You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబయిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత శరద్ పవార్‌ను కలిసిన అనంతరం రిపోర్టర్లతో మాట్లాడుతూ '' యూపీఏ అంటే ఏంటి? యూపీఏ లాంటిదేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు.
నిజానికి, యూపీఏకు శరద్ పవార్ నేతృత్వం వహిస్తారా అని బుధవారం రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ విధంగా స్పందించారు. కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు.
''ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక్కరే పోరాడలేరు. బలమైనవారే దానికి వ్యతిరేకంగా నిలబడగలరు'' అని మమత పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ను దాటి అనేక పర్యటనలు చేశారు. ప్రతిపక్ష నాయకులను కలిశారు.
ఇదంతా, భారతదేశ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ చేస్తోన్న ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా యూపీఏలో భాగంగా ఉండేది. కానీ 2012లో తృణమూల్ కాంగ్రెస్ ఆ కూటమి నుంచి బయటకొచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు తర్వాత కూటమిలో పార్టీల సంఖ్య తగ్గిపోయింది.
యూపీఏ అంటే ఏంటి?
2004 నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్ (యూపీఏ) ఏర్పడింది.
అప్పటినుంచి యూపీఏ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.
మొదట్లో వామపక్షాలు ఈ కూటమిలో కీలక భాగంగా ఉండేవి. 2008లో అవి కూటమి నుంచి తప్పుకున్నాయి.
ఇది మాత్రమే కాకుండా, యూపీఏకు చెందిన చాలా మిత్రపక్షాలు తమ అభిప్రాయాలు చెలామణీ చేసుకునేందుకు ఒత్తిడి రాజకీయాలను చేశాయి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో యూపీఏలో భాగంగా ఉన్న చాలా మిత్రపక్షాలు, 2004 నుంచి 2014 మధ్య కాలంలో కూటమి నుంచి తప్పుకున్నాయి.
2009లో యూపీఏ కూటమి అనూహ్య విజయాన్ని అందుకుంది. అయితే 2014లో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ చేతిలో యూపీఏ కూటమి ఘోర పరాజయం పాలైంది.
2004 ఎన్నికలకు ముందు, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ పార్టీ 'భారత్ మెరిసిపోతోంది' అనే నినాదాన్ని ఇచ్చింది.
కానీ ఆ ఎన్నికల్లో 145 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 138 సీట్లు లభించాయి.
అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్న సీట్లలో భారీ వ్యత్యాసం ఏం లేదు. దీంతో బీజేపీకి అధికారం దక్కకూడదనే లక్ష్యంతో సెక్యులర్ భావాలున్న పార్టీలంతా ఏకం కావడం ప్రారంభించాయి. కాంగ్రెస్‌కు అధిక సీట్లు దక్కడంతో కూటమి పగ్గాలు ఆ పార్టీ చేతికే వెళ్లాయి.
2004 ఎలక్షన్ల అనంతరం ఏర్పడిన పరిస్థితుల్లో, అప్పటి సీపీఎం పార్టీ జనరల్ సెక్రటరీ హర్‌కిషన్ సింగ్ సుర్జీత్ నేతృత్వంలో పొత్తుకు ప్రయత్నాలు జరిగాయి.
నాలుగు వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్ బ్లాక్ కూటమి ఏర్పాటుకి మద్దతు ఇచ్చాయి. కానీ వాటికి ప్రభుత్వంలో చోటు దక్కలేదు.
ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని వామపక్ష పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సీఎంపీ)పై 2004 మే 14న సంతకం చేశాయి.
కాంగ్రెస్, వామపక్షాలు కాకుండా మరో 14 పార్టీలు కూడా యూపీఏలో చేరాయి. ఆర్‌జేడీ, డీఎంకే, ఎన్‌సీపీ, పీఎంకే, టీఆర్‌ఎస్, జేఎంఎం, ఎండీఎంకే, ఏఐఎంఐఎం, పీడీపీ, ఐయూఎంఎల్, కేసీ (జే), ఆర్‌పీఐ (జి), ఆర్‌పీఐ (ఎ) పార్టీలతో కూటమి ఏర్పడింది.
బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఈ కూటమికి చెందిన నేతలు తొలుత సెక్యులర్ అనే పదం వచ్చేలా దీనికి పేరు పెట్టాలని భావించారు. కానీ కూటమికి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అనే పేరు బావుంటుందని తమిళనాడు నేత ఎం. కరుణానిధి ప్రతిపాదించారు. దీనికి మిగతా నాయకులు అంగీకరించారు.
2004 మే 22న భారతదేశ ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్, లోక్ జనశక్తి పార్టీ అప్పటి అధ్యక్షుడు రామ్ విలాస్ పాసవాన్, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే నేత ఎ. రాజా, టీఆర్ బాలు, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన శిబూ సోరెన్, పీఎంకే నేత అంబుమణి రామ్‌దాస్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
యూపీఏకు షాక్
లౌకికవాదం (సెక్యులరిజం) ప్రాతిపదికగా ఏర్పడిన ఈ కూటమికి ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ 2006లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కూటమి నుంచి బయటకొచ్చింది.
సీఎంపీ ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆరోపిస్తూ ఎండీఎంకే నాయకుడు వైకో 2007లో కూటమిని వదిలిపెట్టారు.
కానీ దీనికి 2008లో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత్, అమెరికాల మధ్య న్యూక్లియర్ ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈ ఒప్పందం అంశంలో భారత ప్రభుత్వం ముందుకే వెళ్లడంతో, వామపక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి.
దీంతో యూపీఏ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం నిలబడింది.
తర్వాత 2009లో ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కారణంగా జమ్ముకశ్మీర్‌కు చెందిన పీడీపీ, తమిళనాడు పార్టీ పీఎంకే కూటమి నుంచి తప్పుకున్నాయి.
2009లో యూపీఏ
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపడింది. 206 సీట్లను గెలుచుకుంది. ఈ సమయంలో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కూటమిలో చేరాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా మమతా బెనర్జీకి పదవి లభించింది.
కానీ ఈసారి యూపీఏకు వామపక్షాలు మద్దతు తెలపలేదు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీకి ప్రభుత్వంలో చోటు దక్కలేదు
అయినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ తరహాలోనే ఆర్‌జేడీ కూడా బయటి నుంచే కూటమికి మద్దతునిచ్చింది.
2012లో కూటమి నుంచి మమతా బెనర్జీ తప్పుకున్నారు. ఆతర్వాత వివిధ కారణాలు చూపిస్తూ డీఎంకే సహా అనేక ఇతర పార్టీలు కూటమి నుంచి వైదొలిగాయి.
కాంగ్రెస్ పతనం
యూపీఏ-2 హయాంలో అవినీతికి వ్యతిరేకంగా దేశంలో భారీ ప్రజాఉద్యమం నడిచింది. 2జీ స్పెక్ట్రమ్‌తో పాటు బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన వార్తలు మీడియాలో తరచూ ముఖ్యాంశాలుగా నిలిచాయి.
దీంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లకే పరిమితమైంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన అతితక్కువ సీట్లు ఇవే.
గత ఏడేళ్లలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత మరొకటిగా అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. చాలామంది అగ్రనేతలు కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. కేంద్రంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది.
''కాంగ్రెస్ పాలసీలు, ముఖ్యంగా యూపీఏ-2 హయాంలో ప్రభుత్వ వైఫల్యం... సమాజంలోని ప్రతీ వర్గంలో కాంగ్రెస్ పట్ల ఆదరణ తగ్గడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా కార్పొరేట్లు, సమాజంలోని ఉన్నత వర్గాలు కాంగ్రెస్‌ను తిరస్కరించాయి'' అని రాజకీయ విశ్లేషకులు ఉర్మిలేశ్ చెప్పారు.
ఒక రకంగా చూస్తే, 2014 ఎన్నికల తర్వాత నుంచే సాంకేతికంగా యూపీఏ అనేది మనుగడలో లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు కూడా యూపీఏ అనే పదానికి బదులుగా 'ఒకే రకమైన భావజాలం ఉన్న పార్టీలు' అని సంభోదించాయి.
ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. కానీ దాన్ని యూపీఏగా పరిగణించడం లేదని ఉర్మిలేశ్ ఎత్తి చూపారు.
మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యల అర్థం ఏంటి?
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తన సత్తా నిరూపించుకున్నారు. బీజేపీని ఓడించారు. అక్కడ గెలిచేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది.
అయినప్పటికీ విజయం మమతా బెనర్జీ పార్టీనే వరించింది. ఆమె పెద్ద నాయకురాలిగా ఎదిగారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పొత్తుతో కాంగ్రెస్ బరిలో దిగింది. కానీ ఈ పొత్తు పెద్దగా ప్రభావం చూపించలేదు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే, జాతీయ స్థాయిలో తన గుర్తింపును, ప్రభావాన్ని పెంచుకోవడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారు.
కానీ నిపుణులు మాత్రం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి మమతా బెనర్జీ ఒక రకమైన భ్రాంతిలో ఉంటున్నారని భావిస్తున్నారు.
''ఎన్నికల సమయంలో బీజేపీ, మత రాజకీయాలపై ఆమె ఎదురుదాడి చేసిన తీరుకి, ఇప్పటికీ ఆమెలో ఏదో తేడా కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుగా ఎన్నికల బరిలోకి దిగడం మమతా బెనర్జీకి చాలా కోపం తెప్పించిందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు సూచించాయి. ఇంత ముఖ్యమైన ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని మమత భావిస్తున్నారు'' అని ఉర్మిలేశ్ పేర్కొన్నారు.
ఇప్పుడు యూపీఏ లేదా?
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగే ప్రతిపక్షాల సమావేశాల్లో టీఎంసీ కూడా పాల్గొనేది. కానీ ఇటీవల కొన్ని నెలలుగా ఈ సమావేశాలకు దూరంగా ఉండేందుకు తృణమూల్ ప్రయత్నించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ సారథ్యంలో జరిగిన ప్రతిపక్ష సమావేశాలకు కూడా టీఎంసీ దూరంగా ఉంది. టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియాన్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ''టీఎంసీ, కాంగ్రెస్‌కు మిత్రపక్షం కాదు'' అని ఆయన ట్వీట్ చేశారు.
డీఎంకే, ఎన్‌సీపీ, వామపక్షాలు సహా మొత్తం 10 పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, ఒకవేళ భవిష్యత్‌లో ప్రతిపక్ష పార్టీలతో ఒక కూటమి ఏర్పడితే దాని స్వరూపం ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది
''ఒకవేళ భవిష్యత్‌లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక కూటమిగా ఏర్పడితే, దానికి యూపీఏ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక టెక్నికల్ సమస్యగానో లేదా పేరు సమస్యగానో భావించకూడదు ఎందుకంటే ఇది ఒక రాజకీయ అంశం. యూపీఏ లేదు అని మమత వ్యాఖ్యానించడం సరికాదని నా అభిప్రాయం'' అని ఉర్మిలేశ్ చెప్పుకొచ్చారు.
మమతా బెనర్జీతో పాటు ఆమె పార్టీకి చెందిన నేతల వ్యాఖ్యల ప్రకారం చూస్తే మాత్రం, ఆమె కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలంటే ఇంకా చాలా శ్రమపడాలి. దీని గురించి మాట్లాడుతూ '' విపక్షాల ఐక్యతలో ఆమే కీలకం అని మమతా బెనర్జీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఆమెను ఒప్పించి ఉండొచ్చు. అందుకే ఆమె ఈ ప్రయత్నాలు చేస్తుండొచ్చు. లేదా కాంగ్రెస్, పెద్ద పార్టీ అయినప్పటికీ విపక్షాలకు నేతృత్వం వహించే అవకాశం తనకూ దక్కాలని మమతా బెనర్జీ అనుకుంటున్నారేమో'' అని ఉర్మిలేశ్ చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఎన్‌సీపీ నేత శరద్ కుమార్ యూపీఏలో కూడా భాగంగా ఉన్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ సమావేశం వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. కానీ ఆయనతో మమత సమావేశం కావడం వల్ల మరో విస్తృత కూటమి ఏర్పాటు కానుందనే అంచనాలకు ఊతమిచ్చినట్లయింది.
కానీ ఇక్కడ ఎదురయ్యే ప్రశ్నేంటంటే... కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి ఎదురునిలిచే పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యమేనా?
''ప్రతిపక్షంలో ఇప్పటికీ కాంగ్రెసే పెద్ద పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి తృణమూల్‌కు లేదు. తృణమూల్ ఒక ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీకి చెందిన నేతల ప్రభావం కూడా ఒక నిర్ధిష్ట ప్రాంతానికే పరిమితమై ఉంటుంది.''
''కశ్మీర్ నుంచి కేరళ వరకు కాంగ్రెస్‌కు నాయకులు, సంస్థలు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురలేని ప్రదేశం లేదు. కాంగ్రెస్ అనేది చాలా పాత పార్టీ. దానికి సొంతమైన కొన్ని బలహీనతలు, లోటుపాట్లు ఉన్నాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ కంటే భిన్నమైన, విశాలమైన స్థాయిలో జాతీయ గుర్తింపును కలిగి ఉంది'' అని ఉర్మిలేశ్ వివరించారు.
కాంగ్రెస్‌కు చెందిన అనేకమంది నేతలను ఇటీవల మమతా బెనర్జీ తన పార్టీలో చేర్చుకున్నారు. నార్త్ఈస్ట్ నుంచి గోవా వరకు ఆమె అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మమత మారలేరని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం మరోసారి కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షానికి సారథ్యం వహించేందుకు కాంగ్రెస్‌కు ఉన్న సామర్థ్యంపై ఆయన విమర్శలు చేశారు. గత పదేళ్లలో జరిగిన 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ... ఇకనైనా ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించడానికి అనుమతించాలి అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు నాయకత్వం అనేది దైవిక హక్కు కాదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశాంత్ కిశోర్ పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పుల గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు.
ప్రస్తుతం ప్రతిపక్ష నాయకత్వానికి సంబంధించి మమతా బెనర్జీ కొత్త చర్చకు దారి తీశారు.
ప్రతిపక్షానికి నాయకత్వం వహించాలనే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిన్నాపెద్ద నేతల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్రం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)