You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జనరల్ బిపిన్ రావత్: గూర్ఖా రైఫిల్స్ నుంచి తొలి సీడీఎస్ వరకు..
జనరల్ బిపిన్ రావత్ పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. భారత సైన్యంలో ఫోర్ స్టార్ జనరల్ ఆయన.
2020 జనవరి 1న దేశానికి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ రావత్ బాధ్యతలు చేపట్టారు. భారత ఆర్మీలో అత్యంత శక్తిమంతమైన అధికారి ఈయనే.
జనరల్ బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
1958 మార్చి 16న ఉత్తరాఖండ్‌లోని పౌరీకి చెందిన రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు జనరల్ రావత్. డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో చదువుకున్నారు. తరువాత, ఆయన ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు.
1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 11వ గూర్ఖా రైఫిల్స్ విభాగంలోని 5వ బెటాలియన్‌లో చేరారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనరల్ రావత్‌కు 'స్వార్డ్ ఆఫ్ ఆనర్' అవార్డు లభించింది.
అక్కడే ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో పాటు ఆర్మీ శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెంట్రల్ రీజియన్‌లో లాజిస్టిక్స్ డివిజన్ అధికారిగా పనిచేశారు. ఆర్మీ సెక్రటరీ విభాగంలో అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా కల్నల్ హోదాలో పనిచేశారు.
అలాగే, కిబితు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు సెక్టార్‌లో తన బెటాలియన్ (గూర్ఖా రైఫిల్స్ విభాగంలోని 5వ బెటాలియన్)కు కల్నల్‌గా నాయకత్వం వహించారు. బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందిన తరువాత సోపోర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్‌లో 5 సెక్టార్‌కు కమాండర్‌గా పనిచేశారు.
విదేశాలలోనూ సేవలు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చాప్టర్ VII మిషన్‌లో బహుళ జాతి బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. అక్కడ ఆయనకు రెండుసార్లు 'ఫోర్స్ కమాండర్ కమెండేషన్' అవార్డు లభించింది. మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందిన తరువాత, బిపిన్ రావత్ 19వ పదాతిదళ విభాగం (ఉరి) కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం, లెఫ్టినెంట్ జనరల్‌గా దిమాపూర్‌లోని III కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. తరువాత పుణెలోని సదరన్ ఆర్మీకి నేతృత్వం వహించారు.
ఆర్మీ కమాండర్ గ్రేడ్‌కు పదోన్నతి పొందిన తరువాత, 2016 జనవరి 1న జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (GOC-in-C) సదరన్ కమాండ్‌గా జనరల్ రావత్ బాధ్యతలు చేపట్టారు. కొద్దికాలం తరువాత 2016 సెప్టెంబర్ 1న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు.
2016 డిసెంబర్ 17న భారత ప్రభుత్వం జనరల్ రావత్‌ను 27వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. నేపాలీ ఆర్మీకి జనరల్ రావత్ గౌరవ జనరల్ కూడా. 2019లో అమెరికా పర్యటన సందర్భంగా జనరల్ రావత్ పేరును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.
సుదీర్ఘ సర్వీస్
జనరల్ బిపిన్ రావత్ 40 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో వివిధ పదవుల్లో సేవలు అందించారు. ఈ కాలంలో ఆయనకు పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం లభించాయి. జనరల్ బిపిన్ రావత్ 2019 డిసెంబర్ 31న భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. 2020 జనవరి 1 నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. భారత సైన్యంలోని వివిధ విభాగాలను సమన్వయం చేయడం, సైనిక ఆధునికీకరణ వంటి ముఖ్యమైన అంశాలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతల్లో భాగం.
భారత ఈశాన్య ప్రాంతంలో తీవ్రవాదాన్ని తగ్గించడంలో ఆయన చేసిన కృషి ఎన్నో ప్రశంసలు అందుకుంది. 2015లో మియన్మార్‌లోకి ప్రవేశించిన ఎన్ఎస్‌సీఎన్-కే తీవ్రవాదులకు వ్యతిరేకంగా భారత సైన్యం చేసిన పోరాటానికి జనరల్ రావత్ ప్రశంసలు అందుకున్నారని, బాలాకోట్ దాడిలో కూడా ఆయన పాత్ర ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
అనేక విభాగాల్లో డిగ్రీలు
వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన జనరల్ బిపిన్ రావత్ నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి వివిధ విభాగాల్లో పట్టభద్రులయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయనాలపై జనరల్ బిపిన్ రావత్ చేసిన పరిశోధనకుగాను మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి 2011లో ఆయనకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) లభించింది.
అమెరికాలోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో సైనిక కమాండర్లకు ఇచ్చిన శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. జనరల్ బిపిన్ రావత్ జాతీయ భద్రత, నాయకత్వంపై అనేక వ్యాసాలు రాశారు. ఇవి చాలా పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: 14 మంది ప్రయాణికుల్లో 13 మంది మృతి చెందారన్న కలెక్టర్
- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్: ఆయన చేయగలిగే, చేయలేని పనులు ఏమిటంటే..
- నాగాలాండ్ హింస: 70 ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ ఉద్యమ చరిత్ర ఏంటి?
- రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణ శిక్ష, 33 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన కోర్టు
- వసీం రిజ్వీ ఇప్పుడు జితేంద్ర త్యాగి అయ్యారు.. ఇస్లాం విడిచిపెట్టి హిందువుగా మారారు
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- మైక్ టైసన్: 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్'
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)