి వివిధ యుద్ధాల్లో మరణించిన 25,942 మంది జవాన్ల పేర్లను, స్మారకం చుట్టూ ఉన్న 16 గోడలపై ఏర్పాటు చేశారు.

మహా భారతంలోని చక్రవ్యూహం తరహాలో ఈ స్మారకంలో కూడా నాలుగు చక్రాలను ఏర్పాటు చేశారు. వీటికి రక్షక్ చక్ర, త్యాగ్ చక్ర, వీర్‌ చక్ర, అమర్ చక్ర అని పేర్లు పెట్టారు.

ఇవే కాకుండా రామ్ సుతార్ తయారు చేసిన 6 రాగి కుడ్యచిత్రాలను ఈ స్మారకంలో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)